ముల్లాన్‌పూర్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ నాలుగు గెలువగా, గుజరాత్ మూడింటిలో ఒకటి గెలిచి, రెండు ఓడింది.
ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మండువేసవిలో అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ దాదాపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫైనల్ చేరుకోగా, మరో బెర్తు కోసం గుజరాత్ టైటాన్స్(జీటీ), రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) మధ్య పోటీ నెలకొన్నది. శుక్రవారం క్వాలిఫయర్-2లో భాగంగా గుజరాత్, రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. బలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ చేతిలో భారీ ఓటమితో గుజరాత్..క్వాలిఫయర్-2లోకి ప్రవేశించగా, ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన రాజస్థాన్ మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశలో గుజరాత్ టాప్-2లో నిలువగా, ఆర్ఆర్ ఆఖరి బెర్తుతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. లీగ్ చరిత్రలో ఒక్కోసారి టైటిల్ గెలిచిన ఈ రెండు జట్లు మరోమారు టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాయి. వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ అన్నీతానై రాజస్థాన్ బ్యాటింగ్‌ను ముందుండి నడిపిస్తుంటే..మరోవైపు సాయిసుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలకడగా పరుగులు కొల్లగొడుతున్నారు. ఇరు జట్ల సారూప్యతను గమనిస్తే గుజరాత్, రాజస్థాన్ తమ టాప్-3 బ్యాటర్లపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. జీటీ తరఫున సుదర్శన్, గిల్, బట్లర్ రాణిస్తుంటే..ఆర్ఆర్కు సూర్యవంశీ, జైస్వాల్, జురెల్ కీలకంగా మారారు. జీటీ, ఆర్ఆర్ మధ్య పోరులో గెలిచే జట్టు ఈనెల 31న అహ్మదాబాద్‌లో జరిగే టైటిల్ ఫైట్‌లో ఆర్సీబీతో తలపడుతుంది.
ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఆపడటం ప్రత్యర్థి జట్లకు తలకుమించిన భారంగా మారింది. హైదరాబాద్‌తో ఎలిమినేటర్ పోరులో 15 ఏండ్ల వైభవ్ విధ్వంసం మాటలకందనిది. ప్రపంచ స్థాయి బౌలర్లు అయిన కమిన్స్, మలింగను గల్లీబౌలర్లుగా మారుస్తూ వైభవ్ కొట్టిన కొట్టుడుకు ముల్లాన్‌పూర్ స్టేడియం హోరెత్తిపోయింది. బంతి పిచ్‌పై పడిందంటే ఆలస్యం..దాని గమ్య స్థానం బౌండరీనే అన్న లక్ష్యంతో సూర్యవంశీ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన తీరు మాటలకందనిది. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో రికార్డులు తిరుగరాస్తున్న ఈ బుడ్డోడు..క్వాలిఫయర్-2లోనూ చెలరేగితే గుజరాత్ పని అయిపోయినట్లే. అయితే లీగ్‌లో మిగతా జట్లతో పోలిస్తే..బౌలింగ్ పరంగా మెరుగ్గా కనిపిస్తున్న జీటీ..సూర్యవంశీ దూకుడుకు పగ్గాలు వేయకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రబాడ, సిరాజ్, హోల్డర్, రషీద్‌ఖాన్ రూపంలో జీటీ బౌలింగ్ దళం బలంగా కనిపిస్తున్నా..క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ఆ అంచనాలను తలక్రిందులు చేసింది. సూర్యవంశీకి తోడు జైస్వాల్, జురెల్ చెలరేగితే ఆర్ఆర్కు భారీ స్కోరు పక్కా. బౌలింగ్ విషయానికొస్తే..జోఫ్రా ఆర్చర్ ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల భరతం పడుతున్నాడు. సూర్యవంశీ, ఆర్చర్..జీటీతో పోరులో కీలకం కానున్నారు. ఈ ఇద్దరు చెలరేగితే రాజస్థాన్‌కు ఫైనల్ బెర్తు ఖాయమైనట్లే.
ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమితో జీటీ ఒకింత ఒత్తిడిలో ఉంది. టాప్-3 బ్యాటర్లు సుదర్శన్, గిల్, బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. లీగ్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ ముగ్గురు నిలదొక్కుకుంటే రాజస్థాన్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే వీరు విఫలమైతే గనుక జీటీ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినట్లే. అంతగా అనుభవం లేని నిశాంత్ సిద్ధుకు తోడు సుందర్, రాహుల్ తెవాటియాపై అంతగా అంచనాలు లేవు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా రషీద్‌కు తోడు మరో అదనపు స్పిన్నర్‌ను తీసుకునే అవకాశముంది. అంతకుమించి మార్పులేమి ఉండకపోవచ్చు. లీగ్‌లో వికెట్ల వేట కొనసాగిస్తున్న రబాడ, సిరాజ్ మరోమారు విజృంభిస్తే..రాజస్థాన్ దూకుడు కళ్లెం వేయవచ్చు. సూర్యవంశీని మొదట్లోనే ఔట్ చేస్తే మిగతా పనిని లాంఛనంగా పూర్తిచేయవచ్చు.