నమ్రతా పురోహిత్.. సెలెబ్రిటీల ఫిట్నెస్ గురు. మలైకా అరోరా, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, బిపాసా బసు.. ఇలా ఆమె క్లయింట్స్ జాబితా పెద్దదే.తను ఈ స్థాయికి చేరుకోవడం వెనకున్న కృషి కూడా చిన్నదేం కాదు.
ఆ కథంతా నమ్రత మాటల్లోనే..
మా నాన్న క్రికెటర్. రెండు తీవ్ర ప్రమాదాలు ఆయన్ను క్రీడాజీవితానికి దూరం చేశాయి. నాన్నను నిత్యం వెన్ను నొప్పి వేధించేది. క్రమంగా కంటి చూపూ మందగించింది. దీంతో ఆటల్ని పక్కనపెట్టి ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారు. వ్యాయామ శాస్ర్తాన్ని అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే ఆయనకు స్పోర్ట్స్ థెరపీ, నొప్పి నివారణ వ్యాయామాల మీద ఆసక్తి పెరిగింది. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. నాకూ ఆటలంటే ఇష్టం. ఓ సారి మైదానంలో మోకాలికి గాయమైంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గలేదు. ఎవరో సలహా ఇస్తే.. ఏడాది పాటు పైలేట్స్ చేశాను. నాలుగు సెషన్స్‌లోనే నొప్పి మటుమాయమైంది. ఆ తర్వాత, నెల రోజులు కష్టపడి స్కాష్ ప్రాక్టీస్ చేశాను. ఆ ఏడాది జరిగిన నేషనల్ గేమ్స్‌లో సెమీ ఫైనల్స్ దాకా వెళ్లాను. నా జీవితంలో అద్భుతమైన ప్రయాణం అది. నాన్న ఫిట్ నెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్టు, నేను పైలేట్స్‌ను ఎంచుకున్నాను. మొదట్లో ఒక చిన్న గదిలో స్టూడియో ప్రారంభించాను. కొన్నాళ్లకు అదే పెద్ద వ్యాపారంగా మారింది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చదవడం వల్ల ప్రొఫెషనలిజం అబ్బింది.
మానసి స్కాట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బిపాసా బసు, మలైకా అరోరా నా దగ్గరికి పైలేట్స్ శిక్షణ కోసం వచ్చేవాళ్లు. మలైకా పదేండ్ల నుంచీ శిక్షణ తీసుకుంటున్నది. నోటి మాటతోనే మా స్టూడియో ఫేమస్ అయింది. ఎవరైనా రాగానే.. మొదట వాళ్ల శరీర స్వభావాన్ని తెలుసుకుంటాను. ఆ తర్వాత లక్ష్యాలేమిటో అడుగుతాను. రోజూ ఎంత సమయం కేటాయిస్తారో చెప్పమంటాను. హీరోయిన్ అయితే.. ఆ సమయానికి సినిమాలో వాళ్ల పాత్ర గురించీ అధ్యయనం చేస్తాను. అవన్నీ బేరీజు వేశాకే ఆ వ్యక్తి శరీరాన్ని ఎలా మలచాలో నిర్ణయించుకుంటాను. జాన్వీ కపూర్ ఈ మధ్య క్రికెట్ ఇతివృత్తంగా తీసిన సినిమాలో నటించింది. అథ్లెట్ శరీర సౌష్టవాన్ని తలపించేలా ఆమె ఆకృతిని మలిచాను. షూటింగ్స్‌లో గాయాలపాలైన వారికీ నేను శిక్షణ ఇస్తాను. గాయాల నుంచి బయట పడడానికి కూడా పైలేట్స్ దోహదపడుతాయి. కండరాల సామర్థ్యాన్ని పెంచుతాయి. పైలేట్స్ మొదట్లో సైనికుల యుద్ధ క్రీడ (వార్మప్)గా పేరు తెచ్చుకున్నాయి. కొంతకాలానికి నాట్యంగా మారాయి. నృత్య భంగిమలుగా వేదికపైకి వచ్చాయి.
లేజీ గర్ల్స్ గైడ్
పదహారేండ్ల వయసులో నేను రాసిన ‘లేజీగర్ల్స్ గైడ్’ ఓ ఫిట్నెస్ విజ్ఞాన సర్వస్వం. ఆ రోజు ఇంటి నుంచి కాలేజ్‌కి వెళ్తున్నా. మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ‘హాయ్ నమ్రతా.. రాండమ్ హౌస్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాం. మా కోసం ఒక పుస్తకం రాస్తారా?’ అని అడిగారు. ఆ పబ్లికేషన్ గురించి నాకు అంతకు ముందు వరకూ తెలియదు. ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా. సాయంత్రం ఆ విషయం అమ్మకు చెప్పాను. ‘అది చాలా పెద్ద ప్రచురణ సంస్థ. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడు’ అని చెప్పింది. రాస్తానని చెప్పకుండా, ప్రయత్నం చేస్తాననే వాళ్లతో అన్నాను. నిజానికి రాయడం నాకెంతో ఇష్టం. అప్పటికే నేను చాలా కవితలు రాశాను. ఏడాది తర్వాత వాళ్లు అడిగిన పుస్తకం పూర్తి చేసి ఇచ్చాను. పుస్తకావిష్కరణ నాటికి నాకు ఇరవై ఏండ్లు.