యశ్పాల్ శర్మ బాదాం షాట్ గురించి మీకు తెలుసా?

ముంబై: క్రికెట్లో వెరైటీ షాట్ల గురించి చెప్పమంటే.. ప్రతి ఒక్కరూ స్విచ్ హిట్, స్కూప్, అప్పర్కట్లాంటి వాటిని ఠక్కున చెప్పేస్తారు. ఈ షాట్లకు క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఈ షాట్లేవీ లేని సమయంలోనే మన 1983 వరల్డ్‌కప్ హీరో యశ్పాల్ శర్మ ఆడిన ఓ షాట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులను నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ బౌలర్ బాబ్ విల్లిస్ బౌలింగ్‌లో యశ్పాల్ ఆడిన ఆ షాటే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దీనికి ముద్దుగా బాదాం షాట్ అని పేరుంది. ఈ షాట్‌ను కనిపెట్టిన యశ్పాల్ శర్మ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అయితే అసలు ఈ షాట్ ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఓ సారి చూద్దాం.
బాదాం షాట్.. ఆ పేరెలా వచ్చింది?
బాబ్ విల్లిస్ బౌలింగ్‌లో ఫ్లిక్, స్లాగ్ కలగలిపి యశ్పాల్ ఆ షాట్ ఆడాడు. వికెట్లకు అడ్డంగా వెళ్తూ లెగ్‌సైడ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ షాట్‌ను ఎందుకు అలా పిలుస్తారో ఆ మధ్య యశ్పాల్ శర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు బాదాంలు తినడం అలవాటని, వాటిని తినడం వల్లే ఆ షాట్ ఆడే ఆత్మవిశ్వాసం తనలో కలిగిందని యశ్పాల్ వెల్లడించారు. నా జేబులో ఎప్పటికీ బాదాం ఉంటాయి. కపిల్ పాజీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో అందరికీ తెలుసు. కానీ నా సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ మాత్రం బాదామే అని యశ్పాల్ ఆ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు.
ఆ షాట్ మూలాలేంటి?
1983, జూన్ 22న జరిగిన ఆ మ్యాచ్‌లో తాను ఆ షాట్ ఆడిన సందర్భంగా గురించి కూడా యశ్పాల్ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ షాట్ నాకు చాలా ఇష్టం. దానిని నేను చాలా బాగా ఆడగలను. ఆ సమయంలో ఫాస్ట్ బౌలర్‌ను లాంగాఫ్ మీదుగా ఆడాలంటే చాలా డేంజర్. అందుకే బౌలర్ పేస్‌ను ఉపయోగించుకునే షాట్ ఆడాలనుకున్నాను. అప్పుడే 1979లో వివియన్ రిచర్డ్స్ ఆడిన ఫ్లిక్ షాట్ గుర్తొచ్చింది. ఆ షాట్‌కే నేను నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన కొత్త షాట్‌ను కలిపి ఆడాలని నిర్ణయించుకున్నాను. నెట్స్‌లో ఈ షాట్ ఆడబోయి చాలాసార్లు శరీరానికి దెబ్బలు తగిలించుకున్నాను. కానీ ఆ తర్వాత ఏ బాల్‌కు అలాంటి షాట్ ఆడాలో తెలుసుకున్నాను అని యశ్పాల్ చెప్పారు.
ఆపద్బాంధవుడు
యశ్పాల్ శర్మను సునీల్ గవాస్కర్ చాలాసార్లు జట్టు మనిషిగా, కష్టాల్లో ఆదుకునే ఆపద్భాందవుడిగా అభివర్ణించారు. 1983 వరల్డ్‌కప్‌లోనూ ఆయన మూడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌పై యశ్పాల్ చేసిన 89 పరుగులు విజయాన్ని సాధించిపెట్టాయి. ఆ తర్వాత క్వార్టర్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కీలకమైన 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ఇక సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై యశ్పాల్ చేసిన 61 పరుగులకే టీమిండియాను ఫైనల్ చేర్చాయి. కింద ఉన్న వీడియోలో యశ్పాల్ ఆడిన రెండో షాట్‌నే బాదాం షాట్‌గా పిలుస్తారు.
WATCH: #YashpalSharma’s brilliant batting in the semi-final of 1983 World Cup against England. pic.twitter.com/uZr7k0FpPx
— Madhav Sharma (@MadhavSharma) July 13, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

