అత్యధిక ‘గ్రాండ్’ టైటిళ్ల రికార్డుపై జొకోవిచ్ గురి.. బరిలో ఫెదరర్, ముర్రే, సెరెనా
లండన్: టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. లండన్ వేదికగా ఈ పచ్చిక కోర్టు మహా సంగ్రామం సోమవారం ప్రారంభం కానుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి గతేడాది కరోనా కారణంగా ఈ టోర్నీ రద్దు కాగా.. రెండేండ్ల తర్వాత మళ్లీ అభిమానులను అలరించనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలిచి అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంప్ నొవాక్ జొకోవిచ్ గ్రాండ్ రికార్డుపై కన్నేశాడు. వింబుల్డన్‌లో ఆరోసారి విజేతగా నిలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డు(20) తో ఉన్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. అలాగే ఓ క్యాలెండర్ సంవత్సరంలో ఉన్న నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మూడో ఆటగాడిగా నిలిచేందుకు బాటలు వేసుకోవాలని భావిస్తున్నాడు. టెన్నిస్ చరిత్రలో ఇంత వరకు డాన్ బుడ్జ్ (1937), రోడ్ లావెర్ (1962, 1969) మాత్రమే ఈ ఘనత సాధించారు. మరోవైపు తనకు అచ్చొచ్చిన కోర్టులో సత్తాచాటి పునర్వైభవాన్ని చాటాలని 8సార్లు వింబుల్డన్ విజేత ఫెదరర్ భావిస్తున్నాడు. రెండో ర్యాంకర్ రఫేల్ నాదల్ టోర్నీకి దూరం కాగా.. యువ స్టార్లు డానిల్ మెద్వెదెవ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్టెఫనోస్ సిట్సిపాస్, అలెగ్జాండర్ జ్వెరెవ్ సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నారు. కాగా సోమవారం టాప్‌సీడ్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో జాక్ డ్రాపెర్ (బ్రిటన్)తో తలపడనున్నాడు.
స్టార్లు మెరుస్తారా..!
ఫ్రెంచ్ ఓపెన్‌లో గంపగుత్తగా నిరాశపరిచిన మహిళా స్టార్లు వింబుల్డన్‌లో మెరువాలని పట్టుదలగా ఉన్నారు. మార్గరెట్ కోర్టు పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డు (24)ను సమం చేయాలని నాలుగేండ్లుగా ప్రయత్నిస్తున్న అమెరికా దిగ్గజం సెరీనా విలియమ్స్ ఈసారైనా కల నెరవేర్చుకోవాలనుకుంటున్నది. ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకొని సత్తాచాటాలనుకుంటున్నది. మట్టికోర్టులో విఫలమైన టాప్‌సీడ్ ఆష్లే బార్టీ, సబలంక, సోఫియా కెనిన్, ప్లిస్కోవా, స్వియాటెక్ పుంజుకోవాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఒలింపిక్స్ ఆడను: సెరెనా
టోక్యో ఒలింపిక్స్ నుంచి అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తప్పుకుంది. వింబుల్డన్ మెయిన్ డ్రాకు ముందు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సెరెనా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే విశ్వక్రీడల నుంచి వైదొలిగేందుకు కారణాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. విలియమ్స్ ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలుచుకుంది.