James Anderson : ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో మైలురాయి సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో అతను అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్ తీయడంతో అండర్సన్ 957 వికెట్లతో కుంబ్లే (956 వికెట్లు)ను దాటేశాడు. దాంతో, అత్యధిక వికెట్లు జాబితాలో అండర్సన్ మూడు స్థానంలో నిలిచాడు. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 1,347 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్ 1,001 వికెట్లు తీసి రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కుంబ్లే నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. అత్యధిక వికెట్ల జాబితాలో ఉన్న ముగ్గురిలో అండర్సన్ మాత్రమే ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. దాంతో, అతని ఖాతాలో మరిన్ని వికెట్లు జమ అయ్యే అవకాశం ఉంది.
కుడిచేతి వాటం బౌలర్ అయిన అండర్సన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్వింగ్ బౌలర్లలో ఒకడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 957 వికెట్లు నేలకూల్చాడు. టెస్టుల్లో 670 వికెట్లు, వన్డేల్లో 269, టీ 20 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్ 2003లో లార్డ్స్ మైదానంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. అతను అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ తను యువ బౌలర్లతో పోటీ పడుతూ వికెట్లు సాధిస్తున్నాడు.
పాక్‌తో మొదటి టెస్ట్‌లో అండర్సన్ 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 9 వ తేదీన జరగనుంది.