లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు మళ్లీ చుక్కెదురైంది. సరిగ్గా ఏడాది తర్వాత వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెరెనాకు ఆదిలోనే అనూహ్య షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్తో పోటీకి దిగిన సెరెనా..అనామక ఫ్రాన్స్ ప్లేయర్ చేతిలో కంగుతిన్నది. మూడు గంటల పాటు జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ పోరులో సెరెనా 5-7, 6-1, 6-7(7/10)తో హర్మోనీ టాన్‌పై ఓటమి చవిచూసింది.
ఈసారైనా మార్గరేట్ కోర్ట్(ఆస్ట్రేలియా) అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీ(24) రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలపై టాన్ నీళ్లు గుమ్మరించింది. అరంగేట్రం వింబుల్డన్ టోర్నీలోనే దిగ్గజ ప్లేయర్ విలియమ్స్‌కు షాక్ ఇచ్చి ఔరా అనిపించుకుంది. మ్యాచ్ విషయానికొస్తే తొలి సెట్‌ను 5-7తో ప్రత్యర్థికి చేజార్చుకున్న సెరెనా రెండో సెట్లో అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చింది. నిర్ణయాత్మక మూడో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇందులో తొలుత 4-0తో సెరెనా ఆధిక్యం కనబరిచినా…టాన్ వరుసగా ఐదు పాయింట్లతో మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకుంది. మొత్తంగా సెరెనా టైటిల్ ఆశలను చెరిపేస్తూ టాన్ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ జొకోవిచ్ 6-1, 6-4, 6-2తో కొకినాకిస్(ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ కాస్పర్ రడ్ రెండో రౌండ్లోనే వైదొలిగాడు.