శుభాల మాసం శ్రావణం. వేడుకల్ని మోసుకొచ్చే ఈ నెలలో వెలిగిపోవాలని ఆశించని వారుండరు. అందుకే ధగధగలాడే నగలెన్నో ఈ వారాల్లో వరుస కడతాయి. వాటి సంగతేంటో ఓసారి చూద్దామా!

శ్రావణమాసం వచ్చిందంటే పెండ్లి సందడి మొదలైనట్టే. చీరలు, నగలు, మెహెందీ డిజైన్లతో పాటు ఈసారి వధువుల మేకప్‌లో కొత్తగా చోటు దకించుకున్న యాక్సెసరీ ‘బ్రైడ్ లెటర్డ్ ఫేస్‌లెట్స్’. కండ్లజోడు తరహాలో కేవలం కింది వైపు మాత్రమే ఫ్రేమ్ వచ్చి అద్దం లేకుండా ఉండే ఫేస్లెట్లు మనకు తెలిసినవే. వీటిని వధువుల అలంకరణలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో అడుగు వేసి పెండ్లికూతురు అని అర్థం వచ్చేలా ఇంగ్లిష్, హిందీల్లో బ్రైడ్ అని రాసి ఉన్న ఫేస్లెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. సంగీత్, మెహెందీ, హల్దీ, రిసెప్షన్, ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్లలో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నాజూకైన వైర్ ఫ్రేమ్‌కు ముత్యాలు, స్టోన్స్ అమర్చి ముఖాకృతికి అనుగుణంగా డిజైన్ చేయడం వల్ల సంప్రదాయ ఆభరణాలకు ఆధునిక టచ్ లభిస్తున్నది.

అలంకారం అంటే అమ్మాయిలకే ఉండాలా… అబ్బాయిలు మాత్రం ముస్తాబై ముచ్చటగొలిపేలా కనిపించొద్దా… అనుకుంటున్నారేమో డిజైనర్లు, చూడగానే కళ్లను కట్టిపడేసేలా అందమైన నగల్లాంటి బ్రూచ్లను తయారు చేస్తున్నారు. పచ్చలు, కెంపులు, వజ్రాలతో పాటు కుందన్లు, పోల్కీలు పొదిగి మగువల నగలకు దీటుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. గణపతి, జగన్నాథుడి లాంటి దేవతా మూర్తులతో పాటు ఏనుగులు, నెమళ్ల రూపాలు ఉంటున్నాయిందులో. వీటికి జతగా ధరించేలా చిన్న చిన్న రాళ్ల బిళ్లల్లా కనిపించేవీ తయారవుతున్నాయి. కుర్తా, షేర్వాణీలతో పాటు చొక్కాల మీదకీ ధరించేలా వస్తున్న ఇవి వేడుకలకు కొత్త కళ తెస్తున్నాయి.

పెండ్లిపేరంటాల ముస్తాబులో భాగంగా తలపైనా నగలు ధరిస్తాం మనం. పాపిట బిళ్లతో పాటు రెండు వైపులా సూర్య వంక, చంద్ర వంకలను అలంకరించడం కొన్నేళ్ల కిందటి వరకూ సంప్రదాయ ముస్తాబులో భాగమైంది. ఆ తర్వాత అవి కనుమరుగై పోయినా… ఇప్పుడు మళ్లీ అవే బిళ్లలు సరికొత్త డిజైన్లలో తయారవుతూ నగల పెట్టెలో చేరుతున్నాయి. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల రాళ్లతో చందమామ, సూర్యులను ప్రతిబింబించేలా ఎన్నో వెరైటీల్లో రూపొందుతున్నాయివి. బంగారం, వెండి వాటితో పాటు ఫ్యాన్సీ తరహాలోనూ దొరుకుతున్నాయి. జడ వేసుకున్నా, ముడి పెట్టుకున్నా దాన్ని అందంగా అలంకరించాలంటే మాత్రం ఇవి ఉండాల్సిందే అన్నంతగా ట్రెండ్ అవుతున్నాయిప్పుడు.