ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో హోరాహోరీ సమరాలకు రంగం సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్లలో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్న బ్రెజిల్, గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను క్వార్టర్స్‌లో ఎదుర్కొబోతున్నది. ప్రిక్వార్టర్స్‌లో కొరియాను చిత్తు చేసిన సాంబా టీమ్.. అదే జోరులో క్రొయేషియాను ఎదుర్కొనేందుకు సమరోత్సాహంతో ఉంది. నెయ్మర్ పూర్తి స్థాయిలో కోలుకోవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా, క్రొయేషియాకు మోడ్రిచ్ కీలకం కానున్నాడు. మొత్తంగా రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్స్ పోరుకు సమయం ఆసన్నమైంది. గెలిచిన జట్టు టైటిల్ వేటలో ముందంజ వేస్తే..ఓడినవాళ్లు నిరాశగా ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే పలు అగ్రశ్రేణి జట్లు జర్మనీ, బెల్జియం, ఉరుగ్వే నిష్క్రమించగా, తొలి క్వార్టర్స్‌లో బ్రెజిల్, క్రొయేషియా మధ్య శుక్రవారం పోరు జరుగనుంది. ర్యాంకింగ్స్ పరంగా బ్రెజిల్ టాప్‌లో కొనసాగుతుంటే..క్రొయేషియా 12వ ర్యాంక్‌లో ఉంది. గత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌కు టైటిల్ చేజార్చుకున్న లుకా మోడ్రిచ్ నేతృత్వంలోని క్రొయేషియా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఉంది. ప్రిక్వార్టర్స్‌లో జపాన్ను షూటౌట్ చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న క్రొయేషియన్లు సాంబా జట్టును ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డే అవకాశముంది. తమదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించడంలో ముందుండే క్రొయేషియా ఈ సారి అద్భుతం చేసేందుకు పావులు కదుపుతున్నది. గత తొమ్మిది నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏడుసార్లు విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. క్రొయేషియాను ఎదుర్కొనేందుకు మేము పూర్తి స్థాయి లో శ్రమించాల్సిందేనని బ్రెజిల్ కోచ్ టీటే స్పష్టం చేశాడు. జపాన్‌తో ప్రిక్వార్టర్స్ పోరులో క్రొయేషియా గోల్‌కీపర్ డొమినిక్ లివాకోవిచ్ హీరోగా నిలిచాడు.
టైటిల్ ఫైట్‌లో నిలిచే వరకు తమ గోల్ సంబురాలు కొనసాగుతాయని బ్రెజిల్ జట్టు స్పష్టం చేసింది. మెగాటోర్నీకి ముందే సన్నద్ధమై వచ్చిన సాంబా జట్టు గోల్ చేసిన ప్రతీ సారి వైవిధ్యమైన డ్యాన్స్‌లతో అభిమానులను అలరిస్తున్నది. ఈ క్రమంలో ఓవైపు విమర్శలు వస్తున్నా.. పట్టించుకోకుండా తమ దేశ సంస్కృతి, సంప్రదాయాల్లో డ్యాన్స్ భాగమని బ్రెజిల్ ప్లేయర్లు కుండబద్దలు కొడుతున్నారు. గాయం నుంచి తేరుకున్న నెయ్మర్ కొరియాతో మ్యాచ్‌లో అదరగొట్టడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది.
క్రొయేషియా X బ్రెజిల్ రాత్రి 8.30
అర్జెంటీనా X నెదర్లాండ్స్ అర్ధరాత్రి 12.30