Faria Abdullah | హైదరాబాద్ ‘జాతిరత్నం’.. ఫరియా అబ్దుల్లా! మొదటి సినిమాతోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నది. సొంతపేరుతో కన్నా.. ‘చిట్టి’గానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అక్కినేని వారసుల సరసన తళుక్కున మెరిసింది. ‘లైక్.. షేర్ అండ్ సబ్‌స్క్రైబ్!’ అంటూ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా.. ‘ఆ ఒక్కటీ అడక్కు!’ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన పొడుగు కాళ్ల సుందరితో కార్వాన్ ముచ్చట్లు!
అమ్మా, నాన్న, ఓ చిట్టి చెల్లి.. ఇదే నా ఫ్యామిలీ. మా తల్లిదండ్రులు చాలా ఓపెన్ మైండెడ్. చిన్నప్పటి నుంచీ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ‘అది చేయొద్దు – ఇది చేయొద్దు’.. అంటూ నాకు ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. నలుగురితో మంచిగా ఉండాలి. మంచి మంచి ఆలోచనలతో.. నలుగురికీ సాయం చేయాలని చెప్పేవారు.
నాలుగేళ్ల కెరీర్లో తెలుగుతోపాటు తమిళ సినిమా, హిందీలో ఓ వెబ్‌సిరీస్ కూడా చేశాను. నటిగా.. నా జర్నీపై నాకు ఓ స్పష్టత ఉంది. అందుకే, సినిమాల ఎంపికలో తొందరపడను. దానికంటే ముఖ్యంగా.. ఒక నటిగా కొత్తగా ఏం నేర్చుకుంటున్నానన్న దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటా. ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకుంటున్నా.
‘మనల్ని అర్థం చేసుకునేవాళ్లే.. మన నిజమైన ఫ్రెండ్స్!’ అని నా అభిప్రాయం. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లంతా నన్ను అర్థం చేసుకుంటారు. నేను ఎంత బిజీగా ఉన్నా.. నా ఫ్రెండ్స్ కోసం టైమ్ కేటాయిస్తుంటాను. బాల్య స్నేహితుల్ని కలిస్తే.. మనం కూడా మన బాల్యంలోకి వెళ్లిపోతాం. అలా.. ఫ్రెండ్స్‌ని కలవడం నాకు ఎంతో ఇష్టం.
నటనే కాదు.. నాకు దర్శకత్వంపైనా ఆసక్తి ఉంది. ఆర్ట్ సినిమాలు, సంగీతం ప్రధానంగా సాగే చిత్రాలు నాకు నచ్చుతాయి. మెగాఫోన్ పట్టి.. అలాంటి మంచి సినిమాలు రూపొందించాలని నా ఆశ. అయితే.. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి మరో పదేళ్లయినా పడుతుంది.
‘ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి!’ అని గోల్స్ ఎప్పుడూ పెట్టుకోలేదు. ముందుగా స్టోరీ వినాలి. అందులో నా క్యారెక్టర్ నచ్చాలి. అప్పుడే ఓకే చెప్తా! అయితే ఏ పాత్ర చేసినా.. నిజ జీవితానికి దగ్గరగా ఉండాలని అనుకుంటా. ప్రభాస్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సరసన యాక్ట్ చేయాలని ఉంది. చూద్దాం.. భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయో!?
నా మొదటి సినిమా.. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ‘చిట్టి’ పాత్ర.. అందరికీ తెగ నచ్చేసింది. తెలుగు ప్రేక్షకులకు ‘చిట్టి’ ఒక ఎమోషన్‌గా మారడం.. నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అదే సమయంలో.. నాపై బాధ్యత కూడా పెంచింది. నా నటనా సామర్థ్యంపై నాకు నమ్మకం కూడా పెరిగింది.
నేను పొడవు ఎక్కువగా ఉంటానని కొందరు అంటుంటారు. అయితే, నా హైట్ ఎప్పుడూ నాకు ప్రాబ్లమ్ కాలేదు. నేను ఇలాగే ఉన్నాను. ఇలాగే.. ఉంటాను కూడా! ఏదైనా స్టోరీలో నేను ఫిట్ అయితే చేస్తాను. లేకుంటే.. వేరే చాన్స్ తీసుకుంటాను.
టాలీవుడ్‌కు వచ్చిన నేను మొదటగా నేర్చుకున్నది తెలుగు. వెయిట్ చేయడం, ఓపికగా ఉండటం అనేది కూడా! సినిమా నటులు ఇవి కచ్చితంగా పాటించాల్సిందే! ఎందుకంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకూ కాల్షీట్స్ ఇచ్చినా.. ఆరోజు మొత్తం పనిచేయలేం. ఎక్కువ సమయం ఖాళీగా, మన షాట్ కోసం సెట్స్‌లో వెయిట్ చేస్తూనే ఉండాలి.