గన్ను ఎక్కు పెట్టిన ప్రతిచోటా రికార్డులు బద్దలు కొడుతూ.. బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకాల పంట పండిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పదహారేండ్ల చిన్నది.. తాజా జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు నెగ్గి అదుర్స్ అనిపించుకుంది! పదమూడేండ్ల ప్రాయంలోనే జాతీయ చాంపియన్‌గా నిలిచి షూటింగ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఆ యువ సంచలనమే ఇషా సింగ్. 64వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ఆరు పతకాలు వస్తే.. ఆ ఆరు ఆమె ఖాతాలోకే వెళ్లాయంటే.. ఇషా ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు! పారిస్ ఒలింపిక్స్ (2024)లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఇషా.. నమస్తే తెలంగాణతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు నెగ్గడం ఆనందంగా ఉంది. ఇది ఒక్క రోజులో వచ్చిన ఫలితం కాదు. గత కొన్నేండ్లుగా రోజుకు ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా. నాన్న సచిన్ సింగ్ ప్రోత్సాహం, వేద్‌ప్రకాశ్ సార్ కోచింగ్‌లో ఎప్పటికప్పుడు మెరుగవుతూ నన్ను నేను తీర్చి దిద్దుకుంటున్నా. టోర్నీ ఏదైనా బరిలోకి దిగితే అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఒక్కసారి పిస్టల్ పట్టి లక్ష్యాన్ని గురి పెడితే.. మరే విషయాలు పట్టించుకోను. ప్రస్తుతం జూనియర్ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా. భవిష్యత్తులో అంతర్జాతీయ స్టేజ్‌పై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. పారిస్ ఒలింపిక్స్ (2024) గురించి ఆలోచన ఉన్నా.. చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు సాగుతా. తదుపరి టోర్నీపైనే ఎక్కువ దృష్టి పెడతా!
ఇతర క్రీడలతో పోల్చుకుంటే.. షూటింగ్‌కు ఎక్కువ ఏకాగ్రత అవసరం. దీంట్లో 95 శాతం మెదడు పనే ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడంతో పాటు గురి కుదిరితేనే ఫలితం అనుకూలంగా వస్తుంది. అందుకు సరైన మైండ్‌సెట్ అవసరం. దీని కోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తా. ఇది వ్యక్తిగత క్రీడ కాబట్టి స్వశక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆట మీద ఇష్టం ఉన్నవాళ్లే దీన్ని ఎంపిక చేసుకుంటారు. గంటల తరబడి మనసు లగ్నం చేసి ఒంటరిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
షూటింగ్ అంటే నిల్చొని పేల్చడమే కదా.. దీనికి ఫిట్నెస్తో పనేముంది అనుకోవచ్చు! కానీ లక్ష్యానికి గురిపెట్టే సమయంలో శరీర పైభాగం సమతూకం తప్పనిసరి. అప్పర్ బాడీలో చాలా స్ట్రెంగ్త్ కావాల్సి ఉంటుంది. అందుకోసం వారంలో ఐదు రోజుల పాటు ఎక్సర్సైజ్లు చేస్తా. డైట్ విషయంలోనూ కచ్చితంగా ఉంటా. నగరంలోని రాక్వెల్ ఫోర్డ్ పాఠశాలలో పదకొండో తరగతి చదువుతున్నా. నాకు అనుకూలమైనప్పుడే పరీక్షలు నిర్వహిస్తూ.. నా విజయాల్లో పాఠశాల యాజమాన్యం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది.
కరోనా వైరస్ కారణంగా క్రీడాలోకం స్తంభించిపోయింది. అయితే షూటింగ్ ప్రాక్టీస్ కోసం బయటకు వెళ్లాల్సిన పని లేకుండా.. మా నాన్న ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేయడంతో శిక్షణకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కొత్త షూటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గత మూడేండ్లుగా రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లలో పాల్గొనడం లేదు. కేవలం జాతీయ, అంతర్జాతీయ టోర్నీలపైనే దృష్టి పెట్టా. మనుభాకర్, రాహి సర్నోబత్తో కలిసి చాలా టోర్నీల్లో పాల్గొన్నా.
ఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో జరిగిన 64వ జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే సమయంలో నాతో పాటు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి కూడా వచ్చారు. పోటీలు ముగిసే వరకు మాతోనే ఉండి ఎంతో ప్రోత్సహించారు. ఆయన సహకారం మరువలేనిది. తెలంగాణలో ఎక్కువ శాతం మంది షూటింగ్‌ను హాబీగానే చూస్తారు. అందుకే మెరుగైన ప్రాక్టీస్ కోసం తరచూ ఢిల్లీకి వెళ్తుంటా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తా!