Sachin Tendulker : మహిళా క్రికెటర్ల (Women Cricketers) కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulker) హర్షం వ్యక్తంచేశారు. ప్రసవానంతరం మహిళా క్రీడాకారిణులు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు రూపొందించిన ఈ నిబంధనలు, మహిళా క్రికెట్కు భారీ ఊతమని ఆయన అభివర్ణించారు. మాతృత్వం, వృత్తిగత కెరీర్ను సమన్వయం చేసుకునేందుకు ఈ మార్గదర్శకాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఐసీసీ తాజాగా ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్’ను విడుదల చేసింది. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత క్రీడాకారిణుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరు దశల విధానాన్ని ఇందులో పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్ల కోసం ఒక నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడం ఇదే తొలిసారి. మాతృత్వం కారణంగా ఏ క్రీడాకారిణి కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా తెలిపారు.
గతంలో చాలామంది క్రీడాకారిణులు కుటుంబ బాధ్యతల నిమిత్తం కెరీర్ మధ్యలోనే వీడ్కోలు పలకాల్సి వచ్చేది. ఈ నూతన విధానం ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఆటలో సుదీర్ఘకాలం కొనసాగేందుకు తోడ్పడుతుందని ఆయన ఆకాంక్షించారు.