రఫెల్ నాదల్..మట్టికోట మహారాజు! ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో నాదల్‌ది ఓ ప్రత్యేక అధ్యాయం. మట్టికోర్టుపై ఆడేందుకే పుట్టాడా అన్న రీతిలో ఎవరికీ సాధ్యం కాని శైలిలో నాదల్ సాగించిన జైత్రయాత్ర మాటలకందనిది. నూనుగు మీసాల వయసు నుంచే ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలిచి ఫ్రెంచ్ ఓపెన్ రారాజుగా మన్ననలు అందుకున్న నాదల్ తన అసమాన పోరాటాన్ని ముగించాడు. గాయం నుంచి తేరుకుని బరిలోకి దిగిన ఈ స్పెయిన్ బుల్ తొలి రౌండ్లోనే అనూహ్యంగా నిష్క్రమించాడు. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో అనూహ్య ఓటమితో కోర్టు నుంచి భారంగా వైదొలిగాడు. ఆటకు వీడ్కోలు పలుకకపోయినా..పారిస్ ఒలింపిక్స్‌లో మళ్లీ కలుద్దామంటూ అభిమానుల జయజయధ్వానాల మధ్య చెమర్చిన కండ్లతో అభివాదం
Rafael Nadal | పారిస్: సుదీర్ఘ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న రఫెల్ నాదల్..తనకు బాగా అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదిలోనే పోరాటాన్ని ముగించాడు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన నాదల్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయాడు. సోమవారం కోర్ట్ ఫిలిపి చాట్రియర్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 3-6, 6-7(5-7), 3-6తో జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మకటం లేని మహారాజుగా మన్ననలు అందుకున్న నాదల్..తొలి రౌండ్లోనే వైదొలుగడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో మూడు సార్లు టైటిల్ దక్కించుకోకుండానే తన పోరాటాన్ని ముగించాడు.15వేల మంది ప్రేక్షకుల సమక్షంలో స్టేడియంలోకి ప్రవేశించిన నాదల్.. తొలిసారి టోర్నీలో 275 ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగాడు. తన సుదీర్ఘ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు కైవసం చేసుకున్న ఈ స్పెయిన్ స్టార్ 38 ఏండ్ల వయసులో గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
రఫెల్ నాదల్, జ్వెరెవ్ పోరు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. గాయం నుంచి కోలుకున్నా..జ్వెరెవ్‌కు దీటైన పోటీనివ్వడంలో విఫలమైన నాదల్ వరుస సెట్లలో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఆదిలోనే డబుల్ ఫాల్ట్స్ చేసిన నాదల్ పోరుపై పట్టు కోల్పోయాడు. మరోవైపు ఇటీవలే రోమ్ ఓపెన్ గెలిచి మంచి జోరుమీదున్న జ్వెరెవ్..కీలకమైన పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి సెట్లో రెండు బ్రేక్పాయింట్లను కాపాడుకుని 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అదే దూకుడు కనబరిచిన ఈ ప్లేయర్ మొదటి సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్లో పుంజుకుని పోటీలోకి వచ్చిన నాదల్ 4-2తో ఆధిక్యం కనబరిచినా.. జ్వెరెవ్ సెట్‌ను మలుపు తిప్పి వశం చేసుకున్నాడు. కీలకమైన మూడో సెట్లోనూ జ్వెరెవ్ 4-3తో ముందంజ వేశాడు. అయితే పట్టు వదలని నాదల్ ఎనిమిదో గేమ్‌లో రెండు బ్రేక్పాయింట్లు దక్కించుకున్నా..జ్వెరెవ్ తన అద్భుత ఆటతీరుతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు సుమిత్ నాగల్ (భారత్) తొలి రౌండ్లో 2-6, 0-6, 6-7(5-7)తో ఖచనోవ్ చేతిలో ఓడాడు.
మాట్లాడం చాలా కష్టంగా ఉంది. ఇదే చివరిదని మీ అందరి ముందు నిజాయితీగా నేను చెప్పలేకపోతున్నాను. ఇన్నేండ్ల ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. వాటిని మాటల్లో వర్ణించడం కష్టంగా అనిపిస్తున్నది. నేను బాగా అభిమానించే ప్రదేశమిది. ఈ అద్భుతమైన మ్యాచ్‌కు కారణమైన సాషాకు కృతజ్ఞతలు. గత రెండేండ్లుగా గాయాలతో సతమతమవుతున్నాను. ఇప్పటికిప్పుడే భవిష్యత్ గురించి చెప్పలేను. ఒలింపిక్స్ కోసం మళ్లీ వస్తాను, అది నన్ను ప్రేరేపిస్తుంది. రోలండ్ గారోస్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. గుండెలోతుల్లోనుంచి మీ అందరికీ కృతజ్ఞతలు. మళ్లీ కలుస్తానన్న నమ్మకముంది, కానీ నాకు తెలియదు.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : సుమారు రెండు దశాబ్దాల పాటు ఎర్రమట్టి కోర్టును ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహారాజు.. ఈ ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరగడం తీవ్రంగా నిరాశపరిచేదే అయినా గడిచిన 20 ఏండ్లలో ‘ఫ్రెంచ్ ఓపెన్ అంటే నాదల్. నాదల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్’ అన్న రీతిలో అతడి ఆధిపత్యం సాగింది. 2005లో రోలండ్ గారోస్‌లో మొదలైన ఈ స్పెయిన్ తుఫాను.. గత 15 ఏండ్లలో ఐదు సార్లు (2023లో గాయం కారణంగా తప్పుకోకుంటే 4సార్లే) మాత్రమే ఇతరుల వశమైందంటే ఇక్కడ నాదల్ జోరు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 2005 నుంచి 2008, 2010-2014, 2017-2020 మధ్య అతడి దూకుడుకు బ్రేకులు వేసిన ఆటగాళ్లే లేరు. రోజర్ ఫెదరర్, జొకోవిచ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఎంతమంది వచ్చినా పారిస్ నుంచి ఉత్తచేతులతో వెనుదిరగాల్సిందే తప్ప ఆ టైటిల్ వంక చూసే ధైర్యం కూడా చేయలేదు. అలాంటి నాదల్ లేని ఫ్రెంచ్ ఓపెన్ ప్రేక్షకులకు తొలిసారి అనుభవంలోకి వస్తోంది. మరో ఏడాది మళ్లీ వస్తాడో? లేడో? అన్న మీమాంసలో.. మట్టికోర్టు మహారాజు నిష్క్రమణ అతడి అభిమానగణానికి తీరని శోకాన్ని మిగిల్చేదే.
5 2010 నుంచి 2014 దాకా వరుసగా ఐదు సార్లూ ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు.
5 పురుషుల టెన్నిస్ ఓపెన్ ఎరా చరిత్రలో 20 అత్యుత్తమ గ్రాండ్స్లామ్విజయాల్లో ఐదు నాదల్ సాధించినవే కావడం విశేషం.
14 ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఏకంగా 14 టైటిళ్లు (ఫ్రెంచ్ ఓపెన్) లిచిన ఏకైక టెన్నిస్ ప్లేయర్
112-4 రోలండ్ గారోస్‌లో 116 మ్యాచ్‌లు ఆడితే నాదల్ ఓడిపోయినవి 4 మ్యాచ్‌లే. టెన్నిస్ మేజర్ టోర్నీలో ఒక సింగిల్స్ ప్లేయర్‌కు విజయాల శాతం పరంగా ఇదే అత్యుత్తమం. 2009లో రొబిన్ సొదర్లింగ్, 2017, 2020లో జొకోవిచ్, తాజాగా జ్వెరెవ్ (మొత్తంగా ముగ్గురే) మాత్రమే రఫెల్‌ను ఓడించారు.