దుబాయ్: ‘ఆడలేక మద్దెల ఓడు’.. అన్నట్లుంది పాకిస్థాన్ పరిస్థితి. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియాను గెలిపించగా.. అంతా అయిపోయాక పాక్ మాజీలు కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరి ఓవర్లో నవాజ్ వేసింది నోబాలే కాదని ఒకరంటే.. బంతి వికెట్‌ను తాకిన తర్వాత ‘డెడ్ బాల్’ అవుతుంది కదా దానికి పరుగులు ఎలా ఇస్తారు అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ఏండ్లకేండ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవాళ్లు కూడా విచిత్ర సందేహాలు లేవనెత్తడం సగటు క్రికెట్ అభిమానులను కూడా విస్మయానికి గురి చేస్తున్నది.
మరోవైపు మ్యాచ్‌లో భాగంగా పాండ్యా, విరాట్ కోహ్లీ బంతి బౌలర్ చేతి నుంచి విడుదల కాకముందే పలుమార్లు నాన్‌స్ట్రయికింగ్ క్రీజు దాటి బయటకు వచ్చారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతున్నది. దీనిపై మ్యాచ్ అనంతరం స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడది నిబంధనల్లో భాగమే.. ఒకవేళ బంతి విడుదల కాకముందు క్రీజు దాటినట్లు బౌలర్ గుర్తిస్తే నిర్మొహమాటంగా రనౌట్ చేయవచ్చు. ఇందులో క్రీడా స్ఫూర్తి అనే అంశానికి తావులేదు. అని అన్నాడు. మొత్తంగా భారత్, పాక్ మ్యాచ్‌లో 25 సార్లు టీమ్ఇండియా ఆటగాళ్లు ఇలా ముందుగానే క్రీజు దాటగా.. పాకిస్థాన్ ప్లేయర్లు 53 సార్లు ఇలా చేశారని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఆధారాలతో సహా పోస్ట్ చేయడం కొసమెరుపు.
నరాలు తెగే ఉత్కంఠలోనూ కోహ్లీ స్థితప్రజ్ఞతతో బంతి వికెట్‌ను తాకిన వెంటనే పరుగందుకోగా.. విరాట్ ఔటయ్యాడనుకున్న పాక్ ఆటగాళ్లు కాసేపటి వరకు అసలు బంతి ఎటు వెళ్తుందో కూడా గమనించలేదు. ప్రత్యర్థి తేరుకునే ముందే మూడు పరుగులు పూర్తి చేసిన రన్‌మెషీన్ జట్టును విజయానికి చేరువ చేశాడు.
నవాజ్ వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతి నోబాల్ ఎలా అవుతుంది?
క్రికెట్ రూల్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం బౌలర్ చేతి నుంచి విడుదలైన బంతి బ్యాటర్ నడుము ఎత్తుకంటే పైకి వస్తే దాన్ని నోబాల్‌గా పరిగణిస్తారు.
స్పష్టమైన నోబాల్ అయితే అంపైర్ ముందే ఎందుకు సిగ్నల్ ఇవ్వలేదు?
క్రికెట్ రూల్: హై నోబ్ నిర్ణయం తీసుకునే అధికారం లెగ్ అంపైర్‌దే. ఒకవేళ ఈ అంశంపై సందేహాలు ఉంటే మూడో అంపైర్‌ను సంప్రదించవచ్చు.
విరాట్ కోహ్లీ కోరడంతోనే అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడా?
వాస్తవం: తీవ్ర ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో ఆటగాళ్లు భావోద్వేగాలకు గురవడం సహజం. అదే తరహాలో కోహ్లీ అంపైర్‌తో ఇది నోబాల్ అని అన్నాడు. అంపైర్ తన నిర్ణయం ప్రకటించిన అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ అంశంపై చాలాసేపు అంపైర్లతో వాదిస్తూ కనిపించాడు.
కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయినా పరుగులు ఎందుకు తీశాడు?
క్రికెట్ రూల్: నాలుగో బంతి నోబాల్ కావడంతో విరాట్‌కు ఫ్రీ హిట్ అవకాశం దక్కింది. అయితే మరోసారి బంతి వేసిన నవాజ్ వైడ్ వేయడంతో ఫ్రీ హిట్ అలాగే కొనసాగింది. దీంతో ఆ మరుసటి బంతి నేరుగా వికెట్లను తాకినా.. నిబంధనల ప్రకారం కోహ్లీ నాటౌటే. (ఫ్రీ హిట్‌కు కేవలం రనౌట్ తప్ప ఏ విధంగానూ బ్యాటర్ ఔట్ కాడు)
బంతి వికెట్లను తాకితే డెడ్ కదా?
క్రికెట్ రూల్: ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి వికెట్‌కీపర్/బౌలర్ చేతిలోకి చేరిన తర్వాతే డెడ్ బాల్ అవుతుంది. అప్పటి వరకు బంతి ‘ప్లే’ లో ఉన్నట్లే పరిగణిస్తారు.