ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ ( Chris Cairns ) కోలుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లైఫ్ సపోర్ట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. మేటి ఆల్‌రౌండర్ అయిన కెయిన్స్‌కు సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స అందించారు. కార్డియాక్ యూనిట్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో ఆయనకు చికిత్స నిర్వహించారు. ఆరోటిక్ డిసెక్షన్‌తో ఆయన ఇబ్బందిపడ్డట్లు తెలిపారు. ప్రస్తుతం కుటుంబసభ్యులతో క్రిస్ కెయిన్స్ మాట్లాడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. 1989 నుంచి 2004 మధ్య కాలంలో కెయిన్స్ 62 టెస్టులు ఆడాడు.