ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. టైటిల్ వేటలో ఫేవరెట్లు అనూహ్యంగా నిష్క్రమిస్తుంటే…అనామక జట్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అసలు అంచనాల్లేకుండా బరిలోకి దిగి తమ కలల కప్‌ను ముద్దాడేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. ఈసారైనా కప్‌ను ముద్దాడుదామనుకున్న క్రిస్టియానో రొనాల్డో కలను మొరాకో చెరిపేసింది. పోరాడటమే తమ ఆయువుపట్టుగా మలుచుకుంటూ మేటి జట్టును ఇంటిబాట పట్టించింది. సంచలన విజయాలతో ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా మొరాకో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అనూహ్య ఓటమితో షాక్‌కు గురైన రొనాల్డో చెమర్చిన కండ్లతో మైదానాన్ని వీడాడు. మరో క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ను షూటౌట్ చేసిన అర్జెంటీనా..క్రొయేషియాతో అమీతుమీకి సిద్ధమైంది.
దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో మరో మేటి జట్టు ఇంటి ముఖం పట్టింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్ నిష్క్రమించిన రోజు వ్యవధిలో పోర్చుగల్ అదే బాట పట్టింది. ప్రిక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌పై భారీ విజయంతో జోరుమీద కనిపించిన పోర్చుగల్..క్వార్టర్స్‌లో తేలిపోయింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 0-1 తేడాతో మొరాకో చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొంది. తన చిరకాల కలను ఈసారైనా సాకారం చేసుకుందామనుకున్న స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో కన్నీటితో మైదానాన్ని వీడటం సగటు ఫుట్‌బాల్ అభిమానిని కదిలించింది. ఆద్యంతం పోర్చుగల్‌తో మొరాకో ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడింది. మ్యాచ్ మొదటి నుంచి పోర్చుగల్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన మొరాకోకు యూసుఫ్ ఎన్నెస్రీ(42ని) ఏకైక గోల్ అందించాడు. పోర్చుగల్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ యూసుఫ్ కొట్టిన హెడర్ గోల్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అమాంతం గాల్లోకి ఎగిరిన ఈ మొరాకో స్ట్రైకర్ బంతిని పోస్ట్‌లోకి పంపి స్టేడియాన్ని హోరెత్తించాడు. యూసుఫ్ కొట్టిన గోల్‌కు డగౌట్లో కూర్చున్న రొనాల్డో ఆశ్చర్యపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రొనాల్డో సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగాడు. బంతి దొరకడమే ఆలస్యం గోల్‌పోస్ట్ వైపు మెరుపు వేగంతో కదిలాడు. మ్యాచ్‌లో బంతిని 60 శాతం తమ ఆధీనంలో ఉంచుకున్న పోర్చుగల్ మూడు సార్లు మొరాకో గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తే..22 శాతానికే పరిమితమైన మొరాకో ఒకే గోల్‌తో మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది. ఆఖరి నిమిషాల్లో పోర్చుగల్ పదేపదే గోల్ కోసం ప్రయత్నించినా మొరాకో డిఫెండర్లు దీటుగా తిప్పికొట్టి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. రిఫరీ ఫైనల్ విజిల్ వేయడంతో రొనాల్డో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. చెమర్చిన కండ్లతో మైదానాన్ని వీడాడు.
హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో అర్జెంటీనా 4-3 తేడాతో నెదర్లాండ్స్(పెనాల్టీ షూటౌట్)పై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 2-2తో సమమైంది. దీంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. షూటౌట్లో అర్జెంటీనా గోల్‌కీపర్ డామియన్ మార్టినెజ్ గోడలా నిలువడంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు. షూటౌట్లో అర్జెంటీనా తరఫున మెస్సీ, పరెడెజ్, మాంటియల్, మార్టినెజ్ గోల్స్ అందించారు.