శా॥ ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!
పోతన రచించిన మహాభాగవతంలోని అష్టమ స్కంధంలోని ఒక చక్కని పద్యం ఇది. అర్థం సుస్పష్టమే. వచ్చిన వడువు విష్ణుమూర్తి అని తెలిసిన తరువాత తను అడిగిన కోరికలను తీర్చడానికి తనతో సర్వంసహా భూమండలం ధారపోయవలసిన పరిస్థితి. ఆ స్థితిలోనూ ఏ మాత్రం బాధపడకుండా విష్ణుమూర్తి అంతటివాడు నాదగ్గర యాచించడం తనకు సంతోషకరమైన విషయం అంటూ తన మనోభావనను వెలిబుచ్చిన అంశం.
తనను యాచించిన ఆ చేయి లక్ష్మీదేవిని ఎక్కడెక్కడ స్పృశించిందో చెబుతున్నాడు బలి. ఐతే ఇక్కడే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. రాక్షసులను దునుమాడిన చేయి, దేవతలను కాపాడిన చేయి లాంటి విశేషాలు ఉపయోగించకుండా సంసారాంతర సరస చేష్టలను ఉపయోగించి విశేషించడం ఎందుకు? భార్యతో సరససల్లాపాలాడే ఆ చేయి ఈ పరాక్రమవంతుడిని ఏం చేస్తుంది అన్న నిందా స్తుతి దాగి ఉందా? లాంటి సందేహాలు తలెత్తకమానవు. పోతన గారితోనే నిందా స్తుతి ప్రారంభమైందని అంటారు డా॥ వజ్జల గారు.
సరే ఇక పద్యం గురించి ఆలోచిద్దాం. ఇక్కడో పేచీ ఉంది. ఆదిన్ శ్రీ సతి అంటూ ఆదిన్ అనే పదం ఉపయోగించడం కాస్త చిత్రంగా లేదూ, పదప్రయోగంలో ఔచిత్యం కనిపిస్తుందా? మరో పేచీ నూత్న మర్యాదలు అనే పద ప్రయోగం, ప్రతీరోజూ భార్యతో ఇలాంటి సరసాలు ఉంటాయి కదా, మళ్లీ ఈ నూత్న మర్యాదలేమిటి? ఇలా ఆలోచిస్తే ఆదిన్ అనే పదానికి నూత్న మర్యాదలకు కాస్త పొత్తు కలిసేటట్టుంది. ఆదిన్ అంటే మొదట్లో… పళ్లైన కొత్తలో. అంటే ప్రథమ సమాగమంలో- శోభనం రోజున. మొదటి రోజునే కదా నూత్న మర్యాదల మాధురి విశేషంగా అలరించేది. అంటే ఇదంతా దంపతుల మొదటిరాత్రి సరసం కాబోలు, అదే బలి భావనలో బయటికి వచ్చిందేమో.
మరో రకంగా ఆలోచిస్తే అనుష్ఠానంలో కరన్యాస, అంగన్యాసాలు ఉంటాయి కదా. దాన్నేమైనా ఈ పద్యంలో పొదిగాడేమో పోతన. ఆదిన్ అంటే మొదటిదైన ప్రణవం, ఓంకారం. కొప్పు అంటే శిరస్సు. అంగన్యాసంలో శిరసే స్వాహా అంటాం కదా, అలా లక్ష్మీదేవిని పూజిస్తున్నాడా?! ఇదేదీ కాకపోతే విష్ణుమూర్తి లక్ష్మమ్మను ఆరు చోట్ల స్పృశించాడు. ఈ ఆరూ షట్చక్రాలు కావచ్చా?! అంతిమంగా సహస్రారంలో మోక్షం పొందడమే బలి లక్ష్యమా!! దీనికింద రాజ్యం, గీజ్యం లాంటి సంపదలు దేనికి పనికివస్తాయి? ఇలాంటి సందేహాలు మినహాయిస్తే తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన పద్యంగా దీనిని పరిగణిస్తారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ