Shoaib Malik : జట్టులో పెద్ద వాడినే కావొచ్చు కానీ పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్‌గా ఉన్నానని పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ అన్నాడు. అంతేకాదు ఆటను ఆస్వాదించినంతక కాలం క్రికెట్ ఆడతానని, ఇప్పట్లో రిటైర్ అవ్వనని మాలిక్ తెలిపాడు. ‘నన్ను నమ్మండి. నేను జట్టులో పెద్ద వయస్కుడినే కావొచ్చు. అయితే.. 25 ఏళ్ల ఆటగాడితో నా ఫిట్నెస్ను పోల్చి చూడండి. గ్రౌండ్‌కు రావడాన్ని నేను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నా. ఇంకా నాలో పరుగుల దాహం అలానే ఉంది. ఈ రెండూ ఉన్నంత కాలం నేను క్రికెట్ ఆడుతూనే ఉంటాను. ఇప్పట్లో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదు’ అని మాలిక్ వెల్లడించాడు. మాలిక్‌కు ఇప్పుడు 40 ఏళ్లు. ఫిబ్రవరి 1న అతను 41వ వసంతంలోకి అడుగు పెట్టనున్నాడు. పాకిస్థాన్ క్రికెట్లో సక్సెస్ఫుల్ ఆల్రౌండర్లలో మాలిక్ ఒకడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో
2021 పొట్టి ప్రపంచకప్‌లో పాక్ జట్టుకు ఎంపికైన మాలిక్ ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ‘టీ20లకు నేను అందుబాటులో ఉన్నాను. అవకాశం రావాలే గానీ ఉత్తమ ప్రదర్శనతో అదరగొడతాను’ అని మాలిక్ అన్నాడు. మాలిక్ ప్రస్తుతం ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షోయబ్ రంగ్‌పూర్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు.
మాలిక్ భార్య సానియా మీర్జాతో విడాకుల వార్తల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలిచాడు. సానియా, మాలిక్‌లకు ఇజాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే.. మాలిక్, సానియా డైవర్స్ తీసుకుంటున్నామని ఎక్కడా చెప్పలేదు. వీళ్లిద్దరూ ఈమధ్యే ది మీర్జా మాలిక్ అనే టాక్ షోలో సందడి చేశారు.