న్యూయార్క్: నార్వే యువ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) అద్భుతం సృష్టించాడు. గ్రూప్ ఐ లో భాగంగా సెనిగల్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే 3-2 గోల్స్ తేడాతో విజయం నమోదు చేసింది. నార్వే తరపున హాలాండ్ రెండో గోల్స్ చేశాడు. దీంతో ఆ జట్టు నాకౌట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాంచెస్ట్ సిటీకి చెందిన స్ట్రయికర్ హాలాండ్.. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఇప్పటికే తన ఖాతాలో నాలుగు గోల్స్ వేసుకున్నాడు. నార్వే తరపున 43వ నిమిషంలో పీడరసన్ తొలి గోల్ చేశాడు. ఇక ఆ తర్వాత యువ ప్లేయర్ హాలాండ్ తన సత్తా చాటాడు. 48వ నిమిషంలో హాలాండ్ ఈ మ్యాచ్‌లో తన మొదటి గోల్ చేశాడు. మళ్లీ 58వ నిమిషంలో హాలాండ్ మరో గోల్ చేశాడు. నార్వే తరపున ఆడిన గత 12 మ్యాచుల్లో హాలాండ్ గోల్స్ స్కోరు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న హాలాండ్.. రెండు మ్యాచుల్లోనే నాలుగు గోల్స్ చేశాడు. 25 ఏళ్ల ఆ స్టార్ ప్లేయర్ ఫస్ట్ హాఫ్‌లో చాలా నెమ్మదిగా ఆడాడు. కానీ సెకండ్ హాఫ్‌లో తన గేమ్ స్పీడ్ పెంచాడు. గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో నార్వే ఆడనున్నది. ఈ రెండు జట్లు ఇప్పటికే తమ గ్రూపు నుంచి నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి.