టీ కొట్టు నుంచి.. బర్మింగ్‌హామ్ రజతం వరకు..
మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన సంకేత్ సర్గర్ కుటుంబం.. రోడ్డు పక్కన టీ కొట్టు జీవనాధారంగా గడుపుతున్నది. వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి పేరు ప్రఖ్యాతలు సాధించాలనుకున్న తండ్రి మహాదేవ్.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా లిఫ్టింగ్‌కు దూరమయ్యాడు. తన కలను కొడుకు రూపంలో తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు తగ్గట్లే చిన్నతనం నుంచే అతడికి బరువులు ఎత్తడం అలవాటు చేశాడు. అందుకు సంకేత్ ఎన్నో సంతోషాలకు దూరం కావాల్సి వచ్చింది.
మెరుగైన శిక్షణకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం.. తన తండ్రితో కలిసి టీ కొట్టుకు వెళ్లే సంకేత్.. అక్కడి నుంచి ప్లాస్క్‌లో చాయ్ తీసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లి అమ్మి వచ్చేవాడు. ఆ తర్వాత జిమ్‌లో కసరత్తులు చేసి పాఠశాలకు చేరుకునేవాడు. చదువు పూర్తి కాగానే అటు నుంచి అటే తండ్రికి చేదోడుగా ఉంటూ కిల్లీలు కట్టిన సాకేత్.. రాత్రి వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసేవాడని అతడి చిన్ననాటి కోచ్ మయూర్ తెలిపాడు. ‘దిగ్విజయ్ వ్యాయమశాల’లో ఓనమాలు నేర్చుకున్న సంకేత్.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించడం ద్వారా భారత పతకాల ఖాతా తెరిచాడు.
చెల్లి కూడా అదే బాటలో..: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. నిలకడగా విజయాలు సాధించిన సంకేత్‌కు ‘టాప్స్’లో చోటు దక్కడంతో ఆ కుటుంబం కాస్త కుదుట పడింది. అప్పటి వరకు డైట్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టలేక పడ్డ ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇక అక్కడి నుంచి సంకేత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మూడు సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్.. సీనియర్ కోచ్ విజయ్ నేతృత్వంలో కామన్వెల్త్కు సిద్ధమయ్యాడు.
అంచనాలను అందుకుంటూ పోడియం ఫినిష్ చేసిన సంకేత్.. గాయపడకపోతే స్వర్ణం సాధించేవాడినే అని ఆశాభావం వ్యక్తం చేశాడు. అన్న వేసిన దారిలో నడుస్తున్న సంకేత్ చెల్లెలు కాజల్.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసింది. బాలికల 40 కేజీల విభాగంలో కాజల్ నిలకడగా రాణిస్తూ.. భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

