ఫాక్స్‌బరో: గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌లో పంజా విసురుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె డబుల్ ధమాకా మోగిస్తే.. మూడో మ్యాచ్‌లో ఆ జట్టు ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలే తొలి అర్ధభాగంలోనే మూడు గోల్స్‌తో మురిపించాడు. ఉస్మాన్ హ్యాట్రిక్ గోల్స్ రికార్డుతో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1తో నార్వేపై ఘన విజయం సాధించింది. వరుసగా మూడో విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంతో నాకౌట్‌కు రెడీ అయింది. ఈ పోరులో ఓడినా నార్వే కూడా రెండో స్థానంతో రౌండ్-32 దశకు అర్హత సాధించింది. 2025 బాలన్ డి ఓర్ విజేత అయిన డెంబెలే మ్యాచ్ ఫస్టాఫ్‌లోనే వరుస గోల్స్‌తో నార్వే డిఫెన్స్‌ను బెంబేలెత్తించాడు. 1994 ప్రపంచకప్ తర్వాత ఒక మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ పోరులో ఫ్రాన్స్ ఆట మొత్తం డెంబెలే చుట్టే తిరిగింది. మ్యాచ్ మొదలైన ఏడో నిమిషంలో ఎంబాపె అందించిన పాస్‌ను అతను కుడికాలితో అద్భుతషాట్ కొట్టి జట్టుకు తొలి ఆధిక్యం అందించాడు.
20వ నిమిషంలో మరోసారి బంతిని అందుకున్న అతను ముగ్గురు డిఫెండర్ల మధ్య ఖాళీని వాడుకుంటూ ఎడమకాలితో షాట్ కొట్టి నెట్లోకి పంపడంతో ఫ్రాన్స్ 2-0తో లీడ్‌లోకి వచ్చింది. అయితే, డెంబెలే రెండో గోల్ కొట్టిన 14 సెకండ్లలోనే నార్వే ఆటగాడు థెలో ఆస్గార్డ్ తమ జట్టుకు తొలి గోల్ అందించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. అయినా మరో ఎండ్‌లో డెంబెలే అస్సలు తగ్గలేదు. 32వ నిమిషంలో రైట్ కార్నర్లో బంతిని అందుకున్న అతను మరో ఖతర్నాక్ కిక్‌తో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. నార్వే కోచ్ స్టాలే సోల్బాకెన్ స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్తో పాటు మరో 10 మంది రెగ్యులర్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇవ్వడంతో ఆ జట్టు అంతగా ప్రభావం చూపలేకపోయింది. 49వ నిమిషంలో నార్వేకు పెనాల్టీ లభించినప్పటికీ, జోర్గెన్ లార్సెన్ కొట్టిన షాట్‌ను ఫ్రాన్స్ కీపర్ మైక్ మైగ్నాన్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇంజూరీ టైమ్‌లో ఫ్రాన్స్ యువ ఆటగాడు డెసిరె డౌయ్ నాలుగో గోల్ అందించడంతో ఆ జట్టు ఘన విజయం సొంతం చేసుకుంది. ఇదే గ్రూప్‌లో గోల్స్ మోత మోగించిన సెనెగల్ 5-0తో ఇరాక్‌ను చిత్తుగా ఓడించి నాకౌట్ అవకాశాలు సజీవంగా నిలుపుకుంది.
బెల్జియం భారీ విజయంతో..
ప్రపంచకప్‌లో వరుస డ్రాలతో నిరాశపరిచిన బెల్జియం ఎట్టకేలకు ఫామ్ అందుకుంది. గ్రూప్-జి ఆఖరి పోరులో 5-1 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ భారీ గెలుపుతో బెల్జియం గ్రూప్ టాపర్‌గా నిలిచి నాకౌట్ దశకు దూసుకెళ్లింది. ఆ జట్టు తరఫున ఫార్వర్డ్ లియాండ్రో ట్రోసార్డ్ 28, 50వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో మెరవగా, స్టార్ ప్లేయర్లు కెవిన్ డి బ్రూయిన్ (66వ ని), రొమేలు లుకాకు (86వ ని), అలెక్సిస్ సేలేమేకర్స్ (90+4వ ని) చెరో గోల్ కొట్టారు. న్యూజిలాండ్ జట్టులో ఎలిజా జస్ట్ (84వ ని)ఏకైక గోల్ సాధించాడు. ఇదే గ్రూప్లోఇరాన్తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న ఈజిప్ట్ రెండో స్థానంతో తొలిసారి నాకౌట్ చేరింది.
2ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆట మొదలైన తర్వాత వేగంగా హ్యాట్రిక్ సాధించిన రెండో ప్లేయర్ డెంబెలే (32 నిమిషాల్లో). 1954లో చెకోస్లోవెకియాపై ఆస్ట్రియా స్ట్రైకర్ ఎరిక్ ప్రోస్ట్ తొలి 24 నిమిషాల్లోనే మూడో గోల్స్ కొట్టాడు.