పదునైన ఆఫ్స్పిన్కు ‘దూస్రా’లను జోడించి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినా.. తనను రెచ్చగొట్టిన వారితో సై అంటే సై అంటూ మైదానంలోనే బాహాబాహీకి సిద్ధమైనా.. తోటి ఆటగాళ్లతోనే కలబడి చెంపదెబ్బ కొట్టినా.. యువరాజ్‌తో కలిసి భాంగ్రా నృత్యాలతో డ్రెస్సింగ్ రూమ్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చినా..
సెహ్వాగ్‌తో కలిసి పంచ్‌లు ప్రాసలతో తోటి ప్లేయర్లనే ఆట పట్టించినా.. సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజాల సమక్షంలోనే యథేచ్చగా జోకులు వేసినా.. అది ఒక్క హర్భజన్ సింగ్‌కే చెల్లింది. దాదాపు పాతికేండ్లుగా భారత క్రికెట్‌కు సేవలందించి శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భజ్జీపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:అప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మసకబారిన భారత క్రికెట్ ప్రభకు వెలుగులద్దేందుకు ప్రయత్నిస్తున్న అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీకి.. హర్భజన్ ఓ ఆశాకిరణంలా కనిపించాడు. బరిలోకి దిగితే వంద శాతం కష్టపడే తత్వంతో పాటు కచ్చితంగా గెలువాలన్న భజ్జీ కసిని గుర్తించిన దాదా అతడికి వరుస అవకాశాలు ఇవ్వగా.. వాటిని ఈ ‘జలంధర్కా షేర్’రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. టీమ్ఇండియా క్రికెట్ గతిని మార్చిన 2001 ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తో.. హర్భజన్ రూపంలో యావత్ భారతావనికి కొత్త హీరో దొరికాడు. కోల్‌కతా వేదికగా జరిగిన చారిత్రక టెస్టులో హ్యాట్రిక్ పడగొట్టడంతో పాటు మూడు మ్యాచ్‌ల్లో కలిపి 32 వికెట్లు తీసి భళా అనిపించుకున్న భజ్జీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. చిత్రమైన రన్నప్‌కు తోడు దూకుడైన స్వభావంతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆఫ్ స్పిన్నర్.. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్ సీనియర్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ నుంచి నేర్చుకున్న దూస్రాలతో ప్రపంచ క్రికెట్‌ను దశాబ్ద కాలం శాసించిన భజ్జీ 2011 తర్వాత తన ప్రభ కోల్పోయాడు. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన హర్భజన్.. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓఝా, అమిత్ మిశ్రా వంటి స్పిన్నర్ల రాకతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. సుదీర్ఘ కెరీర్లో 103 టెస్టులు ఆడిన భజ్జీ 417 వికెట్లతో.. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), అశ్విన్ (427) తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
వివాదాల్లో ముందుంటూ..
తన ఆఫ్‌స్పిన్‌తో పాటు క్లిష్ట సమయాల్లో బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించిన హర్భజన్.. కొన్నిసార్లు వివాదాలతోనూ వార్తల్లోకెక్కాడు. ‘మంకీ గేట్’వివాదంలో ఆసీస్ ఆల్‌రౌండర్ సైమండ్స్‌తో తలపడేందుకు సిద్ధమైన భజ్జీ.. గ్రేగ్ చాపెల్, సౌరవ్ గంగూలీ మధ్య కోల్డ్‌వార్‌లో బాహాటంగా కెప్టెన్‌కు అండగా నిలిచి తన భిన్నమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఇక ఐపీఎల్లో సహచర ఆటగాడు శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టి సస్పెన్షన్‌కు గురైన భజ్జీ.. మైదానం బయట తన భాంగ్రా నృత్యంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో తెగ సందడి చేసిన భజ్జీ.. పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. నెట్స్‌లో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, ధోనీ వంటి ఆటగాళ్లనే ముప్పుతిప్పలు పెట్టిన భజ్జీ.. తన పీక్ స్టేజ్‌లో ఆఫ్స్పిన్కు అనధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు. దూస్రాలు, ఫ్లిప్పర్స్, ఆఫ్ కట్టర్స్‌తో దశాబ్దకాలం పాటు ప్రత్యర్థులకు సింహస్వప్నంలా నిలిచిన భజ్జీ.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. ఆస్ట్రేలియాతో 18 టెస్టులాడిన భజ్జీ 95 వికెట్లు పడగొట్టాడంటే.. కంగారూలపై అతడి విజృంభణ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టి మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తాలా.. లేక రాజకీయాల్లో చేరి సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలా అనే సందిగ్ధంలో ఉన్న హర్భజన్‌కు మనమూ ‘ఆల్ ది బెస్ట్’చెబుదాం!
1995లో నెట్స్‌లో నీతో తొలిసారి పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. జట్టు కోసం పరితపించే గొప్ప ప్లేయర్‌వి నువ్వు. మైదానంలో అయినా డ్రెస్సింగ్‌రూమ్‌లో అయినా సహచరులను నవ్విస్తూ చలాకీగా ఉండే నీ తత్వం నాకెంతో ఇష్టం. సుదీర్ఘ కెరీర్లో నీతో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాటిని నేనెప్పటికీ మరువలేను. కెరీర్ ఆసాంతం దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అందించేందుకు తపన పడ్డావు.. ఇక దూస్రా ఫేజ్ (తదుపరి ఇన్నింగ్స్)లోనూ నీకు శుభం కలుగాలని ఆశిస్తున్నా. -సచిన్ టెండూల్కర్