భక్త రామదాసు
శ్రీ భద్రాచల రామదాసు గురించి తెలియని తెలుగువాడు ఉండడు. ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న. తానీషా కాలంలో తహసీల్దారుగా పనిచేస్తూ భద్రాచలంలో రామాలయం కట్టించడానికి ప్రభుత్వ నిధులను దారి మళ్లించి, పన్నెండేళ్లు ఖైదు శిక్ష అనుభవించాడు.
జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్ గనువారిపదంబుఁ గూర్పవే
తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
శ్రీ భద్రాచల రామదాసు గురించి తెలియని తెలుగువాడు ఉండడు. ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న. తానీషా కాలంలో తహసీల్దారుగా పనిచేస్తూ భద్రాచలంలో రామాలయం కట్టించడానికి ప్రభుత్వ నిధులను దారి మళ్లించి, పన్నెండేళ్లు ఖైదు శిక్ష అనుభవించాడు. చివరికి రాముడే దిగివచ్చి తానీషాకు డబ్బు చెల్లించి, తన భక్తుడిని విడిపించుకున్నాడు… అని మనమందరం రామదాసు గురించి కథలు కథలుగా చెప్పుకొంటూ ఉంటాం. కానీ, ఆ కథలన్నీ నిజాలు కావని, అర్థసత్యాలేనని పరిశీలకులు చెబుతుంటారు.
చెప్పాలంటే, భక్త రామదాసు జీవిత చరిత్ర నేటికీ అపరిష్కృతంగానే ఉంది. భక్త రామదాసు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించాడని, వారి వంశీకులు వినుకొండ నుంచి వలస వచ్చారనే విషయాలు తప్ప… ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలేమీ లభించలేదు. చరిత్రకారులు చాలా తర్జనబర్జనలు పడ్డారు. కొంతమంది రామదాసు అనే వ్యక్తి అసలు లేనేలేడన్నారు. మరికొందరు కంచర్ల గోపన్న వేరు, జైలుశిక్ష అనుభవించిన తహసీల్దారు వేరని అభిప్రాయపడ్డారు. చరిత్రతో సంబంధం లేకుండా కావ్యకర్తలు రామదాసు జీవితాన్ని కథలు కట్టి పాడారు. రామదాసును అజరామరుడిని చేశారు. చరిత్రకారుల అభిప్రాయ భేదాలకు, కావ్యకర్తల కాల్పనికతకు మధ్యలో రామదాసు అసలు చరిత్ర మరుగున పడిపోయింది. రామదాసు జీవిత చరిత్రను పరిష్కరించాలంటే ఆయనకు సమకాలీనంగా ఉన్న గోల్కొండ చరిత్రను సాకల్యంగా పరిశీలించాలి.

Lord Rama
కేవలం పద్నాలుగేళ్ల కాలం గోల్కొండను పాలించి, అందులో సగానికి పైగా సమయం అంతా యుద్ధాలలో గడిపిన అబుల్ హసన్ తానీషాకు… భక్త రామదాసును బంధించి, పన్నెండేళ్ల అనంతరం విడిచిపెట్టే తీరుబాటు లేనేలేదు. తానీషా అధికారంలోకి రావడానికి కారణం అక్కన్న మాదన్నలు. ఆ కృతజ్ఞతతోనే వారిని ఉన్నత పదవుల్లో నిలబెట్టాడు. అటువంటివారి మేనల్లుడిని అంతకాలంపాటు బంధించి ఉండకపోవచ్చు కూడా. నిజానికి తానీషా రాకకు చాలాకాలం ముందే రామదాసు తహసీల్దారుగా నియుక్తుడై గుడి కట్టడం ప్రారంభించి ఉండాలి. కనుక రామదాసును విడిపించినది తానీషా అన్నమాట నిజమే కానీ, బంధించింది మాత్రం అంతకుముందు గోల్కొండను పాలించిన అబ్దుల్లా కుతుబ్ షా అన్నది నిర్వివాదాంశం. గుడి నిర్మాణం కోసం ఇక భక్త రామదాసు ప్రభుత్వ నిధులను దారి మళ్లించి ఉండకపోవచ్చు. ఇదే అభిప్రాయాన్ని కొద్దిపాటి తేడాలతో ఆయన కథను రాసినవారెందరో వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాడు, భక్తుడైనవాడు… అవినీతికి పాల్పడి దేవుడి చాటున దాక్కోవచ్చని ఎన్నటికీ ఊహించడు. అటువంటిది రామదాసు వంటి మహాభక్తుడి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఒకవేళ ఆయన అటువంటి పని చేసివున్నా… తన భక్తుడి తప్పును సరిచేసి, అతణ్ని రక్షించడానికి రాముడు దిగివచ్చాడంటే మనం అంగీకరించలేం. అటువంటిదే జరిగి ఉంటే తన రాముడితో ఎన్నెన్నో ఊసులు కీర్తనల ద్వారా చెప్పిన భక్త రామదాసు.. తన తప్పును కూడా నిజాయితీతో ఒప్పుకొని, పశ్చాత్తాప పడి ఉండేవాడు. అలా జరగలేదు. కనుక భక్త రామదాసు అవినీతిపరుడు కాదు, రాజకీయ కుట్రలో ఇరుక్కుని జైలు పాలయ్యాడని ఊహించవచ్చు.
విచిత్రం ఏమిటంటే… భక్త రామదాసు రామాలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం కూడా మనకు తెలియదు. సా.శ. 1652లో రామదాసు భద్రాచల ఆలయాన్ని పునఃప్రారంభించాడని పేర్కొంటూ తూము నరసింహదాసు… భద్రాద్రిలో రామస్తంభాన్ని వేయించారు. అది భక్త రామదాసు తర్వాత 180 సంవత్సరాలకు వేసిన శాసనం. ఆ సంవత్సరం విషయంలో నరసింహదాసు పొరపాటు పడి ఉండవచ్చు. నిజానికి రామదాసు ఎప్పుడు పుట్టాడన్నది కూడా సరైన లెక్క మనవద్ద లేదు. సా.శ. 1620 నుంచి 1630 మధ్యలో జన్మించి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అయితే సా.శ. 1633లోని మాఘ శుద్ధ చవితి గురువారంనాడు పూర్వాభాద్ర నక్షత్రంలో భక్తరామదాసు జన్మించాడని నిర్ణయించి, ఏటేటా భద్రాచలంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ తేదీని స్వీకరిస్తూ… గోల్కొండ చరిత్రను మేళవిస్తూ… శ్రీరామదాసు చరిత్రను పరిష్కరించే ప్రయత్నం చేసే ధారావాహిక ఇది. రామదాసు కీర్తనల్లోని స్వారస్యాన్ని, ఆయన సాగించిన భక్తియోగ సాధనలను రమణీయంగా వర్ణిస్తూ సాగే ఈ ధారావాహిక… పాఠక జన హృదయ మనోరంజకంగా వచ్చేవారమే మీ బతుకమ్మలో ప్రారంభం కానుంది. తప్పక చదవండి.
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టా!
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

