ఒక వజ్రాన్ని ఎవరికీ అమ్మకుండా, గోల్కొండ సుల్తానుకు సమర్పించకుండా దాచి పెట్టుకున్నాడు
జరిగిన కథ: కంచర్ల గోపన్న.. మాతామహుని ఇంట హనుమకొండలో జన్మించాడు. అక్కన్న-మాదన్నలు అతని మేనమామలు. చదువుల్లో మిన్న అయినవారు. ధైర్యవంతులు, యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్నవారు. హైదరాబాదులో మీర్ జుమ్లా వద్ద ఉద్యోగం సంపాదించుకున్నారు. గోపన్న ఉపనయనం అనంతరం వైష్ణవ దీక్షతో నారాయణ దాసు అనే దాస నామం స్వీకరించాడు.
తక్కువేమి మనకు…
సా.శ. 1645 ప్రవేశించింది. రాజప్రతినిధి హోదాలో ఔరంగజేబు రెండోసారి గోల్కొండకు వచ్చాడు. సాలుసరి కప్పం స్వయంగా వసూలు చేసుకున్నాడు. సామ్రాజ్య ఆసక్తులను భంగపరిచే విదేశాంగ విధానాలు ఏమైనా గోల్కొండలో పాటిస్తున్నారేమోనని పర్యవేక్షించాడు.
అంతకు తొమ్మిదేళ్ల కిందట తొలిసారి రాజప్రతినిధిగా ఎన్నికైనది మొదలు ఔరంగజేబు దృష్టి గోల్కొండపైనే ఉన్నది. ఆ సంవత్సరంలోనే అతను అహమ్మద్ నగర్ సామ్రాజ్యాన్ని కాలరాసి, కొంతభాగం మొగలాయీ సామ్రాజ్యంలోనూ, మరికొంతభాగం బీజాపూర్ రాజ్యంలోనూ కలిపేశాడు.
ఇప్పటి మొగలాయీ పాదుషా షాజహాన్ ఒకప్పుడు రాకుమారుడిగా ఉండగా… తండ్రికి ఎదురు తిరిగాడు. జహంగీర్ అతనికి నిలువనీడ లేకుండా చేస్తే భారతదేశంలోని కొన్ని రాజ్యాలు షాజహానును అక్కున చేర్చుకున్నాయి. అటువంటి వాటిలో గోల్కొండ రాజ్యం కూడా ఉంది. అతనికి అంత చేస్తే తాను పాదుషా అయిన తర్వాత, కప్పం కట్టమని ఆ రాజ్యాలనే పీడించాడు. ఈ పీడన ఔరంగజేబు దక్కను ప్రతినిధిగా ఎంపికైన తర్వాత మరీ ఎక్కువైంది.
గోల్కొండ సుల్తానులు షియా మతాన్ని అనుసరిస్తారు. మసీదులో శుక్రవారం ప్రార్థనలకు నాందిగా పన్నెండుగురు షియా ఇమామ్‌ల పేర్లు చదివిన తర్వాత ఇరాన్ షా పేరుమీద ఖుత్బా చదవడం వారి సంప్రదాయం. షియా మతానుయాయులు తమను తాము ఇరాన్ రాజుకు సామంతులుగా భావిస్తారు.
గోల్కొండవారు మొగలాయీలకు సామంతులైన తర్వాత… శుక్రవారం ప్రార్థనలలో ఇరాన్ షా పేరిట ఖుత్బా చదవడం నేరమని అంగీకరించాల్సి వచ్చింది. సున్నీ సంప్రదాయం ప్రకారం నలుగురు ఖలీఫాల పేర్లు, మొగలాయీ పాదుషా పేరు చదవడం గోల్కొండలో మొదలైంది. మొగలు చక్రవర్తి పేరిట కొత్త నాణేలు విడుదలయ్యాయి.
ఔరంగజేబు తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా తన సామ్రాజ్యాన్ని దక్షిణంగా విస్తరించే పనిలో పడ్డాడు. మీర్ జుమ్లాగా ఉన్న మీర్జా మహమ్మద్ సయ్యద్ కర్ణాటక దండయాత్రల సన్నాహాలు చేసుకుంటున్నాడు. దండయాత్రలో సహకరించడానికి అక్కన్నను ఎన్నుకున్నాడు మీర్ జుమ్లా.
దేశానికి ప్రధానమంత్రిగా ఉండటంతోపాటు మీర్ జుమ్లా మహమ్మద్ సయ్యద్‌కు అనేక ఇతర వ్యాపారాలు కూడా ఉండేవి. వాటిలో వజ్రాల వ్యాపారం ఒకటి. అతని వజ్రాలగనిలో దొరికిన ఒక అపురూపమైన వజ్రాన్ని ఎవరికీ అమ్మకుండా, గోల్కొండ సుల్తానుకి సమర్పించకుండా దాచి పెట్టుకున్నాడు. ఆ సంగతి మాదన్నకు తెలుసు. మాదన్న మీర్ జుమ్లాకు కార్యదర్శిగా పని చేస్తున్నాడు.
అక్కన్న-మాదన్నలు ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కచ్చితత్వాన్ని పాటించేవారు. అందుకే మహమ్మద్ సయ్యద్ వారి జీతాన్ని ప్రతి ఏటా రెట్టింపు చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ అతణ్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదని మాదన్న భావన.
అందుకే తాను ఎంపిక చేసుకున్న మరికొందరితో కూడా అతి సన్నిహితంగా మసలుతూ ఉండేవాడు. వారిలో సయ్యద్ ముజఫర్, మూసాఖాన్ ఉన్నారు. అందరి కంటే ఎక్కువగా గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తమ్ముడి కొడుకైన అబుల్ హసన్‌తో మాదన్నకు ఎక్కువ స్నేహం ఉండేది.
అబుల్ హసన్ అప్పుడప్పుడే యవ్వన ప్రాయంలో అడుగు పెడుతున్నాడు. బోళా మనిషి. కపటం తెలియదు. ఎప్పుడూ దేనికోసమూ నిరాశ పొందనివాడు. అయితేనేం… రాచరికపు కుటుంబాల వారిలో ఉండాల్సిన అవలక్షణాలు అతనిలో కూడా ఉన్నాయి. అతనిలోని స్త్రీ వ్యసనం మాదన్నకే కాదు… అంతఃపురంలోని పలువురికి కూడా విసుగు తెప్పిస్తోంది.
* * *
నారాయణదాసుగా దాసనామాన్ని స్వీకరించిన గోపన్న… శిష్టాచార సంపన్నుడిగా ఎదుగుతున్నాడు. పదమూడేళ్ల నూనూగు మీసాల వయస్సునాటికి రఘునాథ భట్టరు వద్ద పంచకావ్యాలను పూర్తి చేశాడు. రామాయణంతోపాటు, సంప్రదాయ గ్రంథాలను సేవించాడు. అంతేకాకుండా ఆనాటి రాజభాషలైన ఉర్దూ, పారశీకాల్లో ప్రావీణ్యాన్ని సంపాదించాడు.
కులాన్ని బట్టి కరణీకపు లెక్కలను వేరొక గురువును ఆశ్రయించి నేర్చుకుంటున్నాడు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఛందోబద్ధ కవిత్వం చెప్పే నేర్పును సాధించాడు. ఆ లేత వయస్సులోనే రాముని పేరిట జానకీపతి శతకాన్ని రచించాడు.
గోపన్నకు సాహిత్యమొక ఎత్తు… సంగీతమొక ఎత్తు. సంగీతంలోనూ చక్కటి సాధన చేసి శృతిసుభగంగా, మృదుమధురంగా పాడేవాడు. గోపన్న నోటివెంట అన్నమాచార్యుని కీర్తనలను విన్నవారు తన్మయత్వం చెందేవారు. అందులోనూ అన్నమయ్య రచించిన రామకీర్తనలను ప్రత్యేకంగా పాడేవాడు.
ఇలా ఉండగా ఒకనాడు నేలకొండపల్లికి ఒక మహమ్మదీయ సాధువు వచ్చాడు. అతను ఉత్తరాదిలోని కబీర్ పంథ్కి చెందినవాడు. ‘నిర్గుణ్ రామ్ నిర్గుణ్ రామ్ జపహు రే భాయీ… అవగతి కీ గతి లఖీ న జాయీ….’ అంటూ కబీర్ దోహాలను పాడుకుంటూ వీధుల వెంట తిరుగుతుంటే… గోపన్న అతణ్ని చూశాడు.
అతని వద్దకు వెళ్లి,
“మీ పాట చాలా మధురంగా ఉంది. కానీ ఈ పాటలో ఏమిటి బోధిస్తున్నారు?! రాముడు నిర్గుణుడా… నేనింకా సుగుణ సంపన్నుడని అనుకుంటున్నానే?!” అని ప్రశ్నించాడు.
“అది నీవు నీ గురువును ప్రశ్నించడం మంచిది” అని సాధువు సమాధానమిచ్చాడు.
“సరే మీ గురించి చెప్పండి… ఎవరు మీరు? ఈ పాటలెక్కడివి?” మళ్లీ అడిగాడు గోపన్న.
ఆ సాధువు చాలా ఓపికగా తన గురువైన కబీర్ దాసు జీవిత చరిత్రను గురించి చెప్పాడు. ఆయన పంథాను అనుసరించిన తాము.. రామభక్తులుగా ఎలా ఉంటారో ఆ వైనాన్ని కూడా వివరించి చెప్పాడు. అతని మాటలన్నీ ఆసక్తిగా విన్నాడు గోపన్న.
“నాకోసం మరికొన్ని పాటలు వినిపించగలరా?” అని కోరి, పాడించుకుని విన్నాడు గోపన్న.
చివరిగా,
“ఇటువంటి పాటలు నేను కూడా రాసి పాడాలని అనుకుంటున్నాను. మీ కంఠంలో ఒక మాధుర్యం ఉంది. మీ పాటలో ఒక మార్దవం ఉంది. అటువంటి గుణాలన్నీ నా పాటలో ఉండాలని నా కోరిక. నాకు నేర్పగలరా?!” అడిగాడు గోపన్న.
“నీ ముఖం చూస్తుంటే… నీకెవరూ ఈ విద్యను నేర్పాల్సిన అవసరం కనిపించడం లేదు. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నీలో ఏ లోటూ తక్కువా లేవు. ప్రయత్నించు. నీకు సిద్ధిస్తుంది” అని ప్రోత్సహించాడు సాధువు.
గోపన్న అక్కడినుంచి నేరుగా వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లాడు.
సాధువు చెప్పిన మాటల్లో… ‘నీలో ఏ లోటూ తక్కువా లేవు’ అన్నమాట అతని హృదయంలో నాటుకుపోయింది. గొంతు పట్టని భావాలేవో గుండెల్లో తన్నుకులాడుతుండగా చాలా సేపటికి అతని నోటివెంట ఒక కీర్తన వెలువడింది.
తక్కువేమి మనకు..
రాముండొక్కడుండు వరకు
ప్రక్కతోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ
పల్లవి, అనుపల్లవి ఎప్పుడైతే వచ్చాయో… కీర్తన మొత్తం అప్పటికప్పుడు దానంతటదే ప్రవహించింది. మత్స్యావతారం, కూర్మావతారంతో మొదలుపెట్టి వరుసగా శ్రీమహావిష్ణువు అవతారాలన్నింటినీ ఒక్కొక్క చరణంలో వర్ణించుకుంటూ వెళ్లాడు గోపన్న.
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన నుండగ… అన్న భావం గొప్ప పలుకుబడితో కీర్తనలో ఇమిడిపోయింది. శ్రీరఘునాథ భట్టరు తనకు అనుగ్రహించిన నారాయణదాసు అన్న నామాన్ని ముద్రగా ‘నారాయణదాసుని గాచిన శ్రీమన్నారాయణు నెరనమ్మియుండగ… తక్కువేమి మనకు’ అంటూ కీర్తనను పూర్తిచేశాడు గోపన్న.
తాను రచించిన కీర్తనకు స్వయంగా వరస కట్టి కొద్దిసేపు వేణుగోపాలస్వామి ఎదుట గానం చేశాడు గోపన్న. ఆ సమయంలో ఎవరో కొందరు ఆ పాటను విన్నారు. వారిలో ఆలయ అర్చకుడు కూడా ఉన్నాడు.
“గోపన్నా! రాముణ్ని నారాయణుని అవతారంగా సంభావించావు… చరణాల నిండా అవతార మాహాత్మ్యాలను ఏకరవు పెట్టావు. బాగానే ఉంది. కానీ, రాముడొక్కడుండే వరకు తక్కువేమి మనకు… అంటూనే ఆయనను చక్రధారిగా వర్ణించావెందుకు?! కోదండధారిగా చెప్పలేదేం?!” అని అర్చకుడు అడిగాడు.
“చరణాల నిండా నారాయణుడిని చెప్పాను కనుక, చక్రధారి అన్నానులెండి” అంటూ అప్పటికప్పుడు తోచిన సమాధానం చెప్పి వెళ్లిపోయాడు గోపన్న.
వెళ్లాడు కానీ, అదే సందేహం తన మనసులోనూ తొలుస్తూ ఉంది. ఆ మరునాడు రఘునాథ భట్టరు వారి వద్దకు వెళ్లి, ఆ సందేహాన్ని ఆయన ముందుంచాడు.
“శ్రీరాముడు చక్రధారిగా కనిపించడం ఎక్కడైనా ఉందా?” అని.
“ఎందుకు లేదు నాయనా! భద్రాచలంలో ఆయన శంఖ, చక్రాలను అపసవ్యంగా పట్టుకుని తన నారాయణ స్వరూపాన్ని వెల్లడి చేశాడు” అని సమాధానమిచ్చారు రఘునాథ భట్టరు.
“భద్రాచలం ఎక్కడున్నది గురువుగారూ! దయచేసి చెప్పండి” అని కోరాడు గోపన్న.
“భద్రాచలం ఒకప్పుడు గొప్ప పుణ్యక్షేత్రం నాయనా! గోదావరీ తీరంలోనే పాల్వంచకు సమీపంలో ఉండేది. దానినే ఇప్పుడు హస్నాబాద్ పరగణా అని పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఆలయం పూర్తిగా శిథిలమై కనుమరుగైపోయింది. ఇటీవలి కాలంలో భద్రాచల యాత్ర చేసినట్లుగా యాత్రికులెవరూ చెప్పుకోవడం లేదు” బాధగా చెప్పారు రఘునాథ భట్టరు.
“అలా ఎలా జరిగింది?! అంత గొప్ప ఆలయం కనుమరుగైపోవడం ఏమిటి? దయచేసి మరికొంచెం వివరంగా చెప్పండి” కోరాడు గోపన్న.
“కాలమే అన్నింటికీ సమాధానం నాయనా! ఇది అనర్థదాయకమైన కాలం. పరాయి పాలకుల చేతుల్లో మన ధర్మం అగచాట్లు పడుతోంది. రాజ్యాన్ని జాగీర్లుగా, పరగణాలుగా విభజించారు. వేలంపాటల్లో ఏడాదికొకసారి ఆయా ప్రాంతాలను జాగీర్దార్లు, పరగణాదారులు పాడుకుంటారు. ఆ తర్వాత వాళ్లు యధేచ్ఛగా, తమకు కావలసినంత పన్నులు ప్రజలమీద వేసి… పీడించి వసూలు చేసుకుంటారు. పాలన ఇలా ఉంటే… దుష్ట ప్రతినిధులు ఉండే చోట్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయి, కనుమరుగైపోతున్నాయి. ఇదీ నేటి దుస్థితి. ఇక ఆలయాలు మాయం కావడం ఒక లెక్కా?!” అని కాసేపు ఆగారు రఘునాథ భట్టరు. గోపన్న వింటున్నాడు.
“ఇప్పటికి సరిగ్గా రెండువందల ఏళ్లక్రితం అంటే… కాకతీయుల కాలం తర్వాతి మహమ్మదీయ పాలకుల నుంచి అన్నప్ప రాహుత్ అశ్వారావు అనే ఆయన భద్రాచలం జాగీరును పొందినట్లుగా తెలుస్తోంది. ఆయన కాలంలోనూ భద్రాచలాన్ని దర్శించినవారున్నారు. అంతెందుకు నిన్న మొన్న సిద్ధేంద్రయోగి కూడా ఆ భద్రాద్రి రాముణ్ని దర్శించి, ఆయనపై గీతాలు పాడాడు. ఇవన్నీ తెలిసిన భక్తులకు తెలుసు. అంతెందుకు… ఆదిశంకరులు రచించిన శ్రీరామకర్ణామృతంలోని వామాంకస్థిత జానకీ అన్న శ్లోకం నీకు మాత్రం తెలియనిదా?!” అని ప్రశ్నించారు రఘునాథ భట్టరు.
అప్పుడు స్ఫురణకు వచ్చింది గోపన్నకు. కొద్దిసేపటి తర్వాత,
“ఒక్కసారి భద్రాచలం వెళ్లివద్దాం గురువుగారూ!” ఆశగా అన్నాడు.
“వెళ్లి ఏం చేద్దాం నాయనా! అక్కడి చెట్లూ చేమలూ చూసి రావాలి. లేదంటే గోదావరిలో స్నానం చేసి పునీతులవ్వాలి. ఆ సీతారామచంద్రస్వామి దర్శనం దొరకదు కదా!” తన మనసులోనూ చెలరేగుతున్న ఆవేదనను బయటపెట్టారు రఘునాథ భట్టరు.
“అయితే మనకు మార్గమే లేదా?! ఆ స్వామిని తెలుసుకునే వీలే లేదా?!” నిరాశ చేసుకున్నాడు గోపన్న.
“పురాణాలను తవ్వితే మన క్షేత్రాల గురించి తెలుస్తుంది. స్వయంగా వెళ్లి దర్శించలేనప్పుడు పురాణాలు వర్ణించిన క్షేత్ర చరిత్రలను మననం చేసి పుణ్యాన్ని ఆర్జించవచ్చు” చెప్పారు భట్టరు.
“అయితే భద్రాచల క్షేత్ర మాహాత్మ్యం ఏ పురాణంలో దొరుకుతుంది గురువుగారూ! నాకు ఆ కథను కూడా వివరంగా చెప్పండి” అడిగాడు గోపన్న.
“తప్పకుండా చెబుతాను నాయనా! బ్రహ్మపురాణంలోని నూటపన్నెండో అధ్యాయానికి గౌతమీ మాహాత్మ్యంలోని భద్రాచల క్షేత్ర మాహాత్మ్యమని పేరు. ఆ కథ విను…” అంటూ ఆరంభించారు భట్టరు. ఆరోజు భద్రాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని శ్రీరఘునాథ భట్టరు నుంచి పూర్తిగా తెలుసుకున్నాడు గోపన్న.
(వచ్చేవారం… తారకమంత్రము దొరికెను)
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

