ప్రతి మనిషి జీవితంలో సగటున పదిహేను రహస్యాలు ఉంటాయనీ, అందులో కనీసం ఐదింటిని చచ్చేదాకా ఎవరితోనూ పంచుకోడనీ కొలంబియా బిజినెస్ స్కూల్ అధ్యయనం వెల్లడించింది. దొంగతనం, అబద్ధం, అనైతిక బంధం, మోసం.. ఆ రహస్యం ఏదైనా కావచ్చు. చాలా తీవ్రమైందీ కావచ్చు, అతిసాధారణమైందీ కావచ్చు.
రహస్యం రహస్యంగానే మిగిలి పోవడానికి మూడు కారణాలు.. భయం, సిగ్గు, అపరాధ భావం. చిన్నదైనా, పెద్దదైనా రహస్యం రహస్యమే, గుండెల మీద కుంపటే. మనిషిని స్థిమితంగా ఉండనీయదు. ఏదో ఓ రూపంలో దాన్ని వ్యక్తం చేయాల్సిందే. నిజానికి చాలా రహస్యాలు ఏమంత ప్రమాదకరమైనవి కావు.
రహస్యాన్ని నేరుగా పంచుకోవడం ఇష్టం లేనప్పుడు.. ఓ కల్పిత వ్యక్తిని సృష్టించి.. ఆ పాత్రకు ఆపాదించి జరిగిన కథంతా స్నేహితులకు చెప్పవచ్చు. గుండె బరువు దించుకోవచ్చు.
ఎవరితోనైనా పంచుకోవడానికి ఇబ్బందిపడే ఒకానొక రహస్యం.. లైంగిక జీవితం. పడకగది అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు ఎవరికీ చెప్పాలనుకోరు. కొన్నిసార్లు అవి జీవిత భాగస్వామికి కూడా తెలియనంత రహస్యంగా ఉండిపోతాయి.
రహస్యం మనల్ని నీడలా వెంటాడుతూ ఉంటుంది. దెప్పిపొడుస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటన గురించి విన్న ప్రతిసారీ.. గతం గుర్తొస్తూనే ఉంటుంది.
కొన్నిసార్లు పీడకల రూపంలో వేధిస్తుంది కూడా.
రహస్యాల సంఖ్య పెరిగిపోయేకొద్దీ మనసు మీదా బరువు పెరుగుతుంది. దీంతో ఒత్తిడికి గురవుతారు. ఆందోళన వెంటాడుతుంది. నిద్రలేమి బాధపెడుతుంది. ఒంటరితనం తరుముకొస్తుంది. ఆ ప్రభావం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీయవచ్చు. మనిషిని వ్యసనపరుడిగా మార్చేయవచ్చు. అంతర్ముఖుడిని చేయవచ్చు. కొన్నిసార్లు ‘అపరిచితుడు’గా తయారు చేయవచ్చు.
మనసులోని భావాల్ని అక్షరాల రూపంలోనూ వ్యక్తం చేయవచ్చు. ఎవరితోనైనా చెప్పాలనుకున్నదంతా ఓ కాగితం మీద రాస్తే.. కొంత ఉపశమనం లభిస్తుంది. మన ఉద్వేగాన్ని ఆడియో రూపంలో రికార్డు చేయడమూ ఒక పద్ధతి. చివర్లో ఆ కాగితాన్ని చించేయండి, ఆ ఆడియో ఫైల్‌ను డిలీట్ చేయండి.
జీవితాన్ని యథాతథంగా ఆమోదించగలిగితే.. ఏదీ రహస్యంలా అనిపించదు. అన్నీ అనుభవాలే అవుతాయి. కొన్ని మంచి, కొన్ని చెడు.. అంతే తేడా!
మనల్ని అర్థం చేసుకునే మనుషులతో రహస్యాల్ని పంచుకోవచ్చు. దీనివల్ల మనసు తేలికపడుతుంది. సాంత్వన లభిస్తుంది. కానీ, అవతలి వ్యక్తి సహృదయుడైతేనే ఇదంతా సాధ్యం. ఆ వ్యక్తి బ్లాక్ మెయిలర్‌గా మారితే మరిన్ని సమస్యలు తప్పవు? కాబట్టి, రహస్యాల మూట విప్పేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
కొన్ని రహస్యాల ప్రభావం తాత్కాలికం. తొలిప్రేమ కాలేజీ దశ ముగిసేవరకే రహస్యం. నాలుగుపదుల వయసులో అదో జ్ఞాపకం. నేస్తాలతో హాయిగా పంచుకోవచ్చు. చిలిపి దొంగతనాలు, వయసు చేసిన అల్లర్లు కూడా అలాంటివే. ఫలానా విషయాన్ని గోప్యంగా ఉంచడం అవసరమా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజాయతీగా సమీక్షించుకుంటే.. నూటికి ఎనభై రహస్యాలు అర్థం లేనివే అనిపిస్తాయి.
క్షమాపణలు తెలపడం ద్వారా, కృతజ్ఞతలు చెప్పడం ద్వారా, ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా.. ఇలా ఏదో ఓ రూపంలో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉండనే ఉంటుంది.. అలా కూడా కొన్ని రహస్యాల తాలూకు అపరాధ భావం నుంచి బయటపడవచ్చు.
“అమ్మో రిస్క్ అని అనుకుంటే సక్సెస్ అందుకోవడం అసాధ్యం”