అబుదాబి: టీ20 వరల్డ్‌కప్( T20 World Cup ) క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలోనే ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంఫర్. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో నెదర్లాండ్స్ బ్యాటర్స్ కొలిన్ అకెర్మాన్, రియాన్ టెన్ డూషె, స్కాట్ ఎడ్వర్డ్స్, రోలోఫ్ వాండెర్ మెర్వ్లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కర్టిస్ నిలిచాడు. ఇంతకుముందు శ్రీలంక పేసర్ లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ అరుదైన రికార్డు సాధించారు.
4 బంతుల్లో 4 వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ మలింగ. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై మలింగ ఈ డబుల్ హ్యాట్రిక్ తీశాడు. 2019లో మరోసారి న్యూజిలాండ్‌పై ఇదే రికార్డు రిపీట్ చేశాడు. ఇక అదే ఏడాది రషీద్ ఖాన్ కూడా ఐర్లాండ్‌పై 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. టీ20ల్లో ఐర్లాండ్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా కూడా కర్టిస్ కాంఫర్ నిలిచాడు. 4 ఓవర్లలో 4 వికెట్లకు 26 పరుగులు ఇచ్చాడు.