కంప్యూటర్లో ప్రింట్ నొక్కగానే పేపర్ మీద అక్షరాలు రావడం మనకు తెలుసు. కానీ, అదే ప్రింట్ బటన్ నొక్కితే వేడివేడి పిజ్జా, నచ్చిన ఆకారంలో చాక్లెట్, ఇష్టమైన కేక్ ప్లేట్లోకి వచ్చేస్తే? వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ లాగా అనిపించినా… అక్షరాలా నిజం. ఇప్పుడు త్రీడీ
ప్రింట్ టెక్నాలజీ నేరుగా తినే విధంగా ఆహారాన్ని వడ్డిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని లగ్జరీ రెస్టారెంట్ల లాంటి వాటిలో వాడుతున్న ఈ ఫుడ్ టెక్నాలజీ, త్వరలోనే మన వంటగదుల్లోకి కూడా సాధారణ నిత్యావసర వస్తువులా అడుగుపెట్టబోతున్నది. సాంకేతిక ప్రపంచం శరవేగంగా మారుతున్న ఈ కాలంలో, మన వంట గదులను డిజిటలైజ్ చేసే సరికొత్త ఆహార విప్లవం ఇది.
అన్నిటా దూసుకుపోతున్న టెక్నాలజీ ఆహారరంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నది. దాని తాలూకు ఫలితమే ఈ త్రీడీ ప్రింటెడ్ ఫుడ్. తొలి రోజుల్లో కన్నా ఇప్పుడు ఇది మరింత అధునాతనంగా తయారైంది. నేరుగా తినగలిగేలా ఆహారం తయారు చేయడంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికత సాయంతో మన శరీరానికి కావలసిన పోషకాల సమాహారంగా ఆహారం అందించడం ఇందులో మరో ముందడుగు.
అసలు ఏమిటిది?!
3డీ ప్రింటెడ్ ఫుడ్ అంటే కంప్యూటర్లో రూపొందించిన నమూనా ఆధారంగా ఆహార పదార్థాలను పొరలుగా అమర్చి ప్రత్యేక ఆకారాల్లో తయారుచేసే విధానం. చాక్లెట్, పిండి, పండ్ల ప్యూరీలు, కూరగాయల మిశ్రమాలు, ప్రోటీన్ పేస్ట్‌లు… తదితర పదార్థాలను క్యాట్రిడ్జ్‌లలో నింపి ప్రింటర్ ద్వారా ముద్రిస్తారు. మనం కంప్యూటర్ లేదా మొబైల్ యాప్‌లో ఒక డిజైన్‌ను అలాగే మనకు కావలసిన రుచిని సెలెక్ట్ చేయగానే, ఆ ప్రింటర్ పొరలు పొరలుగా ఆ ఆహార మిశ్రమాన్ని అమరుస్తూ, కంటి ముందే మనకు కావలసిన ఆకారంలో వంటకాన్ని సిద్ధం చేస్తుంది. గతంలో త్రీడీ ప్రింటర్ కేవలం ఆహారాన్ని ఒక ఆకారంలో పెట్టేది, తర్వాత దాన్ని విడిగా ఓవెన్లోనో లేదా స్టవ్ మీదో ఉడికించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు వస్తున్న సరికొత్త మాడల్స్ ప్రింట్ హెడ్‌తో పాటు బ్లూ లేజర్, ఇన్ఫ్రారెడ్ హీటింగ్‌ను కలిగి ఉంటున్నాయి. దీనివల్ల ఆహారం ప్రింట్ అవుతున్నప్పుడే, లోపలి నుండి చాలా కచ్చితంగా ఉడికిపోతుంది. ఉదాహరణకు: చికెన్ లేదా కేక్ ప్రింట్ అవుతూనే, తినడానికి సిద్ధంగా బయటకొస్తుంది.
మార్కెట్ ట్రెండ్..
ప్రస్తుతం అంతర్జాతీయంగా కొన్ని హై-ఎండ్ లగ్జరీ రెస్టారెంట్లు (ఉదాహరణకు స్పెయిన్, బ్రిటన్‌లలోని కొన్ని ఫైన్ డైనింగ్ ప్లేస్‌లు), పెద్ద పెద్ద ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్‌లు, అంతరిక్ష పరిశోధనా సంస్థలు (నాసా), ప్రత్యేకంగా చాక్లెట్ డిజైన్ చేసే కన్ఫెక్షనరీలలో ఈ టెక్నాలజీని ఇప్పటికే వాడుతున్నారు. సాధారణంగా వంటవాళ్లు చేత్తో చేయలేని క్లిష్టమైన డిజైన్లను, చాక్లెట్ శిల్పాలను క్షణాల్లో చెక్కడానికి ఇది ఉపయోగపడుతున్నది.
ముఖ్యంగా శాకాహారుల కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించి మొక్కల ఆధారిత ప్రోటీన్లతో ల్యాబ్‌లలో తయారుచేసిన సరికొత్త మాంసం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెద్ద ట్రెండ్ సృష్టిస్తున్నది. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హెల్త్ ట్రాకర్లను త్రీడీ ప్రింటర్లతో అనుసంధానించారు. మన స్మార్ట్ వాచ్ లేదా రక్త పరీక్షల డేటాను బట్టి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో ఏఐ గుర్తిస్తుంది. దానికి తగినట్లుగా విటమిన్లు, ఒమేగా-3, లేదా ఐరన్ మోతాదులను కలుపుతూ మన కోసం ఒక ప్రత్యేకమైన బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్‌ను ఆ ప్రింటర్ అప్పటికప్పుడు డిజైన్ చేస్తుంది.
దీనివల్ల శరీరానికి ఆ రోజు ఎంత ప్రోటీన్, ఎన్ని విటమిన్లు కావాలో అంత మాత్రమే ఉండేలా ఆహారాన్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. నమలడం రాని వృద్ధుల కోసం సులువుగా జీర్ణమయ్యేలా, పోషకాలు నిండిన మెత్తటి ఆహారాన్ని ఇది డిజైన్ చేయగలదు. ఇక అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములకు నెలల తరబడి నిల్వ ఉండే పౌడర్లను ఉపయోగించి, అప్పటికప్పుడు తాజా పిజ్జాలను అందిస్తాయి ఈ ప్రింటర్లు.
దీన్నిబట్టి చూస్తే, భవిష్యత్తులో మన కిచెన్లు ఒక చిన్న స్పేస్‌షిప్ ల్యాబ్‌లా మారిపోతాయి. ఉదయాన్నే స్మార్ట్ వాచ్ శరీరంలో ఐరన్ లేదా విటమిన్ తగ్గిందని చెబితే, ఆటోమేటిక్‌గా కిచెన్‌లోని ప్రింటర్ దానికి తగిన పోషకాలతో కూడిన దోశనో, బ్రెడ్నో ప్రింట్ చేసి ఉంచుతుంది. ‘అమ్మా ఆకలేస్తుంది, కాస్త ఆలుగడ్డ ఫ్రై ప్రింట్ చేయవా!’ అని పిల్లలు అడిగే రోజులూ ఎంతో దూరంలో లేనట్టే!