అపూర్వ రాగం
జరిగిన కథ.. ఈసాణుడిని అంతం చేయడానికి వెళ్లిన అవణాయరు, జయసేనుడు.. వాని బలం ముందు నిలువ లేకపోయినారు. అంతా అనుకూలంగా ఉందనుకున్న కళింగాదిత్యునికి వ్యతిరేకంగా ఒక కంఠం వినిపించింది. జంగిటి చేరుకున్న మేఘచంద్రునికి తన కూతురు రోహాదేవి కనిపించకపోవడం ఆందోళన కలిగించింది.
(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ. 59వ భాగం)
మరొక్క క్షణమైతే జయసేనుని గొంతు ఈసాణుడి చేతుల మధ్య పూర్తిగా నలిగిపోతుందనగా… “జయము మహారాజా!” అన్నాడు.. వందన సూచకంగా విదగ్ధుడు, హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వచ్చి. మరుక్షణం అక్కడి పరిస్థితి చూసి, ఒరలో నుంచి కత్తి తీసి, జయసేనుని తలను ఖండించబోయినాడు. సరిగ్గా అదే సమయానికి జయసేనుణ్ని దూరంగా నెట్టేస్తూ లేచి కూర్చున్నాడు ఈసాణుడు. విదగ్ధుని ఖడ్గం నిర్దాక్షిణ్యంగా ఈసాణుని తలను మొండెం నుంచి వేరు చేసింది. ఈ హఠాన్ పరిణామానికి నోట మాట రాక కుప్పకూలిపోయినాడు విదగ్ధుడు. ఆ దృశ్యం చూసిన జయసేనుడు… “హుఁ! ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడటం అంటే ఇదే! ఇటువంటి దుర్మార్గునికి సాయం చేసిన నీవు కూడా బతకడానికి అనర్హుడవే!” అంటూ, వాని చేతిలోని ఖడ్గం తీసుకుని వాని గుండెకే ఆనించినాడు. “నన్ను మన్నించండి మహాప్రభో!” అంటూ కాళ్ల మీద పడ్డాడు విదగ్ధుడు. “అందితే జుట్టు; అందకపోతే కాళ్లు పట్టుకునే నీలాంటి అవకాశవాదులను క్షమించడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్లేరా! పాపం! నరకంలో నీ మహారాజు ఒంటరి వాడు కాకుండా, వాని వెంట తిరుగు! పో!” అంటూ కత్తిని గుండెలోనికి బలం కొద్దీ దించినాడు జయసేనుడు.
తన మిత్రుడు ప్రమాదంలో పడతాడేమోనని ఆందోళనతో అక్కడికి చేరుకున్న వామదేవుడు, వెన్నంటి వచ్చిన సౌగంధిక ఆ దృశ్యం చూసినారు. పక్కనే అచేతనంగా పడి ఉన్న అవణాయరుపైకి వారి దృష్టి మళ్లింది. తలలేని మొండెంతో కొట్టుకుంటున్న ఈసాణుడినీ వాళ్లు గమనించినారు. “అయ్యో! అవణాయరు ప్రభూ!” అంటూ గబుక్కున అక్కడికి చేరుకున్న సౌగంధిక.. “అన్నా! అవణాయరు వారు కొన ఊపిరితో ఉన్నారు. మనం వీరిని కాపాడుకోవాలి!” అన్నది ఆందోళనగా జయసేనునితో. “ఆ సెలయేటిలో నీళ్లు తీసుకొని రా తల్లీ! ఆయనకు ఏ ప్రమాదమూ లేదు! దెబ్బ కొంచెం బలంగా తగిలింది అంతే!” అన్నాడు జయసేనుడు. ఆ పనిలో నిమగ్నమైంది సౌగంధిక. “హుఁ! నేను వీని తల తీసెయ్యాలనుకున్నాను. ఆ పని నీవే చేసినావా మిత్రమా!” అన్నాడు వామదేవుడు, జయసేనుని భుజాల మీద చేతులు వేస్తూ. “నాకు కూడా ఆ అదృష్టం కలగలేదు మిత్రమా!” అన్నాడు జయసేనుడు.
“మరి” ఆశ్చర్యంగా చూసినాడు వామదేవుడు.
“వాడు పెంచి పోషించిన పాపమే వాణ్ని బలి తీసుకున్నది…” అంటూ ఈసాణుడు చనిపోయిన తీరును వివరించినాడు జయసేనుడు. సౌగంధిక పరిచర్యలతో కనులు తెరిచినాడు అవణాయరు. “అమ్మా! నీవు చాలా గొప్పదానివి!” కన్నులు తెరవగానే.. సౌగంధికను చూసి చేతులు జోడించినాడు అవణాయరు. “అయ్యయ్యో! మీరు పెద్దవారు. దండం పెట్టకూడదు! మీ మంచి మనసును అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాం!” ప్రతి నమస్కారం చేసింది సౌగంధిక. “అవణాయరు గారు! మీరు ఇచ్చిన సహకారం వల్లనే మేము ఇంతదూరం రాగలిగినాము. ఆత్మరక్షణ కోసమో… రహస్యాన్ని కాపాడుకోవడానికో మీ పట్ల కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించినాము. దయచేసి మా తప్పులు మీ పెద్ద మనసుతో క్షమించండి!” అంటూనే, వామదేవుడు అతని తలకు కట్టు కట్టినాడు. “క్షమించమని మీరు అడగటం అన్యాయం! మేము చేయలేని పనిని ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి మీరు నిర్వహించినందుకు మిమ్ములను అభినందించాలి! కృతజ్ఞతలు చెల్లించాలి!” అన్నాడు అవణాయరు, ప్రేమాభిమానాలతో.
“పదండి! పదండి! అంతఃపురంలో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నదో! నాయన గారిని కనులారా చూసుకోవాలి! మనసారా మాట్లాడాలి!” అంటూ మిగతా ముగ్గురినీ తొందర పెట్టినాడు జయసేనుడు.
కోడెదూడలేని కొట్టము రీతిగా
నీటి చుక్కలేని ఏటి వోలె
పూరి కాసు లేని భోషాణమును బోలె
కాంతి లేనిదాయె నింతి మోము!
(ఒక్క కోడెదూడ కూడా లేని పశువుల కొట్టంలా; చుక్క నీరైనా లేని సెలయేరులా; చిల్లి గవ్వ లేని కోశాగారంలాగా ఆమె మొహం వెలవెల బోయింది)
ప్రణాలుడు తన కథను పూర్తిగా వివరించిన తర్వాత రోహాదేవిలో ఒక రకమైన వైరాగ్యం ఏర్పడింది. తన మీద తనకే విరక్తి కలిగింది. అందుకే ఆ మిత్రులు ఇద్దరూ ఉలిక్కిపడే మాట అన్నది. “నేను నున్నగా తల గుండు గీయించుకుంటాను!” అని. ముందుగా తేరుకున్న నిర్మలానందుడు.. “ఎందుకు?” అని అడిగినాడు. “నేను ఈ కాషాయ వస్త్రాలు ధరించినందువల్ల సగమే బుద్ధుని శిష్యురాలిగా మారినాను; శిరోజాలు కూడా తీసేయడం వల్ల పూర్తిగా శ్రమణకురాలిని అవుతాను!” అన్నది దృఢంగా. ఆమెకు తన జీవితమంతా గుర్తుకొస్తున్నది. కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదంటే.. ఆమెకు తన మీద తనకు ఎంత యేహ్య భావం కలుగుతున్నదో తెలుస్తున్నది. ఆమె పరిస్థితికి నవ్వుతూ నిర్మలానందుడు ఇట్లా అన్నాడు… “తల్లీ! వేషాన్ని బట్టి మనిషిలోని దోషాలు తొలగిపోవు! గడ్డం పెంచుకున్న వాళ్లందరూ రుషులు కారు! గుండు గీసుకున్న వాళ్లందరూ శ్రమణకులు కారు! తమ ప్రయత్నానికి ప్రతిబంధకం అయ్యే పనులను తగ్గించుకోవడంలో అవి ఒక భాగం మాత్రమే! అయినా నిన్ను శ్రమణకురాలని ఎవరన్నారు?”
“నేనే! అవును నేనే అంటున్నాను! నన్ను మరొకరు బుద్ధుని శిష్యురాలుగా చేయడం ఎందుకు? నేనే ఆ స్వామికి శిష్యురాలినని ప్రకటించుకుంటున్నాను! ఆయన మార్గంలో పయనించడానికి మనసా, వాచా, కర్మణా నేను నిర్ణయించుకున్నాను! అనుసరించ దలుచుకున్నాను!” అన్నది శూన్యంలోకి చూస్తూ. “అట్లా నిన్ను నీవు ప్రకటించుకోవడానికి అవకాశం లేదు తల్లీ!” అన్నాడు నిర్మలానందుడు. “ఏం? ఎందుకని?” “ఎందుకంటే నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి కాదు! ఒక భర్తకు భార్యవు; ఒక వంశానికి ప్రతినిధివి; ఒక కుటుంబంలో భాగస్వామినివి. నీవు సన్యసించాలంటే వాళ్ల అనుమతి తీసుకోవడం తప్పనిసరి!” “నా భర్త ప్రస్తుతం లేడు; మామ కూడా లేడు. ఇంకెవరి అనుమతి తీసుకోవాలి?” “అత్తగారు ఉన్నారు కదమ్మా!!!”
పారిపోతున్న సచ్చసామిని వెంబడించి పట్టుకొని వచ్చి, మేఘచంద్రుని ముందు నిలబెట్టినారు భటులు. “నాకేం తెలవదు! నన్ను వదిలేయండి తండ్రీ! నాకేం తెలవదు! నన్ను వదిలేయండి ప్రభూ!” ఏడుస్తూ అన్నాడు సచ్చసామి. “నేనేమీ అడగక ముందే తెలియదు అంటున్నావంటే.. మాకు తెలియని ఏవో విషయాలు నీకు తెలుసునని అర్థమవుతున్నది. చెప్పు! నీకేం తెలుసు? ఎందుకు పారిపోతున్నావు?” సూటిగా అడిగినాడు మేఘచంద్రుడు. “నిజం ప్రభూ! మా అమ్మ మీద ఒట్టు! నాకు ఏమీ తెలవదు! బుద్ధి గడ్డి తిని, పొట్టకూటి కోసం ఈ ఆడవాళ్లు మా ఊరికి వచ్చినారని భ్రమపడి, వీళ్లతో ఆటాడుకోవచ్చు అనుకున్నా! మీరు రాజులని; మహారాజుల బంధువులని నాకేం తెలుసు సామీ! ఈ అమ్మగారు కూడా గుడ్డిదానిలా బ్రహ్మాండంగా నటించేసినారు…!”
అతని అవస్థ చూస్తుంటే అలసుద్దికి ఒక పక్కన నవ్వొస్తుంది; మరోపక్క జాలి కలుగుతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా అక్క రోహాదేవి సంగతి అంతుచిక్కక సతమతమవుతున్నది.
“మహారాణి అంటూనే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంది సచ్చసామీ! మా అక్క గుడ్డిదానిలా నటించడం ఏమిటి?” ఆశ్చర్యం, కోపం ఒకేసారి కలిగినాయి మేఘచంద్రునికి. భయంతోపాటు అయోమయం కూడా అంతరంగాన్ని కుదిపేస్తుండగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని భ్రమలో పడిపోయినాడు సచ్చసామి… “నా బుద్ధి గడ్డి తిన్నది; వివేకం అటకెక్కింది; నాలుక అదుపు తప్పింది; మెదడు మొద్దుబారి పోయింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు మా రాజా! అయినా మీరంతా కలుసుకున్నారు కదా! నన్నొదిలేసేయండి! నా బతుకేదో నేను బతుకుతా….!” “అయ్యో! సచ్చసామీ! నేను నిన్ను ఏమన్నాను? నిజానికి నువ్వు మాకు మహోపకారం చేసినావు! చనిపోయినారు అనుకున్న మా వాళ్లను కలుసుకునేటట్లు చేసినావు. అందుకు నేను నీకు ఎంతో విలువైన బహుమతులు ఇవ్వదలుచుకున్నాను. కానీ, నా కూతురు జాడ కూడా తెలిపితే, ఇంతకు పదింతలు బహుమతులు ఇస్తాను!” అన్నాడు, నచ్చజెప్తున్నట్లుగా.
“ఆ సంగతి నాకేం తెలుసు మా రాజా? గత మూడు రోజులుగా నేను తమరితోనే కదా ఉన్నాను. నాకు ఇంతకు మించి ఏమీ తెలవదు!” అని సచ్చసామి అంటూ ఉండగానే, ఊళ్లో నుంచి బిలబిల మంటూ జనం వచ్చి అక్కడ మూగినారు. వాళ్లను చూస్తుంటే ఏదో కొట్లాడటానికే వచ్చినట్లు అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఆయుధం కనిపిస్తున్నది! వాళ్లు అక్కడి దృశ్యం చూసి మరింత ఆవేశపడ్డారు. అందులో నాయకుని వంటి వాడు… “మా సచ్చసామిని ఎందుకు హింసిస్తున్నారు? అతను ఏం తప్పు చేసినాడు? ఆయన ఒంటి మీద దెబ్బ పడితే మీరు ఇక్కడి నుంచి కదల లేరు!” అన్నాడు. అప్పుడు సిరిసత్తి కలుగజేసుకున్నది…
“మీరు పొరబడుతున్నారు నాయనా! సచ్చసామి మా శ్రేయోభిలాషి! మేము ఆయనకు అపకారం ఎందుకు చేస్తాం…” అంటుండగానే కంగారుగా అలసుద్ది మధ్యలో అందుకున్నది…
“మా అక్క ఈ ఉదయం నుంచి కనిపించడం లేదు! ఆ విషయమే అడుగుతున్నారు సామీ!” అన్నది. ఆమె మాటలు విని ఆ బృందంలో నుంచి ఒక వృద్ధుడు నవ్వినాడు… “బహు బాగున్నది మీ యవ్వారం! ఆమె కొడుకూ, కోడలు కలిసే తిరుగుతున్నారు కదా! ఎక్కడ చూసినా చెట్టాపట్టాలు వేసుకుని… కొడుకును అడగకుండా ఊరి వాళ్లని అడిగితే ఏం చెప్తారు?” అన్నాడు. మేఘచంద్రుని బుర్ర గిర్రున తిరిగిపోయింది. తాను ఆడిన అబద్ధం ఇంతటి విపత్తును కలిగిస్తుందని ఊహించని సిరిసత్తి మ్రాన్పడిపోయింది. మేఘచంద్రుడు మరింత అయోమయంలో పడిపోయినాడు. ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరు సత్యం? ఎవరు అసత్యం? ఏదీ అర్థం కావడం లేదు అతనికి. “అక్కా.. ఏమిటి వాళ్లు అంటున్నది? మా అల్లుడు గారు జయసేనుడు కూడా మీతోనే ఉన్నాడా? ఎప్పుడు వచ్చినాడు?” అన్నాడు తానున్నది కలలోనో, వాస్తవంలోనో తెలుసుకోలేక. నోట మాట రాలేదు సిరిసత్తికి. అప్పుడు కలుగజేసుకున్నది అలసుద్ది. “ప్రభూ! తమరు ఒకసారి లోపలికి వస్తే, నేను మీకు అన్నీ వివరంగా చెబుతాను!” అన్నది, చేతులు జోడించి. ఆమెను అనుసరించి గృహంలోనికి పోయినాడు మేఘచంద్రుడు. అతనికి క్లుప్తంగా ఇట్లా చెప్పింది ఆహవసత్తి అనే మారుపేరుతో ఉన్న అలసుద్ది…
“లంకా దహనం నాటకం పేరుతో కోటలాంటి మా గృహాన్ని దుర్మార్గులు తగులబెట్టినారు. ఇది ముందుగానే ఊహించిన కువిందు తాత పెద్దరాణి గారిని, చిన్నరాణి గారిని రక్షించేందుకు కోటలోని రహస్య మార్గం ద్వారా తీసుకొని పొమ్మని నన్ను ఆదేశించినాడు. మేము ఆ రహస్య మార్గంలో ప్రవేశించి వస్తుండగా రెండు దారులు కనిపించినాయి. ఏ దారిని ఎంచుకోవాలో తెలియక ఇక్కడికి వచ్చి చేరినాము. మేము ఇక్కడికి వచ్చే లోపునే కువిందు తాత మమ్ములను కలుసుకుంటానని అన్నాడు…” “ఆయన ఆరోజే దొంగలతో పోరాడుతూ చనిపోయినాడని తెలిసింది తల్లీ!” అని ఆ కువిందు త్యాగాన్ని తలుచుకున్నాడు మేఘచంద్రుడు.
ఆ విషయం వినగానే ఆమె కంటి నుంచి జలజలా కన్నీరు రాలింది. ఏడుపును నిగ్రహించుకుంటూ, ఇంకా ఇట్లా అన్నది అలసుద్ది… “ముగ్గురం ఆడవాళ్లం! కొత్త ప్రదేశం! పెద్ద మహారాణి అంధురాలైంది…” “అదేమి? ఇదే మాట సచ్చసామి కూడా అన్నాడు. అక్కకు కళ్లు కనిపిస్తున్నాయి కదా!” “తమరు వచ్చేముందే ఆమెకు చూపు వచ్చింది ప్రభూ! అదంతా ఆనందుని దయ!”
“అతనెవరు?” అంటుండగానే బయట కలకలం అధికమైంది. “ప్రభూ! ఇంకా చాలా విషయాలున్నాయి…”
“సరే! ముందు బయట ఏం జరుగుతుందో చూద్దాం పద!” అంటూ మేఘచంద్రుడు బయటికి వచ్చినాడు. అతనితోపాటే అలసుద్ది కూడా బయటికి వచ్చింది. అక్కడ జనం అరుస్తున్నారు. “అదిగో! నీ కొడుకు వచ్చినాడు కదా!” ఎవరో గట్టిగా అరిచినారు గుంపులో నుంచి. “కోడలు కూడా వస్తున్నది!” ఇంకొకరు ఎవరో అరిచినారు. అందరి దృష్టి వాళ్ల మీద పడ్డది. సన్యాసుల దుస్తుల్లో ఉన్న ముగ్గురు మనుషులు రావడం అందరూ గమనించినారు. అందులో ఆనందుడు, భాణుసత్తి (రోహాదేవి)ని అందరూ గుర్తించినారు. మూడో మనిషిని గుర్తించలేక పోయినారు. అతను నిర్మలానందుడు! ఇంటి చుట్టూ జనాన్ని చూసి రోహాదేవి గుండె వేగం పెరిగింది.
‘నేను చేసిన పాడు పనికి అత్త గుండె ఆగిపోలేదు కదా!’ అనుకుంటూ పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకొని, తండ్రి కనిపించగానే.. “నాన్నా!” అని బిగ్గరగా అరుస్తూ మేఘచంద్రుణ్ని అల్లుకున్నది! ఆ కన్నీటిలో దుఃఖం, ఆనందం, ఆత్మన్యూనత, ఉద్వేగం అలలు అలలుగా ప్రవహించ సాగినాయి…
(సశేషం)
– దోరవేటి, 89788 71961
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

