మయారా.కామ్.. టోపీల ప్రపంచం. పెద్దవి, చిన్నవి, గుండ్రనివి, నలుచదరంగా ఉన్నవి.. ఇలా రకరకాల టోపీలు ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. వీటి వెనుక నమ్రతా లోధా అనే ఆంత్రప్రెన్యూర్ ఉన్నారు. ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లకు కూడా తనే హ్యాట్ డిజైనర్. పాశ్చాత్య దేశాల్లో హ్యాట్ ఫ్యాషన్ ఎప్పటి నుంచో ఉంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నది.
అంతర్జాతీయ పర్యటనలు పెరిగిపోవడం, సోషల్ మీడియా ఇందుకు కారణం కావచ్చు. చాలామంది సెలెబ్రిటీలు హ్యాట్ లేకుండా బయటికి రావడం లేదు కూడా. ఈ మార్పును ఓ వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు నమ్రత. తన ఆలోచనకు పర్యావరణ పరిరక్షణను జోడించి ఎకోఫ్రెండ్లీ ముడిసరుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
మన ముఖాకృతిని బట్టి టోపీలను ఎంచుకోవాలని సూచిస్తారు నమ్రత. మన ఒంటి రంగుకు, మనం ధరించిన దుస్తులకు అనువైన టోపీలు వాడాలని చెబుతారు. టోపీ ధరించడం వల్ల మన ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి కూడా. నమ్రత మధ్యప్రదేశ్‌లోని హర్దాలో పుట్టిపెరిగారు.
యాభై రెండేండ్ల వయసులో ఆంత్రప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేశారు. ఓ వేసవిలో పిల్లలతో కలిసి అమెరికా వెళ్లినప్పుడు.. జనం రకరకాల టోపీలు ధరించడం చూశారు. అప్పుడే, మన దగ్గర కూడా టోపీ కల్చర్‌ను ప్రోత్సహించాలనే ఆలోచన వచ్చిందామెకు.