తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ అదరహో అనిపించాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రతిష్ఠాత్మక టాటా చెస్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచాడు. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ప్రపంచ చెస్ ప్లేయర్లకు దీటైన పోటీనిచ్చి భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మన్ననలు పొందాడు. తెలంగాణ తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అరుదైన రికార్డు ఇప్పటికే తన పేరిట లిఖించుకున్న అర్జున్.. అనతి కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ర్యాపిడ్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈ వరంగల్ కుర్రాడు..బ్లిట్జ్‌లో రన్నరప్‌గా నిలిచాడు. తన ప్రతిభను మరోమారు ప్రపంచానికి పరిచయం చేసిన అర్జున్‌పై ప్రత్యేక కథనం..
కోల్‌కతా వేదికగా టాటా స్టీల్ చెస్ టోర్నీలో బరిలోకి దిగే వరకు యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్‌పై అంతగా అంచనాలు లేవు. దీనికి తోడు తాను ఎంతగానో అభిమానించే బ్లిట్జ్ విభాగంలో ఎంట్రీ కూడా దక్కలేదు. అయినా అర్జున్ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చెస్ దిగ్గజం ఆనంద్..మెంటార్‌గా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టోర్నీలో ఎలాగైనా సత్తాచాటాలని నిర్ణయించుకున్న ఈ కుర్రాడు అర్మేనియా స్టార్ ప్లేయర్ లెవాన్ ఆరోనియన్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం తక్కువైనా..ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ ర్యాపిడ్ విభాగంలో టాపర్‌గా టైటిల్ దక్కించుకున్నాడు. తన చురుకైన ఎత్తులకు తోడు అనూహ్య ఎదురుదాడులతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో సఫలమయ్యాడు. రెండు రోజుల తేడాతో జరిగిన బ్లిట్జ్ కేటగిరీలో అనూహ్య ఫలితాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆఖరి నిమిషంలో
తానేంతో ఇష్టపడే బ్లిట్జ్ విభాగంలో అర్జున్‌కు తొలుత ఆడే అవకాశం లభించలేదు. ఆఖరి నిమిషంలో అధిబన్ భాస్కరన్ అనారోగ్య కారణాలతో వైదొలగడంతో అర్జున్‌కు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలిచిన జోరు మీదున్న ఈ ఓరుగల్లు ముద్దుబిడ్డ..బ్లిట్జ్‌లో టైటిల్‌ను ముద్దాడే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆఖరి పోరులో ప్రపంచ నంబర్ 4 ర్యాంకర్ ఆరోనియన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో ఓడటంతో రెండో స్థానంలో నిలిచాడు. సమవుజ్జీలుగా నిలిచిన తుది పోరులో విజేతను నిర్ణయించేందుకు జరిగిన అర్మాగెడాన్లో ఆరోనియన్ను విజయం వరించింది. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన అర్జున్ ప్రతిభకు చెస్ గురువు ఆనంద్ మంత్రముగ్ధుడయ్యాడు. అసలు ఇలాంటి ఎత్తులు కూడా వేయవచ్చా అని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు.
కెర్‌ర్‌లోనే అత్యుత్తమం
అర్జున్ చెస్ కెరీర్లో టాటా టోర్నీ ప్రదర్శన అత్యుత్తమని చెప్పొచ్చు. దీనికి ముందు లిండోర్స్ అబే బ్లిట్జ్ టోర్నీలో రాణించడం ఇందుకు దోహదపడిందని అర్జున్ చెప్పుకొచ్చాడు. అంచనాల్లేకుండా పోటీకి దిగి టైటిళ్లు దక్కించుకోవడం తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన అని సంతోషం వ్యక్తం చేశాడు. దేశంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లకు తోడు ఆరోనియన్ వంటి ప్లేయర్‌కు తన గేమ్ పవర్ ఏంటో చూపించాడు.
ర్యాంకింగ్స్‌లో పైపైకి
ప్రతిష్ఠాత్మక టాటా చెస్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలువడం ద్వారా అర్జున్ తన ర్యాంకింగ్స్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ టోర్నీకి ముందు 32వ ర్యాంక్‌లో ఉన్న అర్జున్ తాజాగా 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ తరఫున బ్లిట్జ్ విభాగంలో ఆనంద్ తర్వాత అర్జున్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. తాను ఎంతగానో అభిమానించే ఆటగాని తర్వాత స్థానంలో ఉండటం గర్వంగా ఉంద ని అర్జున్ ఆనందం వ్యక్తం చేశాడు.
‘క్లాసిక్’లో రాణించడమే లక్ష్యంగా..
బ్లిట్జ్ విభాగంలో ప్రస్తుతం 2773 పాయింట్లతో కొనసాగుతున్న అర్జున్..క్లాసిక్ ఫార్మాట్లో రాణించడమే తన లక్ష్యమని అన్నాడు. స్పెయిన్‌లో జరిగే టోర్నీతో పాటు కజకిస్థాన్‌లో డిసెంబర్ 25 నుంచి జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో సత్తాచాటేందుకు సిద్ధమన్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్న ఈ మెగాటోర్నీలో రాణించి దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తానన్న నమ్మకం ఉందన్నాడు.