తెలంగాణ నేలంతా వినిపించిన ‘పూసిన పున్నమి వెన్నలమేన’కు బాణి కట్టాడు. ప్రేమికుల మనసును దోచేసిన ‘దూరం పెరిగినా’ పాటకు ప్రాణం పోశాడు. ఈ తరం బుజ్జాయిలను హాయిగా బజ్జో పెడుతున్న ‘స్కంద జోలాలి’కి స్వరాలు కూర్చాడు. చిన్నప్పటి నుంచి పాటతో సోపతి చేసిన కొడకండ్ల కార్తిక్ సంగీతమే తన మజిలీ అనుకున్నాడు. సింగర్‌గా, రైటర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. సంగీత దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఈ పల్లెబిడ్డ కంపోజ్ చేసిన పాటలు నేడు సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. చదివిన చదువు కన్నా, చేసే ఉద్యోగం కన్నా.. మిన్నగా సంగీతాన్ని ప్రేమించిన కార్తిక్ పాటలకు జెన్ జీ ఫిదా అవుతున్నది. ఈ తెలంగాణ బిడ్డ ‘బతుకమ్మ’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
ములుగు జిల్లాలోని కేశవాపూర్ గ్రామం మాది. నా చిన్నప్పుడు మా నాన్న ఫెర్టిలైజర్ దుకాణం నిర్వహించేవాడు. కరువు కారణంగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. అది చూసిన నాకు, అక్కకు మాకు చదువు తప్ప వేరే ఆధారం లేదని అప్పుడే అర్థమైంది. ఇంటర్మీడియట్ నుంచి ఫ్రీ సీట్లోనే చదువుకున్నాం. కడుపు నిండినప్పుడు వచ్చిన పాటకు, ఆకలి మీదున్న పాటకు చాలా తేడా ఉంటుంది. మా ప్రాంతంలో విప్లవ పాటలకు ఆదరణ ఎక్కువ. కష్టమొచ్చినా పాటే, కన్నీరొచ్చినా పాటే. మాకు చదువు చెప్పే టీచర్లలో కూడా కొంతమంది పాటలు పాడుతుండేవాళ్లు. నేను నాలుగో తరగతి చదువుకునేటప్పుడు స్వప్న మేడం నా గొంతు మంచిగుందని పాటలు నేర్పించింది. అట్లా మొదలైన నా పాటల ప్రస్థానం మ్యూజిక్ డైరెక్టర్ దాకా వచ్చింది. బడిలో ఉన్నప్పుడే వివిధ వేదికల మీద పాటలు పాడేవాణ్ని. ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్, కీరవాణి పాటలు వింటూ పెరిగాను. ఇంట్లో టేప్ రికార్డర్ ఎప్పుడూ మోగుతూనే ఉండేది.
అప్పట్లోనే 20లక్షల వ్యూస్
పైచదువుల కోసం పట్నం వచ్చాక మ్యూజిక్కు మరింత దగ్గరయ్యాను. బీటెక్ చేస్తూనే మ్యూజిక్ నేర్చుకున్నాను. కాలేజీ అయిపోగానే గంటపాటు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర లైట్, క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకుంటూ, మిగతా సమయంలో ట్యూషన్లు చెప్పుకొంటూ బీటెక్ పూర్తి చేశాను. ఆ సమయంలోనే మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ పరిచయమయ్యాడు. ఆయన స్టూడియోకు వెళ్లే వివిధ వాద్యాల గురించి తెలుసుకున్నాను. రాత్రి సమయాల్లో ఎక్కువ సమయం అక్కడే గడిపేవాణ్ని. బీటెక్‌లో ఉన్నప్పుడే కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి రూ.లక్షతో ‘తొలి అలజడి’ ఆల్బమ్ విడుదల చేశాను. ఆ తర్వాత 2013లో ‘అణువణువంతా ప్రేమించానే’ సాంగ్ యూట్యూబ్‌లో విడుదల చేశాను. అప్పట్లోనే దానికి సుమారు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. అది చూసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘అనుకోకుండా’ షార్ట్ఫీల్మ్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. శ్రవణ్ అన్న సహాయంతోనే అందులో పనిచేశాను. అది మంచి సక్సెస్ అయింది.
ఉద్యోగం వదులుకొని
ఆ షార్ట్‌ఫిల్మ్ పాటలు విని ‘బంధూక్’ సినిమాకు అవకాశం వచ్చింది. అందులో గోరేటి వెంకన్న గారు రాసిన 16 పేజీల ‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ నేల’ బ్రీత్లెస్ సాంగ్‌ను నాలుగు నిమిషాల నిడివికి తీసుకొచ్చాను. కానీ ఆ పాట రికార్డింగ్ చేయగానే బయటకొచ్చింది. దాంతో ఆ సినిమాలో వాడలేదు. అయినా కూడా ఆ పాట మంచి ఆదరణను పొందింది. ఒకవైపు మ్యూజిక్‌లో రాణిస్తూనే ఎంటెక్ కూడా పూర్తి చేశాను. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మైసూర్‌కు వెళ్లి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తున్నానన్న మాటే కానీ, మనసు మనసులో ఉండకపోయేది! మ్యూజిక్ మీద ఇష్టంతో మూడు నెలల్లోనే ఉద్యోగం మానేసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాను. ఆ తరువాత ‘బొమ్మల రామారం’ సినిమాలో అవకాశం వచ్చింది. సినిమా పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్‌లు, బతుకమ్మ పాటల కోసం వర్క్ చేశాను. ఆ తర్వాత అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో పలు ప్రోగ్రాంలు కూడా నిర్వహించాను. నాకంటూ ఓ సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో విదేశాలకు వెళ్లినప్పుడు.. స్టూడియోకు అవసరమైన సామగ్రి తెచ్చుకునేవాణ్ని. అలా కేకే స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను.
ఆ టైంలో భయపడ్డాను
మొదట్లో పాటలు హిట్ అయినా సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో గుర్తింపు అంతంత మాత్రమే ఉండేది. ప్రారంభంలో రెండేళ్లపాటు అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డా. కొన్ని అవకాశాలు వచ్చినా అందులో నా పేరు పెట్టకపోవడం, చేతికొచ్చిన అవకాశాలు తెల్లారెసరికి వేరొకరికి పోవడంతో చాలా బాధపడేవాణ్ని. గట్టిగా నిలిదీస్తే అవకాశాలు అసలే రావేమోనని భయపడేవాణ్ని. అందుకే నన్ను నేను నమ్ముకొని పనిచేయాలని నిర్ణయించుకొని లాక్ డౌన్ సమయంలో ‘మెరిసే మెరిసే’ సినిమాకు పనిచేశాను. ఆ చిత్రం నేరుగా ప్రైమ్‌లో విడుదలైంది. అందులోని ‘కనులతో రచించు’ పాట మంచి ఆదరణ పొందింది. ఈ పాటను విజయప్రకాశ్ అనే ఆల్ ఇండియా సింగర్ పాడాడు. నా కంపోజింగ్ గురించి ఆయన సోషల్‌మీడియలో చేసిన పోస్ట్ నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఆ తర్వాత ఆరు నెలలు హిట్ లేకుండా ఉన్న సింగర్ సిధ్ శ్రీరామ్ ‘జెట్టి’ సినిమాలో నేను కంపోజ్ చేసిన ‘దూరం కరిగినా’ పాటతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ పాట 30 మిలియన్ల వ్యూస్‌కు చేరడం విశేషం.
నవతరానికి నచ్చుతున్నాయి
ఇప్పటివరకు నేను 600కు పైగా పాటలు చేశాను. అందులో 100 పాటలు నేనే పాడాను. ఓ 50 పాటల వరకు రాశాను కూడా. ఎన్ని అవకాశాలు వచ్చినా ‘పూసిన పున్నమి’ పాటతోనే నేను వెలుగులోకి వచ్చానన్నది అక్షర సత్యం. ఆ పాట ఫేమస్ అయినంతగా నేను ఫేమస్ కాలేదు. అప్పట్లో ఆదరణకు నోచుకొని పాటల్ని నేడు జెన్ జీ తరం ఆదరిస్తుండటం ఎంతో సంతోషం కలుగుతున్నది. ‘సముద్రం లోతు చూడటానికి రెండు కాళ్లు వేయొద్దు’ అంటారు వారెన్ బఫెట్. అందుకే ఒక్కో అడుగు వేసుకుంటూ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టాను. ప్రస్తుతం ‘డియర్ అస్ట్రోనాట్’, ‘వదలా’, ‘డొక్కా సీతమ్మ’, ‘ఆటాడిన పాట’ తదితర తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల ప్రాజెక్టులూ చేస్తున్నాను.
నా లక్ష్యం అదే..
కష్టాలతో కలిసి పెరగడం వల్ల జీవితం అంటే ఏంటో నాకు స్పష్టత ఉంది. అనుకున్న స్థాయిలో నిలిచినందుకు నా వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. కేకే చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మా ఊరు, చుట్టుపక్కల గ్రామాల్లోని పేద విద్యార్థులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాను. కొంతమంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు కోచింగ్‌లు ఇప్పించడం, మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు తోచినంత స్కాలర్షిప్ అందించడం, పాఠశాలలో చిన్న చిన్న సమస్యలు తీర్చడం, వృద్ధులకు మందులు, నిత్యవసరాలకు సరిపడా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఎదుగుతున్న కళాకారులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నా. ఎప్పటికైనా ‘కార్తిక్ మ్యూజిక్’లో చేయాలని హీరోలందరూ అనుకునేలా కష్టపడాలన్నదే నా ధ్యేయం.
మోపిదేవిలో నా పాట

పెద్ద ప్రాజెక్టులు బయటివాళ్లకు ఇవ్వడం, చిన్న ప్రాజెక్టులు లోకల్ వాళ్లకు ఇవ్వడం ఇండస్ట్రీలో పరిపాటి. దీని మూలంగా లోకల్ టాలెంట్ వెనుకబడిపోతుందన్న అపవాదు ఉంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఇతర దేశాల్లో కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది. మన దగ్గరా అలాంటి సంస్కృతి రావాలని కోరుకుంటున్నాను. ఇటీవల నేను కంపోజ్ చేసిన ‘స్కంద జోలాలి’ పాట చాలా ఫేమస్ అయింది. ఆ గీతాన్ని మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పవలింపు సేవలో పెడుతున్నారని తెలిసింది. ఈ జన్మకు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి? నేను కంపోజ్ చేసిన ‘బొమ్మల రామారం’ టైటిల్ సాంగ్ లెజండరీ సింగర్ పి.సుశీల గారు పాడటం మరో అదృష్టం.
నేను కంపోజ్ చేసిన పాటలకు పలు అవార్డులు కూడా కైవసం చేసుకున్నాను. ‘ఎన్నెల్లో సింగారి’ పాటకు పికో అవార్డు, మూడు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘అందెల రవళి’కి వివిధ కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి. ఇవి కాకుండా కొన్ని పాటలు రీజినల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు నామినేట్ అయ్యాయి. మొత్తంగా 16 వరకు అవార్డులు దక్కాయి. ప్రారంభంలో నేనే పాట రాసుకొని, నేనే పాడుకునేవాణ్ని. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలని రచనకు దూరంగా ఉన్నా. ఎస్పీ బాలుగారితో పనిచేసిన అనుభవం గురించి ఏమని చెప్పగలను. ఈ తరం సింగర్లతో పనిచేయడంలోనూ అంతే ఆనందం ఉంది.