అమెరికా నయా సంచలనం కోకో గాఫ్.. తన ఆటతో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కేక పుట్టించింది. గతేడాది క్వార్టర్స్‌లో వెనుదిరిగిన ఈ 18 ఏండ్ల చిన్నది.. ఈ సారి పట్టు వదలకుండా ప్రయత్నించి తన దేశానికే చెందిన స్టిఫెన్స్ను చిత్తు చేసి తొలిసారి సెమీఫైనల్లో అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కార్లోస్ అల్కరాజ్పై అలెగ్జాండర్ జ్వెరెవ్ పోరాడి విజయం సాధించగా.. ఏడేండ్ల తర్వాత రోహాన్ బోపన్న జంట గ్రాండ్స్లామ్సెమీఫైనల్కు చేరింది.
పారిస్: అమెరికా యువ కెరటం కోకో గాఫ్ నయాచరిత్ర లిఖించింది. 18 ఏండ్ల వయసులోనే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరి అదుర్స్ అనిపించింది. గతేడాది క్వార్టర్స్‌కు చేరిన గాఫ్.. మంగళవారం ఆ అడ్డంకిని అధిగమించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో గాఫ్ 7-5, 6-2తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టిఫెన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. ఇటీవలే స్కూల్ డిప్లమా పూర్తి చేసి ఈఫిల్ టవర్ దగ్గర ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ చిన్నది.. కీలక పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస సెట్లలో విజయం సాధించింది.
‘గతేడాది క్వార్టర్స్‌లో ఎదురైన ఓటమి నన్ను మరింత బలంగా ఆడేలా చేసింది. ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు వల్లే ఈ విజయం సాధ్యమైంది. గతంలో ఇతరుల అంచనాలు అందుకునేందుకు కష్టపడేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా నన్ను నేను నమ్మడం మొదలుపెట్టా’ అని మ్యాచ్ అనంతరం గాఫ్ పేర్కొంది. అతి పిన్న వయసు (15 ఏండ్లు)లో వింబుల్డన్ (2019)కు ఎంపికైన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన గాఫ్.. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌ను చిత్తు చేసి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. మరో క్వార్టర్స్‌లో మార్టీనా ట్రెవిసన్ (ఇటలీ) 6-2, 6-7 (3/7), 6-3తో లైలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. 28 ఏండ్ల వయసులో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరుకున్న మార్టీనాతో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-4, 4-6, 7-6 (9/7)తో యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.
భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న.. చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ ఆటతో ఆకట్టుకున్నాడు. ఏడేండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 4-6, 6-4, 7-6తో లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)-హెన్రీ హెలీవరా (ఫిన్లాండ్) జంటపై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. తొలి సెట్లో ఓటమి పాలైన భారత జోడీ.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో విజృంభించింది. 2015 వింబుల్డన్ తర్వాత బోపన్న సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి కాగా.. గురువారం జరుగనున్న పోరులో మార్సెలో అరెవాలో-జీన్ జూలియన్ రోజర్ ద్వయంతో బోపన్న జంట అమీతుమీ తేల్చుకోనుంది.