బత్తాయి నిమ్మజాతి (సిట్రస్) జాతి పండు. ఇది పెద్ద సైజు నిమ్మపండులా ఉంటుంది. పులుపు, తీపి కలగలసిన రుచి దీని సొంతం. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అంటారు. స్వీట్ ఆరెంజ్, మొసంబీ, చీనీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. బత్తాయిపండు మందపాటి తొక్క కలిగి ఉంటుంది. లోపల గుండ్రంగా పేర్చినట్టుగా అమరి ఉండే తొనలు ఉంటాయి. ప్రతి తొనలో గింజలు, రసం కలిగిన పూసపూలు ఉంటాయి. తొక్క ఒలిచి తొనలు తినొచ్చు. రసం పిండుకొని తాగొచ్చు. బత్తాయి రసం లేత పసుపు రంగులో ఉంటుంది. పోషక విలువలు కలిగి ఉండటంతో బత్తాయిని ఆహారంగానూ తీసుకుంటారు. జలుబు, జ్వరం ఇతర రోగాల నుంచి త్వరగా కోలుకోవడానికి బత్తాయి రసం తాగుతారు.
చర్మ సంరక్షణతోపాటు శరీరంలోని అనేక జీవక్రియలకు బత్తాయి రసం తోడ్పడుతుంది. యాంటి ఆక్సిడెంట్స్, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్న కారణంగా కళ్లను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కంటి శుక్లాలు రాకుండా అరికడుతుంది. క్రమం తప్పకుండా బత్తాయి జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మంపై వచ్చే మచ్చలను, మొటిమలను తొలగించడంలో ఇది ఉపకరిస్తుంది. ఈ రసంలో వృద్ధాప్య నిరోధక లక్షణాలూ ఉన్నాయి. బత్తాయి పూలతో టీ కాచుకొని సేవిస్తారు. పండు తొక్క, పూలు, ఆకుల నుంచి ఎసెన్షియల్ ఆయిల్ తీస్తారు. ఈ ఆయిల్ని హెర్బల్ ఔషధంగా ఉపయోగిస్తారు.
ఇది ముళ్లు కలిగిన చెట్టు. ఆకులు నిత్యహరితం. సన్నని రెక్కలతో ఆకులు కాడ మీద ఏర్పడతాయి. ఈ చెట్టు నాలుగు నుంచి పది మీటర్ల వరకు పెరుగుతుంది. నీరు ఎక్కువగా నిలువ ఉండని తేలికపాటి నేలల్లో బత్తాయి సులభంగా పెరుగుతుంది. ఈ పండు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నందున రైతులు ఎకరాల కొద్దీ చీనీ బత్తాయి తోటలను సాగు చేస్తున్నారు. బత్తాయిపూత నుంచి కాయ అయి పక్వానికి రావడానికి ఎనిమిది నెలలు పడుతుంది. బత్తాయి తోటల పెంపకం వల్ల రైతు లాభసాటి వ్యవసాయం చేయవచ్చు. మన పీవీ వనంలో నాలుగు బత్తాయి చెట్లు పెంచుతున్నాం.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు