ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. ఫార్ములా-1కు పూర్తి భిన్నంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలతో రేసింగ్‌కు రూపకల్పన జరిగింది. వాతావరణానికి హాని కల్గించే కర్బన ఉద్గారాలను నియంత్రించే ఉద్దేశంతో ఫ్రాన్స్‌లోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో ఫార్ములా-ఈ పురుడుపోసుకుంది. అనుకున్నదే తడువుగా సంప్రదాయ ఫార్ములా-1కు దీటుగా ఫార్ములా-ఈ రేసులు గత ఎనిమిది సీజన్లుగా విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ నగరాల ఆతిథ్యంలో ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్ అనతికాలంలోనే అందరికీ చేరువైంది. స్ట్రీట్ సర్యూట్ కాన్సెప్ట్‌తో రేసింగ్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందిస్తున్నది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న రేసింగ్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: ఇన్నాళ్లు ఫార్ములా రేసింగ్‌లు సంపన్నుల క్రీడగా వెలుగొందింది. ఎప్పుడైతే ఫార్ములా-1కు పోటీగా ఫార్ములా-ఈ కి రూపకల్పన జరిగిందో సీన్ మారిపోయింది. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం అప్పటి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్(ఎఫ్ఐఏ) అధ్యక్షుడు జీన్ టాడ్, అలెగ్జాండ్రో అగాగ్, అంటానియో తజానీ ఆలోచనల్లో నుంచి ఫార్ములా-ఈ పుట్టింది. వాతారణం కాలుష్యానికి కారణమయ్యే కార్బన్‌డైఆక్సైడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లతో చాంపియన్‌షిప్ నిర్వహణకు బీజం పడింది. అనుకున్నదే తడువుగా ఎఫ్ఐఏ అనుమతి ఇవ్వడం 2014లో బీజింగ్‌లో తొలి రేసుతో ఫార్ములా-ఈ పోటీలకు తెరలేచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు జరుగగా, తొమ్మిదో సీజన్ మెక్సికో సిటీలో గత నెల 14న మొదలైంది. ఈ సీజన్లో మొత్తం 11 నగరాలు ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యమిస్తున్నాయి.
జెన్ 3 టెక్నాలజీతో:
ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఉపయోగించే కార్లు జనరేషన్ 3 టెక్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించారు. అంతకుముందు ఉన్న స్పార్క్ రెనాల్ట్ ఎస్ఆర్టీ-1ఈ, స్పార్క్ ఎస్ఆర్టీ05e(జెన్2 కార్)తో పోల్చుకుంటే జెన్ 3 సాంకేతికంగా చాలా ముందంజలో ఉంది. 2022లో మొనాకో ఈ ప్రిక్స్‌లో జెన్ 3 కారును ప్రదర్శించారు. కారు సామర్థాన్ని 250 కేవీ నుంచి 350 కేవీకి పెంచారు. రీజనరేషన్ లెవల్స్‌లో కారు అత్యధికంగా 600కేవీ శక్తిని విడుదల చేస్తుంది. రేసింగ్ సమయంలో బ్రేక్‌లను వాడటం ద్వారా మొత్తం శక్తిలో 40 శాతాన్ని తిరిగి పొందగలగడం దీని ప్రత్యేకత. కారు గరిష్టంగా గంటకు 320 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.
ఈ కారులో ఉపయోగించే బ్యాటరీని కూడా తక్కువ సమయంలో తొందరగా చార్జ్ అయ్యే విధంగా రూపకల్పన చేశారు. దీనికి తోడు ఒక వేళ రేసింగ్ సమయంలో బ్యాటరీ సామర్థ్యం తగ్గితే పిట్‌స్టాప్ ద్వారా మార్చుకునే అవకాశం డ్రైవర్లకు ఉంటుంది. ఇదిలా ఉంటే వీల్‌బేస్‌ను 3100 ఎమ్ఎమ్ నుంచి 2970ఎమ్ఎమ్కు తగ్గించారు. కారు బరువు విషయానికి వచ్చేసరికి 840కిలోలుగా ఉంటుంది. జూలై 2020లో స్పార్క్ రేసింగ్ టెక్నాలజీని కొత్తగా ఈ కార్లలో పరిచయం చేశారు. కార్లలో వినియోగించే బ్యాటరీలను విలియమ్స్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అందిస్తుంటే..హన్కుక్ కంపెనీ రిసైకిల్డ్ టైర్లను సైప్లె చేస్తున్నది.