Actress Priya Bhavani | బుల్లితెరపై మెరిసిన ప్రియా భవాని శంకర్.. ఇప్పుడు వెండితెరనూ ఏలేస్తున్నది. తమిళ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి.. తొలి సక్సెస్‌ను అందుకున్నది. హిట్టు మీద హిట్టు కొట్టి.. స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ‘కళ్యాణం.. కమనీయం’ అంటూ టాలీవుడ్‌నూ పలకరించింది. ‘భీమ’ చిత్రంతో గోపిచంద్ సరసన నటించి మరోసారి తెలుగు తెరపై తళుక్కుమన్నది. చూపులతోనే కోటి భావాలు పలికించే.. ఆ చారెడు కళ్ల సుందరి మనసులో మాట..
హృద్యంగా, జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలంటే ఇష్టం. ఆ సినిమా నిండా ప్రేమ, ఆనందం ఉండాలి. హింస మితిమీరితే.. చూడలేను. చాలా ప్రశాంతంగా.. పాప్‌కార్న్ తింటూ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ సినిమా చూడాలనేది నా ఫిలాసఫీ. ఈ మధ్య చూసిన చిత్రాల్లో ‘హాయ్ నాన్న’ నాకు బాగా నచ్చింది.
సోషల్ మీడియాకు నేను దూరం. అప్పుడప్పుడూ పలకరిస్తుంటా నంతే. ఒక పోస్ట్ పెడితే.. మళ్లీ పక్షం రోజుల దాకా అటువైపు చూడను. మళ్లీ ఎప్పుడో.. ఏదైనా వేడుక జరిగినప్పుడు.. దానికి సంబంధించిన ఓ కామెంట్!
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్.. నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అందులో నాగచైతన్యకు భార్యగా నటించాను . ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.
అందానికి సరైన నిర్వచనాన్ని ఎవరూ కనిపెట్టలేదు. అది అనిర్వచనీయమైంది. కొందరు సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు చూసి.. అదే అసలైన అందం అనుకుంటారు. ఆ మాట అసలు నిజం కాదు. శరీర సౌష్టవం, రంగు, రూపం.. ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని ఎవరైనా నొప్పిస్తే అస్సలు పట్టించుకోవద్దు. ఆత్మన్యూనతకు గురికావొద్దు.
పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు దాదాపు అన్నిచోట్లా ఉన్నాయి. ఈ విషయంలో బాధిత మహిళలకు మద్దతుగా నిలిచేవారికంటే.. వారిని నిందించేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
నా కెరీర్ న్యూస్ ప్రజెంటర్‌గా మొదలైంది. ఆ తర్వాత టీవీ సీరియల్లోనూ చేశాను. అక్కడి నుంచి.. సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో అన్నీ తమిళ చిత్రాలే చేశాను. అయితే, అవన్నీ తెలుగులోకి డబ్ కావడంతో, ఇక్కడి ప్రేక్షకులూ ఆదరించారు. అలా.. టాలీవుడ్లో అడుగుపెట్టా!
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి.. ఫిట్నెస్ కాపాడుకోవాల్సిందే! ఇందుకోసం రోజూ వ్యాయామం చేస్తా. అప్పుడప్పుడూ యోగాసనాలు వేస్తా!
తెలుగులో నేరుగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇక్కడి ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తున్నారు. ఇదంతా చూసి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ నేను కూడా తెలుగు అమ్మాయినేనని ఫీలవుతుంటా. తెలుగు కూడా నేర్చుకుంటున్నా.
అనుకోకుండా చిత్రసీమలో అడుగుపెట్టాను. ‘ఈ రంగంలో నా భవిష్యత్ ఎలా ఉంటుందో?’ అని ఎక్కువగా ఆలోచించలేదు. అంచనాలు కూడా పెట్టుకోలేదు. ప్రేక్షకులు నన్ను స్వీకరిస్తారో, లేదో? అని బెంగపడలేదు. నన్ను ఆదరిస్తున్న వారిని ఇలాగే అలరించాలని అనుకుంటున్నా.
నాకు పాటలు పాడటం ఇష్టం. కానీ, నేను బ్యాడ్ సింగర్‌ని. అందుకే, చుట్టూ ఎవరూ లేనప్పుడే.. పాడుకుంటా! నేను పాడటం ఎవరైనా చూస్తే.. సంగీతాన్ని ఖూనీ చేస్తున్నావని తిడతారేమో అని నా భయం.