దుబాయ్: ప్రపంచ చదరంగంలో తనకు తిరుగులేదని నార్వే స్టార్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ ఘనంగా చాటుకున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా..ప్రపంచ టైటిల్ తనదేని నిరూపించాడు. ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. తన ప్రత్యర్థి రష్యా ప్లేయర్ ఇయాన్ నెపోనియాచీపై కార్ల్సన్ 7.5-3.5 తేడాతో అద్భుత విజయం సాధించాడు. మొత్తం 14 రౌండ్ల టోర్నీలో మరో మూడు గేములు మిగిలుండగానే ఈ నార్వే ప్లేయర్ తన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో కెరీర్లో ఐదోసారి ప్రపంచ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. శుక్రవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన 11వ గేమ్‌లో కార్ల్సన్ 1-0 తేడాతో ఇయాన్‌పై విజయం సాధించాడు. 23వ ఎత్తులో నెపో చేసిన తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న కార్ల్సన్ 49 ఎత్తుల్లో గేమ్‌ను ముగించాడు. మెగాటోర్నీలో రెండోసారి నల్లపావులతో బరిలోకి దిగిన ఈ చెస్ దిగ్గజం..నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో తొలి ఐదు గేమ్‌లను డ్రా చేసుకున్న కార్ల్సన్..ఆరో గేమ్ నుంచి తన విశ్వరూపం ప్రదర్శించాడు. అనుభవాన్ని రంగరిస్తూ ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పోయాడు. దీనికి తోడు తొలిసారి ప్రపంచ టైటిల్ వేటలో పోటీ పడ్డ ఇయాన్ ఎత్తులను చిత్తుచేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన కెరీర్లో ఐదోసారి ప్రపంచ విజేతగా నిలిచిన కార్ల్సన్..నాలుగోసారి తన టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. తొలిసారి 2013లో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌పై గెలిచిన కార్ల్సన్..సెర్గె కార్జకిన్(2016), ఫాబియానో(2018) విజయాలతో టైటిళ్లు ఒడిసిపట్టుకున్నాడు.
ఇలాంటి విజయాన్ని నేను అస్సలు ఊహించలేదు. పూర్తిగా ప్రొఫెషనల్ తరహాలో ప్రత్యర్థిపై పైచేయి సాధించాను. 2013లో ఆనంద్‌తో జరిగిన తొలి పోరును మళ్లీ గుర్తుకు తెచ్చింది. ప్రారంభంలో చాలా తడబడ్డాను. కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఈసారి అదే జరిగింది.
–కార్ల్సన్