Australia Open 2024: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొంటున్న ఉక్రెయిన్ టెన్నిస్ క్రీడాకారులు ఆట, క్రీడా స్ఫూర్తి కంటే తమకు దేశమే ఎక్కువని మరోసారి చాటిచెబుతున్నారు. రష్యా, బెలారస్ క్రీడాకారులతో ఆడే మ్యాచ్‌లలో గెలిచినా ఓడినా మ్యాచ్ ముగిశాక వారికి కనీసం ‘కరచాలనం’ (హ్యాండ్‌షేక్) కూడా ఇవ్వడం లేదు. మెల్బోర్న్లో శుక్రవారం.. మహిళల సింగిల్స్‌లో భాగంగా మూడో రౌండ్ మ్యాచ్‌లలో టాప్ సీడ్ అరీనా సబలెంకతో తలపడిన ఉక్రెయిన్ ప్లేయర్ లెసియా సురెంకొ.. ఆట ముగిశాక ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కనీసం నెట్ దగ్గరకు కూడా రాకుండా ఆమె సబలెంక నుంచి దూరం జరుగుతూ కనిపించింది.
ఇక మరో మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కే చెందిన మార్టా కోస్టిక్.. మూడో రౌండ్లో రష్యన్ ప్లేయర్ ఎలీనా అవనేశ్యన్ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఆట ముగిశాక మార్టా సైతం.. ఎలీనాతో హ్యాండ్ షేక్‌కు ‘నో’ చెప్పింది. సబలెంకతో మ్యాచ్ ఓడాక లెసియా మాట్లాడుతూ… ‘నా దేశంలో ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. దానిని నేను ఈ ప్రపంచానికి మరోసారి తెలియజేయాలనుకున్నాను. నేను ఇది పూర్తిగా ఉక్రెయిన్ కోసమే చేశాను. నేను చేసింది సరైనదే అని అనుకుంటున్నాను..’ అని తెలిపింది.
Lesia Tsurenko – Aryna
Sabalenka 0-6 / 0-6.Highlights #AusOpen pic.twitter.com/4kofEBJnPt
— Aryna Sabalenka Fan Page (@ArynaSabaIenka) January 19, 2024
రష్యా – ఉక్రెయిన్ మధ్య 2022 పిబ్రవరి నుంచి యుద్ధవాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 24న రష్యా.. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి తన సేనలను ఉసిగొల్పింది. ఈ యుద్ధం ద్వారా ఇరు దేశాల నుంచి వేలాది మంది సైనికులు, అమాయక ప్రజలు మరణించారని నివేదికలు వెల్లడవుతున్నాయి. సుమారు రెండేండ్లుగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పటికీ సాగుతూనే ఉంది. యుద్ధం మొదలైనప్పట్నుంచే ఉక్రెయిన్ క్రీడాకారులు.. రష్యాతో ఆడే క్రీడల్లో తమ నిరసనను ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.
It’s a one-set showdown ☝️@marta_kostyuk evens things up with Avanesyan at 2-6 6-4.#AusOpen • #AO2024 pic.twitter.com/FpmH8zPvoI
— #AusOpen (@AustralianOpen) January 19, 2024