న్యూయార్క్: ఫుట్‌బాల్ ప్రపంచకప్ వస్తుందనగానే మైదానంలో ఆటగాళ్ల విన్యాసాలతో పాటు కొలంబియా పాప్ సింగర్ షకీరా పాటలు గుర్తొస్తాయి. 2010లో వాకా వాకా పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన షకీరా 16 ఏళ్ల తర్వాత మరోసారి ఫిఫా వరల్డ్ కప్ అధికారిక పాటతో అభిమానులను అలరించనుంది. అమెరికా, మెక్సికో, కెనడా వేదికలుగా జూన్ 11 నుంచి జరిగే మెగా టోర్నీ కోసం ఆమె రూపొందించిన అధికారిక గీతం ‘దయ్ దయ్’ టీజర్ శుక్రవారం విడుదలైంది.
ఈ పాట కోసం నైజీరియన్ స్టార్ బర్నా బాయ్‌తో షకీరా జతకట్టింది. బ్రెజిల్‌లోని ప్రసిద్ధ మారకానా స్టేడియంలో చిత్రీకరించిన ఈ టీజర్లో షకీరా తనదైన శైలి స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ పాట పూర్తి వెర్షన్ ఈనెల 14న విడుదల కానుంది. గతంలో 2006, 2010, 2014 ప్రపంచ కప్ టోర్నీల్లో తన ప్రదర్శనలతో మెప్పించిన షకీరా ఈసారి ‘దయ్ దయ్’ పాటతో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. దయ్ అనేది ఇటాలియన్ పదం. దీనికి ప్రయత్నించు, ముందుకు సాగు అనే అర్థం వస్తుంది.