న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టెన్నిస్ అభిమానులు ఆశించిన హై-వోల్టేజ్ ఫైనల్ సమరం ఖరారైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న అరీనా సబలెంకా, ఎలెనా రిబాకినా టైటిల్ కోసం అమీతుమీకి సిద్ధమయ్యారు. మెగా టోర్నీలో అంచనాలను అందుకున్న ఈ ఇద్దరూ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గురువారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 7-5, 6-2తో అమెరికా అమ్మాయి, మూడో సీడ్ జెసికా పెగులాపై వరుస సెట్లలో అలవోకగా విజయం సాధించింది.
80 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తన పవర్ హిట్టింగ్, ఖతర్నాక్ షాట్లతో చెలరేగిన సబలెంకా, వరుసగా నాలుగో ఏడాదీ యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో గత రెండేండ్లుగా ఓటమి ఎరుగని సబలెంకా అజేయ రికార్డు 19 మ్యాచ్‌లకు పెంచుకుంది. మరో సెమీస్‌లో రెండో సీడ్ రిబాకినా (కజకిస్థాన్) 3-6, 6-4, 6-4తో లోకల్ ఫేవరెట్, నాలుగో సీడ్ కోకో గాఫ్‌ను ఓడించి తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరింది. శనివారం ఆమెతో జరిగే తుది పోరులో సబలెంకా గెలిస్తే, 2012-2014 మధ్య సెరెనా విలియమ్స్ సాధించిన తర్వాత వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ నెగ్గిన తొలి మహిళగా నిలుస్తుంది.
ఈ టోర్నీలో గత రెండు సీజన్లలోనూ పెగులాను ఓడించిన సబలెంకా ముచ్చటగా మూడోసారి ఆమెపై పైచేయి సాధించింది. పలువురు ప్రముఖులతో కిక్కిరిసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో అరీనా అద్భుత ప్రదర్శన చేసింది. 43 నిమిషాల పాటు సాగిన తొలి సెట్లో పెగులా గట్టి పోటీ ఇచ్చింది. నాలుగో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్ షాట్‌తో బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్న పెగులా 4-4 వద్ద కూడా సబలెంకాకు సవాల్ విసిరింది. అయినా తనదైన పవర్ఫుల్ సర్వీస్‌లతో విజృంభించిన టాప్ సీడ్ 6-5 ఆధిక్యంలో ఉన్న సమయంలో మరింత జోరు పెంచింది.ట్రిపుల్ బ్రేక్ పాయింట్ సాధించింది. రెండో సెట్ పాయింట్లో సెట్ సొంతం చేసుకొని ఆధిక్యం అందుకుంది.
ఇక, రెండో సెట్లో సబలెంకా విశ్వరూపం ప్రదర్శించింది. పెగులా సెకండ్ సర్వ్‌లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. పెగులా పవర్ఫుల్ సెకండ్ సర్వ్‌ను అంతకుమించిన వేగంతో ఫోర్‌హ్యాండ్ విన్నర్‌గా మలిచి 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ మొత్తంలో పెగులా సెకండ్ సర్వ్‌లో 19 పాయింట్లకు గాను 14 పాయింట్లను సబలెంకానే గెలుచుకోవడం గమనార్హం. పెగులాకు కోర్ట్ ఏ మూల నుంచి కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో సబలెంకా ఏకంగా 29 విన్నర్లు, 7 ఏస్‌లతో చెలరేగింది. పెగులా 12 విన్నర్లకే పరిమితమైంది.
రెండో సెమీస్‌లో లోకల్ ఫేవరెట్ కోకో గాఫ్ నుంచి రిబాకినాకు కఠిన సవాల్ ఎదురైంది. ఆట ఆరంభంలో గాఫ్ ఆధిపత్యం చెలాయించింది. బలమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడుతూ తొలి సెట్‌ను 38 నిమిషాల్లో కైవసం చేసుకుంది. అయితే రెండో సెట్ నుంచి కజకిస్థాన్ అమ్మాయి తన ఆటతీరును పూర్తిగా మార్చేసింది. బేస్‌లైన్ నుంచి ఆడటంతో పాటు నెట్ వద్దకు వచ్చి పాయింట్లు సాధించడం ప్రారంభించింది. రెండో సెట్లో 4-1 ఆధిక్యంలో ఉన్న సమయంలో గాఫ్ పుంజుకుని 4-4తో సమయం చేసినప్పటికీ రిబాకినా వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్లో ఇద్దరు ప్రతీ పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. 4-3 వద్ద గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా 5-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గాఫ్ బ్రేక్ పాయింట్ సాధించి 5-4తో రేసులోకి వచ్చే ప్రయచత్నం చేసింది. కానీ, పదో గేమ్‌లో రిబాకినా సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.