Sophie Devine : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సోఫీ డెవినె (Sophie Devine) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. పొట్టి ప్రపంచకప్‌తో తన శకం ముగిస్తుందని ఇదివరకే ప్రకటించిన డెవినె.. టోర్నీ ముగిసిన మరునాడే అల్విదా చెప్పేసింది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తనకు మద్దుతుగా నిలిచిన కోచ్‌లు, క్రికెటర్లు, కుటుంబసభ్యులకు డెవినె ధన్యవాదాలు తెలిపింది. ఇద్దరు దిగ్గజాలు సుజీ బేట్స్, తహుహులతో కలిసి చివరిసారిగా మైదానం వీడిన ఫొటోను పంచుకున్న తను.. కెరీర్‌లోని ప్రత్యేకమైన క్షణాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
నిరుడు వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు చేతిలో ఓటమితో వన్డేలకు స్వస్తి పలికిన సోఫీ డెవెనె ఈసారి టీ20లకూ బైబై చెప్పేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో ఆమె కెరీర్ ముగిసినా.. టోర్నీ పూర్తి కావడంతో ఈ విషయాన్ని అధికారికంగా డెవినె వెల్లడించింది. 2024లో జట్టును తొలిసారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిపిన డెవినె జూలై 6న ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన క్రికెట్ ప్రయాణాన్ని తలచుకుంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది.
Sophie Devine pens a heartfelt farewell to her cricket journey 🥹✨ pic.twitter.com/YDr61taEIp
— Cricinfo (@cricinfo) July 6, 2026
‘గత ఇరవై ఏళ్లు ఎలా ముగిశాయో తెలియడం లేదు. కానీ, ఇద్దరు గొప్ప సహచరిణులతో కలిసి చివరిసారి మైదానం వీడడం నా అంతర్జాతీయ క్రికెట్‌కు అర్థవంతమైన ముగింపు. నా క్రికెట్ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతానో లేదో నాకు తెలియదు. లేదంటే న్యూజిలాండ్‌లోని సగం మందికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. కోచ్‌లు, ఫీజియో, ట్రైనర్స్, అధికారులు, అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచినందుకు, నన్ను ప్రోత్సహించినందుకు, ముఖ్యంగా నన్ను భరించినందుకు కృతజ్ఞతలు. వైట్ ఫెర్న్స్ సభ్యులు.. నేను ఆడడానికి మీరే కారణం.
The #T20WorldCup title in 2024 the highlight as Sophie Devine reflects on her marvellous international career 🫶 pic.twitter.com/vjzrSizJLS
— ICC (@ICC) July 5, 2026
విశ్వ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం.. అందరం పక్కపక్కనే నిల్చోవడం వంటివి నన్ను ఎంతగానో గర్వించేలా చేశాయి. చివరగా నా కుటుంబసభ్యులు. వారు చూస్తుండగా నేను చివరిసారిగా మైదానం వీడడం నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన క్షణాలు. మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజుల్లో నాకు అండగా నిలిచిన మీకు ధన్యవాదాలు’ అని డెవినె తన వీడ్కోలు పోస్ట్‌లో పేర్కొంది.
ఒకప్పుడు క్రికెట్‌కు ఏమంత ఆదరణ లేని న్యూజిలాండ్‌లో యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది సోఫీ డెవినె. 2006 అక్టోబర్ 22న తొలి వన్డే ఆడిన ఆమె.. అనతికాలంలోనే జట్టులో కీలకమైంది. పేస్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ.. ఓపెనర్‌గా శుభారంభాలు ఇస్తూ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమైంది డెవినె. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 159 వన్డేలు ఆడిన తను.. 9 శతకాలు, 18 హాఫ్ సెంచరీలతో కలిపి 4,279 పరుగుల చేసింది. బంతితోనూ సత్తా చాటి 111 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.. 3/24. టీ20ల్లో 158 మ్యాచులు ఆడి 3,817 రన్స్ కొట్టింది డాషింగ్ బ్యాటర్.