చదువు నేర్పిన రోజుల్లో..
నేను మొదట ట్యూషన్ కోసం తొమ్మిది, పది తరగతుల పిల్లల్ని మాత్రమే తీసుకున్నప్పటికీ రానురానూ నా పేరు ప్రఖ్యాతులు ఈ దేశం ఎల్లలు దాటి (? ) విపరీతంగా వ్యాపించడం వల్ల మరి కొంతమంది మా దగ్గరికి వచ్చి ‘జర మా పిల్లలకు కూడా చదువు చెప్పండి’ అని అడగడం మొదలుపెట్టారు.
అలా ఎక్కువ క్లాసులు తీసుకోవడం వల్ల ఎవరికీ న్యాయం చేయలేనని నేను వద్దనేదాన్ని. కానీ వాళ్లు ‘మీరు చెప్పకపోయినా పర్వలేదు, మీ ట్యూషన్ల పిల్లలు కూర్చుంటే చాలు. వాళ్లు హోమ్‌వర్క్ చేసుకుంటరు, బాగ చదువుకుంటరు. ఇంటి దగ్గర మా మాట ఇంటలేరు, బాగా ధూం జేస్తున్నరు, ఊరికే ఆడుకుంటున్నరు’ అని బతిమిలాడేవారు. వాళ్లకేం తెలుసు నా దగ్గర బాగా ఆడుకోవడానికే వస్తున్నారని. కొన్నాళ్లకు శ్రీనివాస్, పద్మావతి అని అన్నాచెల్లెళ్లు ట్యూషన్ కి రావడం మొదలుపెట్టారు. వాళ్ల నాన్న పోస్ట్ మాస్టర్. పిల్లలు ఏ మాత్రం చదవడం లేదని వాళ్ల అమ్మ చాలా బతిమిలాడిన మీదట ఒప్పుకొన్నాను. మొదట్లో మా నాన్న కరణీకం పేపర్లన్నీ పెట్టి ఉండే టేబుల్, ఒక కుర్చీ వేసి ఉన్న ముందు గదిలో పిల్లలకు డిస్ట్రబెన్స్ లేకుండా తలుపులు పెట్టుకుని ట్యూషన్ చెప్పేదాన్ని. పిల్లలు ఎక్కువ అయ్యేసరికి మా ఇంట్లో గ్రిల్స్ ఉన్న ముందు గది లాంటి హాలుకి కూడా నా ట్యూషన్ సామ్రాజ్యం విస్తరించింది.
ఈ శ్రీనివాస్, పద్మావతిల గురించి కొంచెం చెప్పాలి. అన్నాచెల్లెళ్లో, అక్కాతమ్ముళ్లో గానీ, ఇద్దరూ ఒకటే క్లాసు. శ్రీనివాస్ ఎందుకనో ఎప్పుడూ నిద్ర పోతుండేవాడు. అసలు నిద్రపోవడానికే పుట్టినట్టుగా ఉండేవాడు. అయితే కూర్చోవడంలో ఎక్కడలేని తెలివితేటలు చూపించేవాడు. నా ఈజీ చైర్ పక్కనే కొంచెం వెనగ్గా దాదాపుగా అందులో దూరినట్టుగా కూర్చునేవాడు. నేను మాటిమాటికి వెనక్కి చూసేదాన్ని కాదు గనుక అతడు పడుకునేది గమనించేదాన్ని కాదు. ఎంత చదివినా శ్రీనివాసుకు ఒక్క ముక్క నోటికి వచ్చేది కాదు. అతనికి ఇంకో పిచ్చి అలవాటు ఉండేది. నిలబెట్టి ఓ ప్రశ్న అడిగామనుకోండి, తోచిన జవాబొకటి చెప్పేవాడు. అది తప్పో రైటో నేను చెప్పేలోగానే ఆ జవాబు తప్పనిపించేదో ఏమో వెంటనే అమాంతం మణికట్టు నోట్లో పెట్టుకొని కొరుక్కునేవాడు. లేదా మణికట్టుకీ, మోచేతికీ మధ్య భాగం కొరుక్కునేవాడు. మరోసారి పాత సినిమాల్లో ఎన్టీఆర్ లాగా పిడికిలి నోట్లో పెట్టుకుని కొరుక్కునేవాడు. ‘ఎందుకయ్యా నాయనా, అట్లా కొరుక్కుంటున్నావ్? నువ్వు చెప్పిన జవాబు కరెక్టే!’ అనగానే మళ్లీ ఆనందోత్సాహాల మధ్య చెయ్యి కొరుక్కునేవాడు. ఆ అలవాటు మాన్పించాలని ఎంతో ప్రయత్నించాను గానీ, కుదరలేదు.
చాలా ఏళ్లపాటు మా ఊర్లోనే ఉండి వెళ్లారు గనుక మధ్య మధ్య మా ఇంటికి మా కజిన్ రాగక్క బమ్మెర నుంచి వచ్చి వారం రోజులో పది రోజులో ఉండి వెళ్తూ ఉండేది. మా కజిన్స్ అందరమూ చాలా క్లోజ్ గా కబుర్లు చెప్పుకొంటూ సరదాగా ఉండేవాళ్లం. డిసిప్లిన్ విషయంలో రాగక్క చాలా స్ట్రిక్ట్. నేను ట్యూషన్ చెప్పేటప్పుడు ఎవరైనా ఇంటి ముందరికి వచ్చినా, ఇంట్లోంచి బయటికి, బయటి నుంచి లోపలికి వెళ్లాలన్నా పిల్లల మధ్య నుంచే వెళ్లాల్సి వచ్చేది. నాన్న కూడా ఆ సమయంలో పక్కనున్న ఖాళీ జాగాలోనో, ఇంట్లోనో గడిపేవాడు. పైగా పరీక్షలప్పుడు పిల్లల చేత జవాబులు అప్పజెప్పించుకునే బాధ్యతను కొంత నాన్నకే అప్పగించేదాన్ని. నాన్న ఓపికగా వినడమే కాదు, వాళ్లు మర్చిపోయిన దగ్గర హింట్స్ ఇస్తుండేవాడు నేను చూడకుండా.
రాగక్క కూడా అప్పుడప్పుడూ ట్యూషన్ గదిలోకి వచ్చి పిల్లల్ని సూపర్ వైజ్ చేసేది. అయితే తన టార్గెట్ ఎప్పుడూ ఈ శ్రీనివాసే. ఆ పిల్లవాడు కొంచెం అలా కళ్లు మూసి నిద్రలోకి జోగాడో లేదో నెత్తి మీద ఒక్క మొట్టికాయ ఇచ్చేది. అతడు వెంటనే దిగ్గున లేచి పుస్తకం పట్టుకునేవాడు. రోజులో రెండు మూడు సార్లయినా అతడికి నెత్తి మీద మొట్టికాయలు ఇవ్వకుండా ఉండేది కాదు. ‘ఏందే రమా! నువ్వు అసలు ఏం చూస్తున్నవ్? గీ శ్రీనివాసు ఎప్పుడు చూసినా నిద్రపోతునే ఉంటడు. నువ్వేమీ అనవేంది ? వాడికి ఆరంగ ఆరంగ ఒకటో రెండో మొట్టికాయలు ఇస్తూ వుంటేనే సెట్ అయితడు’ అని చెప్పేది.
‘అయ్యో అట్లా పిల్లల్ని కొట్టుడు మంచిది కాదు. కావాలంటే నిలబెట్టి చదివిస్త గానీ, కొట్టకే!’ అని నేను అనేదాన్ని.‘కొట్టకుంటే ఇట్లాటోళ్లకు భయం ఉండదే! సరే తియ్యి. కొట్టను’ అని రాగక్క వెంటనే మరో ప్రణాళిక రచించింది. ‘లే! లేచి పొయ్యి మొహం కడుక్కోని ఇంటి చుట్టు అయిదు రౌండ్లు ఉరికి రా పో!’ అని నా ప్రమేయం లేకుండానే అతడికి శిక్ష విధించేది. రాగక్క ఉన్న వారం రోజులు చాలా అలెర్ట్‌గా ఉండేవాడు శ్రీనివాస్.
శ్రీనివాస్ చెల్లెలు పద్మ పెద్దపెద్ద కళ్లతో చాలా అందంగా ఉండేది. ఒక్కో యాంగిల్లో జయప్రదలా అనిపించేది. ఆ పిల్ల జీవితంలో ఎవ్వరికీ జవాబుదారీగా ఉండొద్దని అనుకుందో ఏమో గానీ, తనని ఏ ప్రశ్న అడిగినా జవాబు వచ్చేది కాదు. పెదాలు బిగించి పెద్దపెద్ద కళ్లేసుకుని నా వైపు మింగేసేలాగా చూస్తూ ఉండేది. నేను ఎంతో ప్రేమగా స్నేహహస్తం చాచి ఆ పిల్లని మచ్చిక చేసుకుని బుజ్జగించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆ పిల్ల ధోరణి అలాగే ఉండేది. ఏ పుస్తకం పట్టుకొని ఏ ప్రశ్న అడిగి జవాబు చెప్పమన్నా జవాబివ్వడం మా ఇంటా వంటా లేదన్నట్టు చూసేది. ‘ఏంటమ్మా, పాఠం అర్థం కాలేదా? ప్రశ్న అర్థం కాలేదా? గుర్తుండటం లేదా?’ అంటూ నేనెన్ని భేతాళ ప్రశ్నలు అడిగినా జవాబు శూన్యం. ‘సిరిసిరి మువ్వ’ సినిమాలో జయప్రద లాగే ఉండేది. అయితే నా దగ్గర చదివిన కొన్నాళ్లకే క్లాసులో మంచి మార్కులు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. ఓ రోజు వాళ్లమ్మ వచ్చి ‘మా పద్మకు అన్ని సబ్జెక్ట్స్‌లో మంచి మార్కులు ఒచ్చినయ్ టీచర్! చాన సంతోషమయింది!’ అని సంబరపడింది. నాకూ ఆనందమేగా!!
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- I was
- In the days
- Taught
- when
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

