పురాణం నుంచి పుస్తకం దాకా నెమలి కన్నుతో మనది అందమైన అనుబంధం. ముద్దుల కృష్ణుడు మురిపెంగా తలపై ధరించిన నెమలి పింఛాన్ని… ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం ముచ్చటగా నెత్తినెక్కించుకుంటున్నది. రిట్రో… అప్పుడూ ఇప్పుడూ కాదు… ఏకంగా ద్వాపర యుగానికే వెళ్లిపోయినట్టు… అమ్మాయిల తలకట్టులో శిఖి పింఛం ట్రెండుగా మారింది. ‘పీకాక్ ఫెదర్ హెయిర్ యాక్సెసరీ’లు గోపయ్య ఇష్టాన్ని గోపికల అలంకారంలో చేర్చుతున్నాయి.
జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా వేస్తుంది అన్నది పాత సామెతే గానీ, పాత సంగతి మాత్రం కాదు. ఈ రోజుకీ అమ్మాయిల ముస్తాబులో హెయిర్‌ైస్టెల్ అన్నది ప్రత్యేకమే. ఎప్పటికప్పుడు దాన్ని కొత్తగా తీర్చిదిద్దేందుకు ఆడపిల్లలు ప్రయత్నిస్తూనే ఉంటారు. జడల అల్లికలోనే కాదు, దాని అలంకరణలోనూ కొంగొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అందుకే ఆడపిల్లలకు కేవలం జడకు పెట్టుకునే యాక్సెసరీలే పదిహేను ఇరవై రకాల దాకా ఉంటాయి. ఆ జట్టులో చేరడానికే తయారవుతున్నాయి ‘పీకాక్ ఫెదర్ హెయిర్ యాక్సెసరీలు’. టిక్‌టాక్ పిన్నుల నుంచి నుదుటి పక్కన పింఛంలా ధరించే ఫ్యాసినేటర్ల దాకా ఎన్నో వెరైటీలు వీటిలో వస్తున్నాయి.
ఫలానా తరహా హెయిర్ైస్టెల్కే ఇవి నప్పుతాయి అన్న నియమేమీ ఈ యాక్సెసరీలకు లేదు. మనం ఎలాంటి జడ వేసుకోవాలనుకుంటున్నామో దానికే చక్కగా అలంకరించుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఒకటే ఈక ఉండే చెంపపిన్నుల్లాంటి వాటితోపాటు పోనీకి పెట్టుకునే క్లిప్పులు, క్లచ్‌లు, హెయిర్బ్యాండ్లు.. ఇలా అన్నింటిలో ఇవి అందంగా ముస్తాబవుతున్నాయి. విరబోసినట్టుండే మోడల్లో ఎక్కువ నెమలీకలు వేలాడే రకానివీ ఎంచుకోవచ్చు. అదే ముడి వేసినట్టు ఉంటే మూడు నాలుగు ఈకలు ఉండే హెయిర్ పిన్ పెట్టుకోవచ్చు. జడవేసి అలంకరించుకోవాలంటే… ఒక్కొక్కటే ఉండేవి అక్కడక్కడా గుచ్చొచ్చు. మొత్తానికి చీర మీదైనా అల్ట్రా ఫ్యాషన్ డ్రెస్ మీదైనా ఈ సింగారం బంగారంలా సరిపోతుంది. అందుకే ఇప్పుడు శిఖి పింఛం… అమ్మాయిలను మురిపిస్తున్నది!