Praggnanandhaa | అద్వితీయ ప్రతిభతో ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత యువ సంచలనం ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్తో హోరోహారీగా సాగిన ఫైనల్లో విజృంభించిన 18 ఏండ్ల ప్రజ్ఞా రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసినా.. టై బ్రేక్‌లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. తొలిసారి మెగాటోర్నీ ఫైనల్ ఆడిన ఈ చెన్నై చిన్నోడు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు చెమటలు పట్టించి.. భవిష్యత్తు తనదే అని స్పష్టమైన సంకేతాలిచ్చాడు!
బాకు (అజర్బైజాన్): ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కిన 18 ఏండ్ల ప్రజ్ఞానంద గురువారం జరిగిన టై బ్రేక్‌లో 0.5-1.5తో కార్ల్సన్ (నార్వే) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్లో భాగంగా జరిగిన రెండు క్లాసిక్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. టై బ్రేక్‌లో తడబడ్డాడు. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ నెగ్గిన కార్ల్‌సన్‌కు వరల్డ్ కప్‌లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. టై బ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి ర్యాపిడ్ గేమ్‌లో తన అనుభవాన్నంతా రంగరించి విజయం సాధించిన కార్ల్సన్.. రెండో గేమ్‌ను ఉద్దేశపూర్వకంగానే ‘డ్రా’ చేసుకున్నాడు. దీంతో మెరుగైన పాయింట్ల ద్వారా నార్వే గ్రాండ్‌మాస్టర్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు రూ. 91 లక్షలు, రన్నరప్ ప్రజ్ఞానందకు రూ. 66 లక్షల నగదు బహుమతి దక్కింది.
సాధారణంగా అందరు పిల్లల్లాగే.. ఆ బుడ్డోడు కూడా చిన్నప్పుడు టీవీ చూడాలని తెగ ఉబలాటపడేవాడు. ఐదేండ్ల వయసులో రిమోట్ కోసం అక్కతో గొడవపడుతూ నానా అల్లరి చేసేవాడు. దీంతో ఈ అక్కాతమ్ముళ్లను దారిలోకి తేవాలనుకున్న వాళ్ల అమ్మ.. చిన్న చెస్ బోర్డు ఇంటికి తెచ్చింది. ఇక అక్కడి నుంచి వాళ్ల ధోరణే మారిపోయింది. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ఆ ఇద్దరూ చూస్తుండగానే చదరంగంలో ఆరితేరారు. తనకు తెలిసిందంతే నేర్పేసిన తల్లి.. వారిద్దరి గొడవ భరించలేక ఇక కోచింగ్ ఇప్పించాల్సిందే అని నిర్ణయించుకుంది. అలా ఒక్కో అడుగు ముందుకేస్తూ.. అంచలంచెలుగా ఎదిగిన ఆ కుర్రాడే.. ఈ రోజు ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు.. చెస్ బోర్డుపై కూర్చుంటే చాలు విజయం సాధించడమే తన లక్ష్యమనే విధంగా ఆడే ప్రజ్ఞానంద చూస్తుండగానే అందనంత ఎత్తుకు ఎదిగాడు.
తండ్రి రమేశ్‌బాబు ఓ బ్యాంక్‌లో క్లర్క్ కాగా.. తల్లి నాగలక్ష్మి గృహిణి. మహిళా గ్రాండ్‌మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కించుకున్న అక్క వైశాలీ కూడా చెస్‌లో దిట్ట కావడం ప్రజ్ఞాకు మరింత కలిసివచ్చింది. ఏడేండ్ల వయసులోనే జాతీయ చాంపియన్‌గా, పదేండ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచి రికార్డులు నెలకొల్పిన ప్రజ్ఞానంద.. 12 ఏండ్ల వయసులోనే (2018లో) గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఇదే రికార్డు కాగా.. 16 ఏండ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మట్టికరిపించి చెస్ ప్రపంచానికి తానేంటో నిరూపించాడు.
చెన్నైకే చెందిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఆరాధించే ప్రజ్ఞా.. అతడి అడుగుజాడల్లోనే నడుస్తూ ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరాడు. కార్ల్సన్తో తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. టై బ్రేక్‌లో కాస్త వెనుకబడ్డా.. ప్రపంచ నంబర్‌వన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. సాధారణంగా ప్రత్యర్థులను పెద్దగా లెక్క చేయని కార్ల్సన్.. తుదిపోరులో ప్రజ్ఞాతో తలపడే ముందు తన ఆరోగ్యం బాలేదని సాకులు వెతుక్కున్నాడంటేనే మనవాడి ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది క్యాండిడేట్ టోర్నీకి ఎంపికైన ప్రజ్ఞా.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత
గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు.
పెద్ద టోర్నీలంటే ఆటగాళ్లపై ఒత్తిడి ఉండటం సహజం కాగా.. ప్రజ్ఞానంద మాత్రం దీనికి విరుద్ధం. పోటీ ఎంత ఎక్కువ ఉంటే.. అంత మెరుగైన ప్రదర్శన చేయడం ప్రజ్ఞాకు చిన్నప్పటి నుంచే అలవాటు. టీనేజ్ పిల్లలంతా ఎంజాయ్మెంట్లో మునిగితేలుతుంటే.. ఈ చెన్నై చిన్నోడు మాత్రం అనునిత్యం చెస్‌బోర్డుతో కుస్తీ పడుతుంటాడు. టోర్నీ ఏదైనా పక్కన అమ్మ లేకుంటే కాళ్లు చేతులు ఆడవనే ప్రజ్ఞాకు తల్లి నాగలకే్ష్మ కొండంత ధైర్యం. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఇటలీ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరునపై అలవోక విజయం.. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్ చేతిలో తృటిలో ఓడిన ప్రజ్ఞానందను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అభినందించారు.
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం