బుకారెస్ట్ (రొమేనియా) : గ్రాండ్ చెస్ టూర్ లో భాగమైన సూపర్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తొలి ఓటమి చవిచూశాడు. గురువారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో అమెరికా జీఎం ఫాబియానో కరువానా.. ప్రజ్ఞాను ఓడించాడు. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలున్న టోర్నీలో ప్రస్తుతం 3.5 పాయింట్లతో నిలిచిన ప్రజ్ఞానంద టైటిల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించాడు.
విన్సెంట్ కీమర్, వాన్ ఫొరీస్ట్, కరువానా తలో4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అంతకుముందు ఆరో రౌండ్లో స్థానిక వైల్డ్ కార్డ్ క్రీడాకారుడు, రొమేనియాకు చెందిన డీక్ బోగ్డాన్ డేనియల్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞా 68 ఎత్తుల తర్వాత డ్రా చేసుకున్నాడు.