న్యూఢిల్లీ: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్లను సున్నితంగా హెచ్చరించాడు. తన బౌలింగ్‌లో పరుగుల కోసం స్వీప్స్ షాట్స్‌ను మంచి ఆప్షన్ అనుకోవడం పొరపాటని అన్నాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు చాలామంది తన బౌలింగ్‌లో స్వీప్ షాట్స్‌కే ప్రయత్నించడంపై జడేజా స్పందించాడు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి వికెట్‌పైన (స్పిన్‌కు అనుకూలమైన వికెట్) నా బౌలింగ్‌లో స్వీప్ షాట్స్‌ను మంచి ఆప్షన్‌గా ఎంచుకోవడం తప్పని చెప్పాడు.
ఇవాళ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఆరు మంది జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్స్ లేదా రివర్స్ స్వీప్ షాట్స్‌కు ప్రయత్నించి ఔటయ్యారు. దాంతో జడేజా టెస్టుల్లో తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. 42 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన మూడు వికెట్లను మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
‘ఇవాళ నేను నా బౌలింగ్‌ను ఎంజాయ్ చేశాననుకుంటున్నా. ఇలాంటి వికెట్లు నాకు సూటవుతాయి. ఎందుకు బంతి బాగా స్పిన్నవడమేగాక ఎక్కువగా పైకి లేవడం లేదు. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు స్వీప్ లేదా రివర్స్ స్వీప్ షాట్లకు ప్రయత్నిస్తారని నేను ముందే ఊహించా. అందుకే నేరుగా వికెట్ల మీదుకు బంతులు వేస్తే వాళ్లు స్వీప్ షాట్లకు ప్రయత్నించినప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా నాకు లబ్ధి జరుగుతుందని పసిగట్టా’ అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో జడేజా చెప్పాడు.
అనుకున్నట్టుగానే పథకాన్ని అమలు చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. అందుకే తన బౌలింగ్‌లో స్వీప్ షాట్స్‌తో పరుగులు రాబట్టాలనుకోవడం మంచి నిర్ణయం కాదని హెచ్చరించాడు. కాగా, రెండు టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.