సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ను ఫార్ములా రేసింగ్ ఫీవర్ ఊపేస్తున్నది. అంతా రేసింగ్ మీదనే ముచ్చట నడుస్తున్నది. ఓవైపు చలితో నగరం మంచు దుప్పటి కప్పుకున్న వేళ రేసింగ్‌తో వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. రెండు నెలల వ్యవధిలో రెండు ఫార్ములా రేసులకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతున్నది. తొలుత ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగనుండగా, ఫిబ్రవరిలో ఫార్ములా-ఈ రేసుకు వేదిక అవుతున్నది. దేశంలోని మిగతా నగరాలను వెనుకకు నెడుతూ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భాగ్యనగరం ఫార్ములా-ఈ రేసు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు తగ్గట్లు ట్రాక్‌ను నిర్మిస్తున్నది.
భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వబోతున్న ఈ రేసు కోసం ప్రభుత్వం 2.7కి.మీల ట్రాక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిరంతరం శ్రమిస్తున్నది. రాష్ట్ర నూతన సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ విగ్రహం వద్ద మొదలయ్యే రేసు ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఐమ్యాక్స్ మీదుగా తిరిగి లుంబని పార్క్ వరకు సాగనుంది. ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో ట్రాక్ సర్క్యూట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
19, 20తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్:
ఫార్ములా-ఈ కంటే ముందు నగరంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగుతున్నది. స్ట్రీట్ సర్క్యూట్లో భాగంగా తొలి ఎడిషన్ వేదికలు ఖరారయ్యాయి. ఐదు జట్ల సమాహారంగా నిర్వాహకులు లీగ్‌కు రూపకల్పన చేశారు. హైదరాబాద్, చెన్నై వేదికలుగా జరిగే రేసింగ్ లీగ్‌లో మన దేశ రేసర్లతో పాటు పలువురు విదేశీ యులు బరిలోకి దిగుతున్నారు.
మొత్తం ఐదు జట్లు (హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, గోవా ఏసెస్, చెన్నై టర్బోరైడర్స్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, స్పీడ్డిమాన్స్ ఢిల్లీ) జట్లు పోటీలో ఉన్నాయి. దేశంలో ఫార్ములా రేసింగ్‌ను అభిమానులకు మరింత చేరువ చేసేందుకు నిర్వాహకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 10, 11తేదీల్లో జరిగే రేసుతో లీగ్‌కు తెరపడనుంది. దాదాపు రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్ వేదికగా రెండు ప్రతిష్ఠాత్మక ఫార్ములా రేసులు నగర వాసులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
నగర వ్యాప్తంగా హోర్డింగ్స్…
దేశ వ్యాప్తంగా ఎన్నో మెట్రో నగరాలు ఉన్నా, ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా రేసింగ్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహిస్తుండడంతో అందుకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే సోషల్‌మీడియాలో ప్రచారం మొదలు కాగా, తాజాగా నగరంలో భారీ ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ర్టానికి గర్వకారణం
ప్రపంచంలోని 12 నగరాల్లో జరుగుతున్న ఫార్ములా-ఈ పోటీల్లో హైదరాబాద్ మహానగరం ఉండడం రాష్ర్టానికి గర్వకారణం. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న రేసింగ్ ఔత్సాహికులను స్వాగతించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
-మంత్రి కేటీఆర్ ట్వీట్