హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
కరీబియన్ పవర్ హిట్టర్లు మరోసారి తమ ఖలేజా చూపెట్టారు. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ షై హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 నాటౌట్) శతక విజృంభణకు తోడు ఫ్లాట్ వికెట్‌పై కీమో పాల్ (5/41) ఐదు వికెట్లతో పంజా విసరడంతో బుధవారం జరిగిన నాలుగో టీ20లో విండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
- శాంసన్, తిలక్, నితీశ్ మెరుపులు వృథా
- శతక్కొట్టిన కెప్టెన్ హోప్
- 5 వికెట్లతో కీమో పాల్ దెబ్బ
రెండేండ్ల తర్వాత హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిమానులు కోరుకున్నట్టే పరుగుల మోత మోగింది. ఉప్పల్ స్టేడియం కొత్త పిచ్‌పై అటు వెస్టిండీస్.. ఇటు భారత బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టారు. కానీ, ఈ బాదుడులో కరీబియన్ జట్టే బాద్షా అయింది. పేలవ బౌలింగ్‌తో ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్న తర్వాత టీమిండియా బ్యాటు వీరులు కరీబియన్ల హిట్టింగ్ పవర్‌ను మ్యాచ్ చేయలేకపోయారు. ఓపెనర్ శాంసన్, తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి పోరాడినా.. కొండంత లక్ష్యాన్ని అందుకోలేక హైదరాబాద్ గడ్డపై భారత్ తొలిసారి బోల్తా కొటింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : కరీబియన్ పవర్ హిట్టర్లు మరోసారి తమ ఖలేజా చూపెట్టారు. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ షై హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 నాటౌట్) శతక విజృంభణకు తోడు ఫ్లాట్ వికెట్‌పై కీమో పాల్ (5/41) ఐదు వికెట్లతో పంజా విసరడంతో బుధవారం జరిగిన నాలుగో టీ20లో విండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ హై స్కోరింగ్ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 247/3 స్కోరు చేసింది. షెర్పేన్ రూథర్‌ఫర్డ్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ ( 0/52), అర్ష్‌దీప్ సింగ్ (1/52) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ ఛేదనలో టీమిండియా 19.3 ఓవర్లలో 223 రన్స్‌కే ఆలౌటైంది.సంజూ శాంసన్ (23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56), తిలక్ వర్మ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), నితీశ్ రెడ్డి (20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 41) పోరాడినా ఓటమి తప్పలేదు. పాల్‌తో పాటు గుడకేశ్ మోతీ (2/13) రెండు వికెట్లు తీశాడు. హోప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరీస్ విన్నర్‌ను తేల్చే చివరి, ఐదో టీ20 శనివారం బెంగళూరులో జరగనుంఇ.
శాంసన్ ఫటాఫట్
కొండంత లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ మెరుపు ఆరంభం అందించాడు. తొలి నాలుగు ఓవర్లలో 22 బంతులను అతనే ఎదుర్కొని మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. ఇన్నింగ్స్ తొలి బాల్నే బౌండరీకి చేర్చిన శాంసన్.. షమార్ జోసెఫ్ వేసిన రెండో ఓవర్లో వరుసగా 4,6,6 బాదాడు. ఆపై ఛేజ్ బౌలింగ్‌లో 4,6, 6,4తో ఏకంగా 25 పరుగులు రాబట్టడంతో మూడు ఓవర్లకే స్కోరు 50 దాటింది. షెఫర్డ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన కీమో పాల్ తొలి బంతికి శాంసన్, నాలుగో బంతికి ఇషాన్ (6)ను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు. సంజూ క్రీజులో ఉన్నంతవరకు మూడు బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ (29) ఆ తర్వాత తనదైన శైలిలో ఆడలేపోయాడు. నాలుగో నంబర్లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) రెండు ఫోర్లు కొట్టి స్ప్రింగర్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఆండ్రూకు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. అదే ఓవర్లో అభి తన తొలి సిక్స్ కొట్టగా.. అభిమానుల కేరింతల నడుమ క్రీజులోకి వచ్చిన లోకల్ బాయ్ తిలక్ వర్మ.. షెఫర్డ్ బౌలింగ్‌లో 4,6 బాదడంతో 11 ఓవర్లకు 126/3తో భారత్ బలమైన స్థితిలో నిలిచింది. కానీ, స్పిన్నర్ మోతీ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతికి భారీ షాట్ ఆడిన అభిషేక్ లాంగాఫ్‌లో స్ప్రింగర్‌కు క్యాచ్ ఇవ్వగా.. తర్వాతి బాల్కే నమన్ ధీర్ (0) స్టంపౌటవడంతో భారత్ 135/5తో డీలా పడింది.

తిలక్, నితీశ్ పోరాడినా..
చివరి 48 బంతుల్లో 116 పరుగులు అవసరం అయిన దశలో భారత్‌ను ముందుకుతీసుకెళ్లే బాధ్యత ఇద్దరు తెలుగు ఆటగాైళ్లెన తిలక్, నితీశ్ రెడ్డిపై పడింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టే కీలక సమయంలో ఈ ఇద్దరూ భారీ షాట్లతో విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పాల్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో తిలక్ సిక్స్ కొడితే.. స్ప్రింగర్ ఓవర్లో నితీశ్ లాంగాఫ్ మీదుగా బంతిని స్టాండ్స్‌కు చేర్చాడు. అదే జోరులో షమార్ వేసిన 16వ ఓవర్లో నితీశ్ ఓ ఫోర్, వరుసగా రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆపై, షెఫర్డ్ వేసిన లో ఫుల్ టాస్‌ను తిలక్ అద్భుతమైన షాట్‌తో లాంగాన్ మీదుగా సిక్స్‌గా మార్చి ఔరా అనిపించాడు. విజయ సమీకరణం 23 బంతుల్లో 53 పరుగులగా మారగా.. తెలుగు క్రికెటర్ల జోరు చూస్తుంటే భారత్ మ్యాచ్ నెగ్గేలా కనిపించింది. కానీ, అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు యత్నించి తిలక్.. క్యాచ్ ఔట్ అవడం భారత్‌ను దెబ్బతీసింది. ఆరో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసిన తర్వాత చివర్లో విండీస్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. 18వ ఓవర్లో స్ప్రింగర్ ఐదే రన్స్ ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో నితీశ్, ప్రిన్స్ (0), అక్షర్ (3)ను పెవిలియన్ చేర్చిన కీమో పాల్‌ను విండీస్ విజయం ఖాయం చేశాడు. షమార్ వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతి తర్వాతి అర్ష్‌దీప్ (5) భుజం నొప్పితో రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో భారత పోరాటం ముగిసింది.
హోప్ వీరవిహారం..
కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ షై హోప్ భారత పర్యటనలో నాలుగోసారి శతక మోత మోగించడంతో ఈ పోరులో కరీబియన్ టీమ్ భారీ స్కోరు సాధించింది. ఆట ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లు భారత్‌పై ఎదురుదాడికి దిగారు. ఆతిథ్య బౌలర్లు కట్టుతప్పడంతో పాటు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా కరీబియన్లకు కలిసొచ్చాయి. అర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ జెవెల్ ఆండ్రూ (21) 6,4,4తో 17 రన్స్ రాబట్టాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో 6,4తో టచ్‌లోకి వచ్చిన హోప్.. నాలుగో ఓవర్లో ప్రిన్స్ యాదవ్‌కు 6,4తో స్వాగతం పలికాడు. దాంతో కెప్టెన్ అయ్యర్ ఐదో ఓవర్లోనే స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను బరిలోకి దింపాడు. తన రెండో బంతికే ఆండ్రూను ఎల్బీ చేసిన అక్షర్ నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాడు. కానీ, హోప్‌కు తోడైన షిమ్రన్ హెట్మయర్ (33) కూడా భారీ షాట్లతో విరుచుకుపడటంతో పవర్‌ప్లేను 79/1తో ముగించిన విండీస్ స్కోరు 7.4 ఓవర్లలోనే వంద దాటింది. తొమ్మిదో ఓవర్లో హెట్మయర్ను ఔట్ చేసి ప్రిన్స్ యాదవ్ బ్రేక్ ఇచ్చినా.. రోవ్‌మన్ పావెల్ (24) తోడుగా ముందుకెళ్లిన హోప్ 28 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అక్షర్ వేసిన 12వ ఓవర్లో పావెల్, హోప్ చెరో ఫోర్, సిక్స్ బాదడంతో 22 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్లోనే కీపర్ క్యాచ్‌తో పావెల్‌ను అర్ష్‌దీప్ వెనక్కుపంపినా హోప్ మాత్రం తన ధాటిని కొనసాగించాడు. స్లాగ్ ఓవర్లలో అతనికి తోడైన రూథర్‌ఫర్డ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ వేసిన 17వ ఓవర్లో 6,4,6 కొట్టి స్కోరు 200 దాటించాడు. ఇంకోఎండ్లో జోరు కొనసాగించిన హోప్..నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టి ఈ సిరీస్‌లో రెడో శతకం పూర్తి చేసుకోవడంతో పాటు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. హోప్, రూథర్‌ఫర్డ్ ద్వయం నాలుగో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించింది.

హైదరాబాద్‌లో రెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. 35,817 మంది ఫ్యాన్స్‌తో ఉప్పల్ స్టేడియం కిక్కిరిపోయింది. టీమిండియా బ్లూ జెర్సీలతో నీలి సముద్రాన్ని తలపించింది. మ్యాచ్‌లో భారత్ ఓడినా.. ఇరు జట్ల పవర్ హిట్టింగ్‌ను ఫ్యాన్స్ ఆస్వాదించారు.
1/4 హైదరాబాద్‌లో ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
3 టీ20ల్లో షై హోప్ మూడో సెంచరీ సాధించి ఈ ఫార్మాట్లో విండీస్ తరఫున అత్యధిక శతకాలు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ (చెరో 2) రికార్డును బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 20 ఓవర్లలో 247/3 (హోప్ 102 నాటౌట్; రూథర్‌ఫర్డ్ 49 నాటౌట్, ప్రిన్స్ యాదవ్ 1/36);
భారత్: 19.3 ఓవర్లలో 223 ఆలౌట్ (శాంసన్ 56, తిలక్ 43, నితీశ్ 41, కీమో పాల్ 5/41).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

