ఈ గాలీ! ఈ నేలా!
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
నేత్ర ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకు ఆలస్యమై ఉంటుంది? నిరుపమను అంతకంతకూ భయం కమ్మేస్తున్నది. ఎప్పుడైనా ఇంటికి రావడం ఆలస్యమైతే వెంటనే ఫోన్ చేసి తానెక్కడుందో, ఎంతసేపట్లో వస్తుందో చెప్తుంది నేత్ర. ఇవ్వాళ కూడా అలాగే ఒక గంట ఆలస్యం అవుతుందని చెప్పింది. కనీసం ఏ ఎనిమిదింటికో, తొమ్మిదింటికో రావలసిన నేత్ర.. రాత్రి 11 అయినా రాలేదు. కంపెనీ పనిమీద విశాఖపట్నం వెళ్లిన సూర్యంకి ఫోన్ చేస్తే కంగారు పడిపోవడం తప్ప.. దూరాన ఉన్న ఆయనేం చేయగలరు? నిరుపమకు గుండె వేగం పెరిగిపోయి శరీరం సన్నగా కంపించసాగింది. అష్రఫ్‌కి కాల్ చేస్తే ఫోన్ ఎత్తడంలేదు. నిమిష నిమిషానికి ఆమెలో ఎన్నెన్నో అనుమానాలు రేకెత్తున్నాయి. అటు నేత్రకి, ఇటు అష్రఫ్‌కి పదేపదే ఫోన్ చేస్తూనే ఉంది. సమయం పదకొండున్నర అయ్యింది. ఇప్పుడామె భయం నేత్ర రావడం ఆలస్యమైనందుకే కాదు. అదే సమయంలో అష్రఫ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయనందుకు.
ఎప్పుడైనా ఇద్దరూ కలిసి బయటికి వెళ్లినా త్వరగానే వచ్చేస్తారు. మనసులో సన్నగా మొదలైన భయం, అనుమానం అంతకంతకూ పెరిగిపోయి దుఃఖంగా మారసాగింది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడ వెతకాలి..? అసలు నేత్ర ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. నేత్ర స్నేహితుల నెంబర్లు కానీ, పోనీ అష్రఫ్ వాళ్ల అమ్మానాన్నల నెంబర్లు కానీ.. తన దగ్గర లేవని గుర్తుకొచ్చి గుండెలో అలజడి పెరిగిపోయింది. మళ్లీ అదే ప్రశ్న. ఎవరిని అడగాలి? ఎక్కడని వెతకాలి? పోలీస్ రిపోర్టు ఇవ్వాలా? అంతా అయోమయం. మళ్లీ ఒకసారి నేత్రకి, అష్రఫ్‌కి ఫోన్ చేసింది. ఇద్దరిలో ఎవరూ ఎత్తలేదు. దాంతో ఆమె అనుమానాలు మరింత పెరిగి.. కింద కూలబడిపోయి ఏడవడం మొదలుపెట్టింది.
పది నెలల క్రితం అసలు అష్రఫ్ ఎవరో ఎవరికీ తెలియదు. నిరుపమ కుటుంబానికి అష్రఫ్‌కి అనుబంధం అతి మామూలుగానే మొదలయ్యింది. చిత్రంగా రానురానూ అష్రఫ్ రాకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా.. మనసులో ఏదో బెంగగా ఉంటుంది..
నేత్రకే కాదు నిరుపమ-సూర్యంలకు కూడా. పది నెలల క్రితం సూర్యం అన్న కొడుకు భరత్ ఏదో ట్రైనింగ్ కోసం ఆ ఇంటికి
వచ్చేవరకూ.. సూర్యం, నేత్ర, నిరుపమ.. ముగ్గురివీ మూడు ప్రపంచాలన్నట్టుగా ఉండేవారు. భరత్ కబుర్లు చెబుతూ ఇల్లంతా తిరుగుతుంటే ఇంట్లో ఏదో కొత్త సందడి మొదలైంది. సాయంత్రాలు తన కో ట్రైనీ అయిన అష్రఫ్‌ని తరుచూ ఇంటికి తీసుకొస్తుండేవాడు. నిజానికి నేత్ర మంచి హుషారైన అమ్మాయే. కానీ, ఈ మధ్య వర్క్‌లోడ్‌తో స్తబ్ధుగా మారిపోతున్న నేత్రను మళ్లీ చలాకీగా చేసింది భరత్ మాత్రమే కాదు, అష్రఫ్ కూడా. భరత్లాగే అష్రఫ్ కూడా ఎలాంటి వాళ్లనైనా ఆకట్టుకునే మంచి మాటకారి. భరత్, సూర్యం, అష్రఫ్, నేత్ర, నిరుపమ మాటల్లో పడితే కాలం తెలిసేది కాదు. నేత్ర, భరత్‌ల చిన్ననాటి సంగతులను నిరుపమ చెప్తుంటే.. అందరూ మురిపెంగా వినేవారు. అన్నగా భరత్ ఎప్పుడైనా మంచీచెడూ చెబుతూ నేత్రను గైడ్ చేస్తుంటే.. తననెవరో
ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా ఉండేదామెకు. వెంటనే.. “భరత్వన్నీ భయాలే నేత్రా! నువ్వు నీలాగే, నీకు నచ్చినట్టుగా ఉండు. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండు” అని అష్రఫ్ చెప్తుంటే.. నేత్రకి కొత్త ఊపిరి పోసుకున్నట్టుగా అనిపించేది.
“అన్నిటికీ వీళ్లమీద ఆధారపడకండి ఆంటీ!” అంటూ భరత్, అష్రఫ్‌లు నిరుపమ ఫోన్లో జెప్టో, స్వీగ్గీ యాప్స్, ఊబర్, రాపిడో యాప్స్ ఇన్స్టాల్ చేసి, వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. ఆమె ఫోన్లో వాట్సాప్ అకౌంట్ కూడా ఓపెన్ చేయించారు.
హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ, చురుకుగా ఉండటం ఏ వయసు వారికైనా ఎంతో అవసరమంటూ అష్రఫ్, భరత్‌లు మెల్లగా క్యారమ్స్, చెస్ ఆటలనుంచీ బాడ్మింటన్ వరకూ నేత్రనే కాదు.. నిరుపమను కూడా వాళ్ల ఆటల్లోకి లాగారు. కోర్స్ ముగిసిన తర్వాత విశాఖపట్నంలో పోస్టింగ్ రావడంతో భరత్ వెళ్లిపోయాడు. అష్రఫ్ హైదరాబాద్‌లో మంచి ఆఫీసులో ప్లేస్మెంట్ సంపాదించాడు. భరత్ వెళ్లిపోతే అష్రఫ్ మరింక రాడనుకున్నారు అందరూ.. కానీ భరత్ వెళ్లిన మర్నాడే అష్రఫ్ రాక ఒకింత సంతోషాన్ని, మరొకింత భయాన్ని కలిగించింది నిరుపమకి. చాలామంది లాగానే పైకి ఎంతో అధునాతనంగా ఉన్నట్టు కనిపించే నిరుపమకు
మొదటినుంచీ ముసల్మానులంటే ఏదో వ్యతిరేక భావం. అసలు మొదట్లో అష్రఫ్ ముస్లిం అనుకోలేదు.
‘ఒరే అషూ.. అషూ!’ అని భరత్ పిలుస్తుంటే.. అతని పేరు ఏ అశ్వినో అయ్యుంటుందని అనుకుంది. చాలా రోజుల తర్వాత అతను అశ్విన్ కాదు.. అష్రఫ్ అని తెలిశాక, అకస్మాత్తుగా ఆమె ముభావంగా మారిపోయింది. మన మతం కానివాడిని ఇంటికి తీసుకొచ్చి ఇంత చనువిచ్చినందుకు భరత్ మీద కోపం ముంచుకొచ్చింది కూడా. కానీ, ఈ ఇరవయ్యో శతాబ్దపు నాగరీకురాలు తన మనసులోని మాటను బయటపెట్టలేదు కదా! అప్పటినుంచి కొత్తగా.. అష్రఫ్ వస్తే నిరుపమకు ఓ పక్కన భయం, ఒకింత గుబులు బయలుదేరాయి. ఉండుండి.. “అమ్మో! మీ వాళ్లని నమ్మలేం!” అని ఓ మాట విసురుతుండేది. నేత్ర, భరత్ భయపడి పోయేవాళ్లు. అష్రఫ్ మాత్రం.. “మాకు ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచీ అలవాటే!” అంటూ నవ్వుతూ కొట్టి పడేసేవాడు. ఒక్కోసారి ఆ వాదన తీవ్రమైనప్పుడు.. “ఆంటీ! ఈ గాలీ.. ఈ నేలా.. మీదీ మాదీనూ. మీరు కానీ మేము కానీ, ముందే ఎవరినో కోరుకుని ఇక్కడ పుట్టలేదు. ఇక్కడి ఈ భూమ్మీద మీరెలా పుట్టారో, మేం కూడా అలాగే పుట్టాం. అయినా సరే మీరు పుట్టక ముందునుంచే ఇక్కడి భూమ్మీద మీకే హక్కు ఉన్నట్టు.. మాకు ఏ హక్కూ లేనట్టు భావిస్తారు. మా అమ్మానాన్నలూ, వాళ్ల పెద్దలు కూడా ఇట్లాంటి మాటలు పడ్డారు. ఇప్పుడు మేమూ పడుతున్నాం. మనం మనుషులుగా పుట్టాం. కానీ, అదేమిటో మతాలుగా ఎదుగుతున్నాం. మతాల్లోనే
కొట్టుకుపోతున్నాం..” అన్నాడు.
ఆ మాటలకు నొచ్చుకున్న నిరుపమ.. “అయ్యయ్యో! అట్లా అనకు అష్రఫ్. జరిగిన ఎన్నో సంఘటనలు అప్పుడప్పుడూ మాతో
అట్లా మాట్లాడిస్తాయి” అని సర్ది చెప్పేది. “అయ్యుండచ్చు ఆంటీ! నేను కూడా ఎవ్వరినీ సమర్థించడం లేదు. అసలు మనమెప్పుడూ పోట్లాడుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండటమే కదా ఈ రాజకీయ నాయకులకు కావలసింది. మనం ఏకమైతే వాళ్ల ప్రయోజనాలు నెరవేరవు. అందుకే ఎంతో సామరస్యంగా ఉండాల్సిన మనం.. ఒకరినొకరు ఇలా అనుమానించుకుంటూ, అవమానించుకుంటూ బతుకుదాం” బాధగా అనేవాడు. “అయ్యో! మీతో మాకే గోడవా లేదబ్బాయి. ఎవరి బతుకులు వాళ్లం బతుకుతున్నాం” బింకం చూపేది. చిన్నప్పటి నుంచీ తాను కోరుకున్నది పొందేవరకు ఊరుకోని నేత్రను.. ఇక తాను కట్టడి చేయలేనని నిరుపమకు అర్థమైపోయింది. నేత్రకీ, అష్రఫ్కీ ఏదో నేత్రావధానం వచ్చినట్టు.. అందరూ అక్కడ ఉండగానే కళ్లతోనే మాట్లాడుకోవడం నిరుపమకు తెలుస్తున్నా తెలియనట్టే ఉండసాగింది. ఒక హిందువుల అమ్మాయిని చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకున్నా కొడుకు మాటని కాదనరని అష్రఫ్ ఆశపడుతుంటే.. రోజురోజుకీ నేత్ర-అష్రఫ్ స్నేహం బలపడటం గ్రహిస్తున్న నిరుపమ-సూర్యంలు, వారి బంధం స్నేహంతోనే ఆపేయాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏదో ఒక సందర్భం కల్పించుకుని.. “అయినా మీకూ, మాకూ ఎలా కుదురుతుంది చెప్పు? ఏదో అందరం కలిసి మెలిసి బతకడం వేరు. మతాంతర పెళ్లిళ్లు చేసుకోవడం వేరు. ఎందుకో మీరంటేనే మాకు భయం” కొన్నేళ్లుగా నాటుకుపోయిన భావజాలానికి వారసురాలి స్వరం నిరుపమది. అష్రఫ్ వాతావరణాన్ని తేలిక చేస్తూ.. “ఆంటీ! వ్యక్తులుగా మేమంటే మీకు భయంలేదు. మా మతమంటేనే మీకు భయం.. ఒకానొకప్పుడు నేత్రలాంటి ఓ అమ్మాయి అన్యమతస్తుడైనా సరే తనకు నచ్చిన ఆ వ్యక్తినే చేసుకుంటానని పట్టుబట్టింది. ఆ తండ్రి ఒక దేశానికే ప్రధాని అయినా.. తన కూతురిని అన్యమతస్తునికిచ్చి పెళ్లి చేయాలా? అనే ఆలోచనలో పడిపోయాడు. వ్యక్తిగా నచ్చినా, అతని మతం నచ్చలేదు. ఎవరైనా పెంపకానికి పిల్లలను వెతుక్కుంటారు.. కానీ, పెళ్లికోసం ఆ అబ్బాయి అర్జెంటుగా అమ్మానాన్నలను వెతుక్కున్నాడు. అట్లాగే పెళ్లికోసం నన్ను కూడా ఎవరన్నా పెంచుకుంటే నేను కూడా ఎవరికైనా దత్త పుత్రుడినై పోతాను” అని చిలిపిగా నవ్వాడు. నిరుపమ భయం నిజమయ్యింది. ఈ మాటలతో అష్రఫ్-నేత్ర మధ్యనున్న ప్రేమ సుస్పష్టమైపోయింది. ఇవాళారేపూ కులాంతర వివాహాలే నిలబడలేక పోతున్నాయి. ఇక మతాంతర వివాహమంటే అదో జీవితకాలపు పోరాటమని ఎన్నో జంటల జీవితాలు నిరూపించాయి. తనకు అష్రఫ్ ఎట్లాంటివాడో తెలుసు కానీ.. తన భర్తని, బంధుబలగాన్ని ఎట్లా ఒప్పించాలో అర్థంకాక సతమతమై పోయింది. నేత్రను అష్రఫ్ ఇష్టపడగానే సరిపోయిందా.. మతాంతరమంటే ఎన్ని సమస్యలొస్తాయి? పెళ్లికి ముందే తన కూతురి మతం మార్పించేస్తారు. పోనీ, పెద్దలం తాము గట్టిగా వ్యతిరేకిస్తే.. ఇద్దరూ మేజర్లు. ఇంటినుంచి వెళ్లిపోయైనా పెళ్లి చేసేసుకుంటారు. ఓ పక్కన అష్రఫ్ అంటే
అభిమానమున్నా.. మరో పక్క విపరీతమైన ఆందోళన పెరిగిపోయిందామెకు.
నేత్రలేని అదను చూసి.. తన అసహనమంతా అష్రఫ్ మీద చూపించింది. “స్నేహం వేరు. పెళ్లి వేరు. నేత్ర చాలా మొండిపిల్ల. ఒక్కతే పిల్ల అని చాలా గారాబం చేశాం. ఇప్పుడు అది మా మాట వినే స్థితిలో లేదు. పెళ్లంటే మాటలనుకున్నావా? పదినెలల క్రితం నువ్వెవరో, మేమెవరో! అసలు నువ్వు మా జీవితాల్లోకి ఎందుకొచ్చావు?” ఉక్రోషంగా అన్నది “అదేంటి ఆంటీ? ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోతుంది. భరత్ పిలిస్తేనే కదా వచ్చాను! ఏదో కారణం లేకుండానే మనమంతా ఇలా కలుస్తామా?”.. ఆమె విసుగు, కోపం కేవలం తన మతంపై మాత్రమే అని అర్థమైన అల్లరి జవాబు. “అవును! వాడొచ్చి ఈ ఇంటిని ఒక భారతదేశం చేసేశాడు” నిరుపమ స్వరంలోని ఉక్రోషం.. ఆక్రోశంగా మారక మునుపే అష్రఫ్‌ని పెరట్లోకి రమ్మని సైగ చేసేది నేత్ర..
ఆ సాయంత్రం.. పూత దానిమ్మ చెట్టుకింద ఇద్దరూ మాటల మాలలు కట్టారు.. “మా అమ్మ అన్నదని కాదు, రేపు పెళ్లయ్యాక నిజంగానే నన్ను మతం మారమంటేనో!? మీలో మీ మతంలోకి మారకుండా పెళ్లిళ్లు చేసుకోరంట కదా!” నేత్ర కళ్లనిండా భయం.
“నీ మతం నీదే! నా మతం నాదే! మనమున్న ఈ దేశంలో ఇన్ని మతాలున్నట్టే.. ఒక ఇంట్లో రెండు మతాల వాళ్లం కలిసి ఉండలేమా? ఇన్ని రోజుల్లో నా మతం నిన్నుగానీ, నీ మతం నన్నుగానీ ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఇదే మన జీవితాల్లోకి
వర్తింపచేసుకోలేమా?” “ఏమో! ఇప్పుడు మనం ప్రేమికులం కాబట్టి ఇలాగే అంటావు. రేపొద్దున్న నీ పేరు అయేషా అనో, నస్రిన్ అనో మార్చేసుకోమంటే ఏం చేయాలి?” “పిచ్చి నేత్రా! ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు మార్చమంటే మాత్రం.. నీ సర్టిఫికెట్లలో, ఉద్యోగంలో, ఆధార్ కార్డులో ఉన్న నీ పేరు ఎక్కడికి పోతుంది? నువ్వు నేత్రవు కాకుండా పోతావా? అసలు నీకలాంటి పరిస్థితి రానివ్వను సరేనా!” “మరి మీ పెద్దవాళ్లు.. ‘నువ్విప్పుడు మా కోడలివి.. ఇకనుంచీ బొట్టు పెట్టుకోవద్దమ్మా!’ అంటే?” “నా నేత్రని నేను తన చదువు, ఉద్యోగం, తన కట్టూబొట్టూలతో సహా ప్రేమించాను. తనిలా బుట్టబొమ్మలా ఉంటేనే నాకిష్టం. నా నేత్రని నాకు వదిలేయ్యండి! తనని తనలాగే ఉండనియ్యండని మా అమ్మీ, అబ్బాలకు నచ్చజెప్తాను”.
“హా! పెళ్లికి ముందు అందరూ ఇలాగే చెప్తారు. పెళ్లయిన తర్వాతనే మీ వాళ్లు పెట్టే నిబంధనలేమిటో, అవి నేను పాటించకపోతే జీవితం ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. అష్రఫ్.. ప్రేమంటే మనిద్దరికీ సంబంధించింది మాత్రమే! కానీ, పెళ్లంటే రెండు కుటుంబాలది. ఆ కుటుంబాలు కొంతమంది బంధువులతో ముడిపడి ఉంటాయి. వారందరి సలహాలో, వెటకారాలో మన జీవితాల మీద ప్రభావం చూపించకపోవు” “నేత్రా! మనం చదువుకుని, ఉద్యోగాలు పొంది, పూర్తిగా వ్యక్తులుగా ఎదిగి, ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనం ఇంకొకరి మాటలతో ప్రభావితమయ్యేంత అపరిపక్వంగా ఉన్నామంటావా? అనేవాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం ఒకరికొకరం జీవితాంతం కలిసి బతకాలని బలంగా నిర్ణయించుకుంటే.. మరింకే విషయాలకీ ప్రాధాన్యం ఇవ్వక్కరలేదు. మన చుట్టూ ఉన్న సమాజం ఏమంటుందో? రేపొద్దున్న మనకు పుట్టిన పిల్లల భవిష్యత్తెలా ఉంటుందో? అనుకుంటూ ఇన్ని అనుమానాలతో జీవితాన్ని ఆరంభిస్తే సుఖంగా ఉండలేం. అసలిన్ని భయాలెందుకు? పోనీ స్నేహితులుగానే విడిపోదామా?”
నేత్రా దెబ్బతిన్నట్టుగా చూసింది. “అవును! ఒక పది నెలల క్రితం నువ్వెవరో నేనవరో? మీ అమ్మ అన్నట్టు అసలు నేను మీ జీవితాల్లోకి ఎందుకొచ్చానో.. పోనీ వేరే ఆలోచన చేద్దాం. నేను లేకపోతే నువ్వు హాయిగా ఉంటానంటే చెప్పు, నా దారిని నేను వెనక్కు మళ్లిపోతాను” నేత్ర వచ్చి అతని బుగ్గ గట్టిగా గిల్లింది.. “ఏయ్ ఏమిటిది..?” అరిచాడతను. “ఓ ఇది నువ్వే..! కానీ సగం సినిమాలో హీరోకి డబ్బింగ్ ఆర్టిస్ట్ మారినట్టు.. నీ గొంతు నుంచి వేరేలా మాటలు వినిపిస్తుంటే నువ్వేనా అని గిచ్చి చూశా!” నేత్ర మాటలకు పెద్దగా నవ్వేశాడు అష్రఫ్. “నువ్వన్నట్టు మనం మనదారులు మళ్లించుకుని వేరే దారుల్లో సాగిపోవచ్చు అష్రఫ్!
కానీ, చాలా దూరం వచ్చేశాం. నేను లేకపోతే నువ్వు.. నువ్వు లేకపోతే నేను.. అర్దాంతరంగా గుండె ఆగి చచ్చిపోం. కానీ, మన గుండె లయ మారుతుంది. జీవితకాలపు జబ్బు మనుషులమై పోతాం. ఎవ్వరేమనుకున్నా సరే.. కలిసి ముందుకే నడుద్దాం. ఇక అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టున్న మన అమ్మానాన్నలను మెల్లగా మన పెళ్లికి ఒప్పించాలి”. “నేత్రా! నీకు నవ్వులాటగా ఉందేమోగానీ, నువ్వు లేకపోతే నిజంగానే చచ్చిపోతానేమో!? సరే, అలా కోపంగా చూడకు. ఇదిగో మనమీద రాలుతున్న ఈ
అనార్ పూల సాక్షిగా నిన్ను నా జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించి, మన రెండు కుటుంబాలకూ ఒక భద్రమైన జీవితాన్నిస్తాను. ఇది నీ జీవితానికి సరిపడా, నా జీవితాన్ని నీకోసం రాసిచ్చే వీలునామా!” నేత్ర కళ్లు జ్యోతుల్లా మెరిశాయి.
సమయం పన్నెండున్నర అయ్యింది. అప్పటికే బాగా ఏడ్చిఏడ్చి ఉన్న నిరుపమ ఇక నిలువరించుకోలేక భర్తకో, బెంగళూరులో ఉన్న భరత్కో ఫోన్లు చేద్దాం అనుకుంటుండగా.. ఫోన్ రింగవ్వడంతో ఉలిక్కిపడి లిఫ్ట్ చేసింది. “ఆంటీ! నేత్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? మీవి కూడా ఏడెనిమిది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏమయ్యింది ఆంటీ?” కంగారుగా అడిగాడు అష్రఫ్. “అదేంటి అష్రఫ్.. నేత్ర నీతో లేదా? తను ఇప్పటిదాకా ఇంటికి రాలేదు..” కంగారుగా అరిచింది. “మై గాడ్! ఇప్పుడు టైమ్ పన్నెండున్నర.. నేత్ర ఇంకా రాకపోవడం ఏమిటి?” “అష్రఫ్! ఆపు నీ నాటకాలు. చెప్పు నా కూతురు ఎక్కడుంది?” ఏడుస్తూ గట్టిగా అరిచింది నిరుపమ.
షాక్ తిన్న అష్రఫ్ అయోమయం నుంచి తేరుకుని మళ్లీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. మళ్లీ మళ్లీ ఆ మాటే అడుగుతూ.. అష్రఫ్ చెప్పే మాటలు వినకుండా ఏడుస్తూ, అరుస్తూనే ఉంది నిరుపమ. అష్రఫ్ ఫోన్ కట్ చేసేశాడు. దానితో నిరుపమకు నేత్రను అష్రఫే ఏదో చేసి ఉంటాడని రూఢీ అయిపోయి పెద్దగా ఏడవసాగింది. పదిహేను నిమిషాలకు డోర్‌బెల్ మోగింది. ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తియ్యగానే ఎదురుగా అష్రఫ్. “నేత్ర ఏది అష్రఫ్.. నిజం చెప్పు! నా కూతుర్ని ఏంచేశావు?” అష్రఫ్ కాలర్ పట్టుకుని కుదుపుతూ బోరుమని ఏడవసాగిందామె.. తలలో ఇనుప శూలాలు దిగబడినట్టు విలవిలలాడిపోతూ.. “ఆంటీ..!” గట్టిగా అరిచాడు అష్రఫ్.
“దేనికి అరుస్తున్నావు? అసలు మీ జాతిని నమ్మిందెవరు? మీరు చేసే ఘోరాలు ఇంట్లోవాళ్లకూ, ఇరుగు పొరుగువారికి కూడా తెలియకుండా చేస్తుంటారని ఎన్ని వార్తలు చూడటం లేదు. చెప్పు.. ఎవరితో చేతులు కలిపావు? నా కూతుర్ని అమ్మేద్దామని అనుకుంటున్నావా? లేదా ఏ ముసలి ముసల్మానుకో ఇచ్చి పెళ్లిచేసి దేశాలు దాటిద్దామని అనుకుంటున్నావా?” ఆమె మాటలు దెబ్బ మీద దెబ్బ వేస్తున్న సమ్మెట దెబ్బల్లా తగులుతుంటే.. “యా అల్లా..!” అంటూ కుప్పకూలి పోయాడు.. “అసలు నిన్ను కాదు, ఆ భరత్ గాడిని అనాలి. స్నేహితుడివంటూ ఇంటికి తీసుకొచ్చి మా నెత్తిన గుదిబండలా కూర్చోబెట్టి, వాడి దారిన వాడు బెంగళూర్ వెళ్లిపోయాడు. ఎవరు కాస్త ఆప్యాయంగా మాట్లాడినా మురిసిపోయే ఈ పిచ్చిది నీ ట్రాప్‌లో పడిపోయింది.. అదేంటి నేనూ, మీ అంకుల్ కూడా నీ మాటల గారడీలో పడిపోయాం. ఇప్పుడు నా కూతురు.. అయ్యో నేత్రా.. ఎక్కడున్నావమ్మా?” ఒకింత తేరుకున్న అష్రఫ్.. తన తమ్ముడు ఆరీఫ్‌కి ఫోన్‌చేసి ఏదో చెప్పాడు. నిరుపమ తన ధోరణిలో తాను ఏడుస్తూ అరుస్తూనే ఉన్నది. “ఆయేషాకు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ వచ్చినందుకు ట్రీట్ ఇస్తున్నది. సాయంత్రం కాస్త ఆలస్యం అవుతుందని చెప్పి వెళ్లింది. అక్కడినుంచీ నువ్వే ఎక్కడికో తీసుకెళ్లి ఉంటావు. ఇప్పుడు టైమ్ చూశావా? రాత్రి ఒంటిగంట అవుతోంది. మీ అంకుల్ ఊర్లో లేరని తెలిసే ప్లాన్ చేశావా? చెప్పు.. ఎక్కడ దాచావు నా కూతురిని?” “ఆంటీ.. మీరు మాత్రమే కాదు, నేను కూడా షాక్‌లో ఉన్నాను. అసలు మీరు నన్ను
అనుమానించడం ఏమిటి? ప్లీజ్ ఆంటీ.. కాస్త హోష్‌లోకి రండి. ఆయేషా ట్రీట్ ఇస్తున్నానని చెప్పిందా? ఆమె మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఏదో అపార్ట్మెంట్లో ఉంటుందని చెప్పేది కదా.. ఆమె నెంబర్ ఉందా? ట్రీట్ బయట ప్లాన్ చేశారా? ఆయేషా
వాళ్లింట్లో ప్లాన్ చేశారా.. చెప్పలేదా? నేత్ర ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లేవీ మీ దగ్గర లేవా?” ఆత్రుతగా అడిగాడు.
అంతలోనే ఏదో గుర్తుకొచ్చినవాడిలా.. “ఆంటీ! మొన్న సాయంత్రం సుమారు ఏడుగంటల సమయంలో నేత్ర ఫోన్ స్విచ్చాఫ్ చేసి చార్జింగ్‌లో పెట్టింది గుర్తుందా!? అప్పుడు ఆయేషా మీకు కాల్ చేసింది కదా! ఒకసారి మీ ఫోన్లో ఆ నెంబర్ ఉంటుంది చూడండి” అంటూ.. నిరుపమ వెర్రిదానిలా చూస్తుంటే ఆమె ఫోన్ లాక్కుని వెతకసాగాడు. “ఓహో.. ఫోన్ కూడా తీసేసుకున్నవా..!” నిస్సహాయంగా, నీరసంగా అన్నదామె. అష్రఫ్ తేరుకోకముందే డోర్ బెల్ మోగింది. నిరుపమ పరిగెత్తుకెళ్లి తలుపు తీసింది. అష్రఫ్ అమ్మానాన్నా, తమ్ముడూ వచ్చారు. “ఓహో! ఇది కూడా మీ ప్లాన్‌లో ఒక భాగమా..” వాళ్లను చూస్తూ బోరుమని ఏడుస్తూ.. వాళ్లను కూడా నిందించసాగిందామె. “అమ్మీజాన్! నేను, మా ఫ్రెండ్స్ బండ్ల మీద మహబూబ్‌నగర్‌కి వెళ్లొచ్చేసరికి నేత్ర ఇంకా ఇంటికి రాలేదని తెలిసింది. ఆంటీ భయంలో, దుఖంలో ఉన్నారు. ఆమె మాటలు పట్టించుకోవద్దు. ఆమెకి సాయంగా కూర్చోండి చాలు” అన్నాడు. వాళ్లు నిరుపమతో మాట్లాడుతుండగా ఆమె ఫోన్లో నేత్ర ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లేమన్నా దొరుకుతాయేమోనని వెతకసాగాడు. ఈ అర్ధరాత్రి ఆ నెంబర్లల్లో ఎవరికి కాల్ చేస్తే ఏమంటారో అని ఆందోళనగానే ఒకటి రెండు నెంబర్లకు కాల్ చేసి చూశాడు. అవేవీ నేత్ర స్నేహితుల నెంబర్లు కావు. ఇక వాట్సప్ మెసేజ్‌లు చూస్తుండగా.. ‘అమ్మా.. మౌనిక భలే రాసింది చూడు..’ అంటూ, నిరుపమకి నేత్ర ఫార్వర్డ్ చేసిన కవితను చూశాడు.. జూమ్ చేసి చూస్తే… ఆ కవిత కింద మౌనిక పేరుతోపాటు ఫోన్ నెంబర్ కనిపించి అతని కళ్లు మెరిశాయి. వెంటనే ఆ నెంబర్ యాడ్ చేసుకున్నాడు. లక్కీగా ‘మౌనిక అవైలబుల్’ అని కనిపించింది. ఆమెకి
నిరుపమ మెసేజ్ చేస్తున్నట్టుగా.. ‘నేత్ర ఇంకా ఇంటికి రాలేదమ్మా.. నీకేమన్నా తెలుసా?’ అని మెసేజ్ చేశాడు. ‘అయ్యో.. అదేంటి ఆంటీ! అందరం ఆయేషా వాళ్లింటికి డిన్నర్‌కి వెళ్లాం.. ఫుడ్ రావడం లేట్ అయ్యింది. పాపకి బాగోలేదని నేను వచ్చేశాను ఆంటీ. నేత్ర ఇంకా రాకపోవడం ఏమిటి’
‘డిన్నర్‌కి ఎవరెవరు వచ్చారు?’ ‘నేనూ, నేత్రా తప్ప కొత్తగా ఎవరూ రాలేదు. సరిత, ఆయేషా రూమ్మేట్స్’ ‘సరే! సరితా, ఆయేషా వాళ్ల నెంబర్లు షేర్ చెయ్యి. అలాగే ఆయేషా వాళ్లింటి లోకేషన్ పెట్టమ్మా..!’ అలా అందిన మెసేజ్‌లు చూసుకుంటూ.. “ఆరీఫ్! నువ్వు ఆంటీ చేస్తున్నట్టుగా నేత్రా వాళ్ల ఫ్రెండ్స్‌కి మెసేజ్‌లు చేస్తూ వీలైనంత సమాచారం రాబట్టి నాకు ఫార్వర్డ్ చేస్తూండు” అని చెప్పి.. అష్రఫ్ బండి తీసుకొని బయల్దేరాడు. అరగంటలో అమీర్‌పేటలోని ఆయేషా వాళ్ల రూమ్‌కి చేరాడు. ఆడపిల్లలుండే పోర్షన్లోకి అర్ధరాత్రిపూట తాను వెళ్లలేక వాచ్‌మెన్‌ని లేపాడు. “సార్! రాత్రి ఆయేషమ్మ వాళ్లందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. నేత్రమ్మ ‘నా ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. జర మా అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పు!’ అన్నరు సార్. నేనేమో నెంబర్ తప్పు రాసుకుని.. ఫోన్ చేయలేకపోయిన సార్. అందరూ ఎమ్మట్నే వసుధా హాస్పిటల్‌కి పోయిండ్రు సార్” అని చెప్పాడు వాచ్మెన్. మరో అరగంటలో బండి వసుధా హాస్పిటల్‌కి చేరుకున్నది.
“ఇలా అర్ధాంతరంగా ఎవరికన్నా ఏమన్నా అయితే వాళ్ల ఇళ్లకు ఫోన్లు చేసి చెప్పరా..?” ఎమర్జెన్సీ వార్డుకి దారి చూపుతున్న రిసెప్షనిస్ట్ మీద అరిచాడు అష్రఫ్ ఇలాంటి కేసులకూ, మాటలకూ అలవాటు పడ్డట్టుగా.. “చెప్పొచ్చు సార్.. ఒకరి ఫోన్ స్విచ్డ్ ఆఫ్, రెండు ఫోన్లకి నెంబర్ లాక్! ఇక ఎవరికి ఎలా చెప్పాలి సర్?” అంటూ, మంచాలపై సోలిపోయి ఉన్న ముగ్గురు మిత్రులను చూపించింది ఆమె. “ముగ్గురూ బాగా వాంతులు చేసుకున్నారు సర్. ఇప్పటిదాకా స్లైన్లు నడిచాయి. ఇప్పుడే నిద్రలోకి జారుకున్నారు. వాళ్లకోసం ఎవరన్నా వస్తారేమో.. ఇళ్ల దగ్గర ఎంత కంగారు పడుతున్నారోనని ఎదురు చూస్తున్నాను సర్” వాళ్లను కనిపెట్టుకుని కూర్చున్న నర్స్ దేవతలా కనిపించింది. వాళ్లతో పాటు మంచంపై స్పృహ లేనట్టుగా పడి ఉన్న నేత్రను చూడగానే.. మోకాళ్ల మీద కూలబడి పోయి.. “యా అల్లాహ్!” అని తలుచుకున్నాడు. అప్పటికి ఉదయం మూడున్నర అవుతోంది. వెళ్లి డ్యూటీ డాక్టర్ని కలిశాడు. “నౌ దే ఆర్ ఓకే. మెడిసిన్ ప్రభావంతో మత్తుగా పడుకున్నారు. రేపు ఉదయం డిశ్చార్జ్
చేసేస్తాం” అన్నారాయన.
అందులో మిగతా ఇద్దరూ ఒకే పోర్షన్లో ఉంటారు కాబట్టి వాళ్ల తల్లిదండ్రులకు ఇప్పుడే చెప్పి కంగారు పెట్టనక్కరలేదు అనుకున్నాడు. నిరుపమకి కాల్ చేసాడు.. “ఆంటీ! మీరేం కంగారు పడకండి. డిశ్చార్జ్ చెయ్యగానే అందరినీ ఇంటికి తీసుకొచ్చేస్తాను” అని చెప్పాడు. విషయం మొత్తం వినగానే సంతోషంతో పెద్దగా ఏడ్చేసింది నిరుపమ. అరగంటలో తలారా స్నానంచేసి, దేవుని ముందు గంట వాయించేసింది. ఎనిమిదింటికల్లా క్యాబ్ దిగగానే, ఎదురొచ్చిన తల్లిని పెనవేసుకుంది నేత్ర.. ఆయేషా, సరిత వెంట రాగా.. అష్రఫ్, నేత్రల భుజాలపై చేతులు వేసి లోనికి నడిపించుకు వచ్చిన నిరుపమతో… అలుకగా ఏదో అనబోయాడు అష్రఫ్. “హుష్..” అంటూ, ఎదురుగా ఆమె పరిచిన జంఖానాపై నమాజు చేసుకుంటున్న అష్రఫ్ తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపింది.
– సమ్మెట ఉమాదేవి, 98494 06722
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

