షెన్జెన్ (చైనా): భారత బ్యాడ్మింటన్ ‘డబుల్లెట్స్’ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి మరో అరుదైన ఘనత అందుకున్నారు. మన దేశ డబుల్స్ షట్లర్లకు అందని ద్రాక్షగా ఉన్న బీడబ్ల్యూఎఫ్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మెగా టోర్నీ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన భారత తొలి జోడీగా రికార్డు సృష్టించారు.
ఆదివారం హోరాహోరీగా సాగిన తుదిపోరులో ప్రపంచ 5వ ర్యాంక్ ద్వయం సాత్విక్ – చిరాగ్ 11-21, 21-13, 21-17తో చైనాకు చెందిన హే జి టింగ్-రెన్ జియాంగ్ యుపై అద్భుత విజయం సాధించింది. గంటా 10 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకొని గెలిచింది. 2023, 2025లోనూ ఫైనల్ చేరినా అందుకోలేకపోయిన చైనా టైటిల్‌ను మూడో ప్రయత్నంలో సగర్వంగా ఒడిసిపట్టుకుంది. ఈ విజయంతో చైనా జంటపై తమ ముఖాముఖి రికార్డును 3-0కు పెంచుకుంది.
ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌కు మంచి ఆరంభం లభించలేదు. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో బరిలోకి దిగిన చైనా జోడీ టింగ్-జియాంగ్ పవర్ఫుల్ స్మాష్‌లతో చెలరేగి 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత ద్వయం పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, చైనా షట్లర్లు నెట్ వద్ద ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి విరామానికి 11-5తో నిలిచారు. అదే జోరును కొనసాగిస్తూ 18 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఫస్ట్ గేమ్‌లో ఓడినా సాత్విక్-చిరాగ్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడి పుంజుకున్నారు.
ఆరంభంలో 2-0తో వెనుకబడినా వెంటనే 3-3 వద్ద స్కోరు సమం చేశారు. ఆ తర్వాత చిరాగ్ పవర్ఫుల్ స్మాష్‌లతో విజృంభించి విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. బ్రేక్ తర్వాత భారత ద్వయం మరింత దూకుడు పెంచి వరుస పాయింట్లు అందుకుంటూ మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక గేమ్ ఉత్కంఠగా సాగింది. చైనా జంట 4-0తో ఆరంభించినా సాత్విక్-చిరాగ్ తగ్గేదేలే అంటూ పోరాడి 7-7తో స్కోరు సమం చేశారు. ఆ తర్వాత 11-9తో విరామానికి వెళ్లి, అనంతరం 15-12తో ముందంజలో నిలిచారు. కానీ, చైనా జోడీ పట్టువదల్లేదు. మళ్లీ పుంజుకుని 16-16, 17-17తో ఉత్కంఠన పతాక స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఒత్తిడి క్షణాల్లో ఏకాగ్రతకోల్పోకుండా పట్టుదల ప్రదర్శించిన భారత ద్వయం వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన ప్రతిసారీ ఈ టోర్నీ మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గతంలో చేజారిన ఈ టైటిల్‌ను ఎట్టకేలకు గెలవడం చాలా ప్రత్యేకం. ఈ సారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి ఫలితం రాబట్టాం. ఈ సీజన్లో ఇది మాకు రెండో టైటిల్. ఆసియా గేమ్స్‌కు ముందు వచ్చిన ఈ విజయం మాకు కొండంత ఉత్సాహాన్నిచ్చింది. మేము సరైన దిశలోనే శ్రమిస్తున్నామని నిరూపితమైంది. భారత్‌కు తిరిగొచ్చాక 10 రోజులు ప్రాక్టీస్ చేసి ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాం. సాత్విక్-చిరాగ్