చండీగఢ్ : మైనర్ అథ్లెట్‌పై లైంగిక వేధింపుల కేసులో జాతీయ పారా ఆర్చరీ కోచ్ కుల్దీప్ వేద్వాన్కు హర్యానాలోని సోనిపట్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పోక్సో చట్టం కింద వేద్వాన్ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా కూడా విధించింది. దీంతో బెయిల్‌పై ఉన్న వేద్వాన్ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన ట్రయల్స్ సందర్భంగా వేద్వాన్ తన హోటల్ గదిలోకి ప్రవేశించి లైంగికంగా వేధించాడని ఓ మైనర్ క్రీడాకారిణి ఫిర్యాదు చేసింది.
తన మాట వింటే ‘పెద్ద ప్లేయర్’ను చేస్తానని వేద్వాన్ నిరంతరం ఒత్తిడి తెచ్చినట్లు చేసిన ఆమె ఫిర్యాదు ఆదారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. 2024 పారిస్ పారాలింపిక్స్ ముంగిట బెయిల్ లభించింది. ఆర్మీ మాజీ ఉద్యోగి కుల్దీప్ వేద్వాన్కు కోచ్‌గా మంచి పేరుంది. టోక్యో పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ దేశానికితొలి పతకం సాధించినప్పుడు అతనే కోచ్‌గా ఉన్నాడు. రెండు చేతులు లేని వరల్డ్ నంబర్‌వన్ పారా ఆర్చర్ శీతల్ దేవికి మెంటార్‌గా వ్యవహరించి, ఆమె కాళ్లతో బాణాలు సంధించే వినూత్న శైలిని రూపకల్పన చేశాడు. ఇటీవల శీతల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన పాయల్ నాగ్ కూడా వేద్వాన్ అకాడమీకి చెందిన ఆర్చర్ కావడం గమనార్హం.