నయా సీజన్లో నయా కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తైంది. పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా, సఫారీ సంచలనం గెరాల్డ్ కొయెట్జీలు తమ బౌలింగ్‌తో గుజరాత్ టైటాన్స్‌కు చుక్కలు చూపించగా.. మోస్తారు ఛేదనలో సఫారీ కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్, తాజా, మాజీ సారథి రోహిత్ శర్మలు ధాటిగా ఆడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖర్లో వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై.. విజయానికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయింది. గిల్ సారథ్యంలో మూడో సీజన్ ఆరంభించిన గుజరాత్.. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది.
IPL | అహ్మదాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న మూడో సీజన్లో రెండు సార్లు ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్.. సమిష్టితత్వానికి మరోసారి అసలు సిసలైన నిర్వచనం ఇచ్చింది. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరున్న ముంబై ఇండియన్స్ ముందు మోస్తారు లక్ష్యాన్ని నిలిపినా ఆ జట్టు.. దానిని కాపాడుకోగలిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్‌లో గుజరాత్.. 6 పరుగుల తేడాతో ముంబైపై పైచేయి సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39 బంతుల్లో 45, 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (22 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. ముంబై స్టార్ పేసర్ బుమ్రా బంతితో నిప్పులు చెరిగాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా దక్షిణాఫ్రికా బౌలర్ కొయెట్జీ (2/27) ముంబై తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అనంతరం ఛేదనలో డెవాల్డ్ బ్రెవిస్ (38 బంతుల్లో 46, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఆఖర్లో ఒత్తిడికి చిత్తైన ముంబై ఓటమి వైపు నిలిచింది. ఆరంభంలో తేలిపోయిన గుజరాత్ బౌలర్లు.. ఆఖర్లో మాత్రం ఆకట్టుకున్నారు. సాయి సుదర్శన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
బుమ్రా మ్యాజిక్..
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (19), శుభ్‌మన్ గిల్ లు తొలి వికెట్‌కు 4 ఓవర్లలోనే 31 పరుగులు జోడించారు. కానీ బుమ్రా రాకతో గుజరాత్‌కు కష్టాలు మొదలయ్యాయి. అతడు వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో దూకుడుగా ఆడిన గిల్‌ను చావ్లా.. గూగ్లీతో బోల్తా కొట్టించాడు. అజ్మతుల్లా ఒమర్జయ్ (17) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. సాయి సుదర్శన్‌తో కలిసి మూడో వికెట్‌కు 26 బంతుల్లోనే 40 పరుగులు జోడించిన అజ్మతుల్లాను కొయెట్జి ఔట్ చేశాడు. గుజరాత్‌ను ఆదుకున్న సుదర్శన్‌తో పాటు ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (12)ను బుమ్రా ఒక్క ఓవర్లోనే ఔట్ చేయడంతో ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో తడబడింది. రాహుల్ తెవాటియా (15 బంతుల్లో 22, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆఖర్లో ధాటిగా ఆడి టైటాన్స్‌కు పోరాడగలిగే స్కోరును అందించాడు.
ముంబై బాదుడు..
మోస్తారు ఛేదనలో ముంబైకి మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు నెలల విరామం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న ఇషాన్ కిషన్.. డకౌట్ అయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన నమన్ ధీర్ (10 బంతుల్లో 20, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఉన్నది కొద్దిసేపే అయినా దూకుడుగా ఆడాడు. అజ్మతుల్లా వేసిన మూడో ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. 30 పరుగులుకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబైని లూక్ వుడ్ ప్లేస్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సఫారీ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌తో కలిసి మాజీ సారథి రోహిత్ శర్మ ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ అదును చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించారు. 55 బంతుల్లో 77 పరుగులు జతచేసిన ఈ జోడీని సాయికిషోర్ విడదీశాడు. అతడు వేసిన 13వ ఓవర్లో మొదటి బంతికే రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అర్థ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఉండగా బ్రెవిస్.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.
ఆఖర్లో ఉత్కంఠ..
గెలుపు దిశగా వెళ్తున్న ముంబై రోహిత్, బ్రెవిస్‌లు ఔట్ అవడంతో డీలా పడింది. 17వ ఓవర్లో రషీద్ 3 పరుగులే ఇవ్వగా 18వ ఓవర్లో మోహిత్ శర్మ తన అనుభవన్నంతా రంగరించి బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో 9 పరుగులే రాగా డేంజరస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (11) కూడా ఔట్ అయ్యాడు. 19వ ఓవర్ వేసిన స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన తిలక్ వర్మ మరుసటి బంతికే భారీ షాట్ ఆడబోఇయ అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఐదో బంతికి కొయెట్జీ.. జాన్సన్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్లో ముంబైకి 19 పరుగులు అవసరమయ్యాయి. ఉమేశ్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో తొలి రెండు బంతులను 6, 4 గా మలిచిన పాండ్యా మూడో బంతికి ఔట్ అయ్యాడు. ఇదే క్రమంలో చావ్లా డకౌట్ అయ్యాడు. చివరి ఓవర్లో ఉమేశ్ 12 పరుగులే ఇచ్చి గుజరాత్‌కు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ : 20 ఓవర్లలో 168/6 (సాయి సుదర్శన్ 45, గిల్ 31, బుమ్రా 3/14, కొయెట్జి 2/27)
ముంబై : 20 ఓవర్లలో 162/9 (రోహిత్ శర్మ 43, బ్రెవిస్ 46, జాన్సన్ 2/25, మోహిత్ శర్మ 2/32)